Begin typing your search above and press return to search.

మాస్ట్రో ట్రెండ్ మ‌ళ్లీ మొద‌లైన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   23 Jun 2022 8:30 AM GMT
మాస్ట్రో ట్రెండ్ మ‌ళ్లీ మొద‌లైన‌ట్టేనా?
X
70వ ద‌శ‌కం నుంచి ఇళ‌య‌రాజా పాట‌లేని సినిమా లేదంటే అతి అతిశ‌యోక్తి కాదు. త‌మిళ‌, తెలుగు చిత్రాల‌తో ద‌క్షిణాదిలో త‌న‌దైన సంగీతం తో ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. ప్ర‌తీ పాట ఓ మ‌ధుర‌మే అనే స్థాయిలో ఆయ‌న బాణీలు స‌మ‌కూర్చారు. ఇప్ప‌టికీ ఇళ‌య‌రాజా సంగీతం అందించిన పాట‌లు ఎవ‌ర్ గ్రీన్ సాంగ్స్ గా నిలిచి సంగీత ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌కు మ‌రెవ‌రూ సాటి లేర‌ని, సాటి రారాని నిరూపించాయి.

ఇక 80వ ద‌శ‌కం నుంచి త‌మిళ, తెలుగు భాష‌ల్లో ఆయ‌న చేసిన ప్ర‌తీ సినిమా మ్యూజిక‌ల్ హిట్టే.. ఆయ‌న పాట లేని సినిమా లేదు. అంత‌గా ద‌క్షిణాది సినిమాని త‌న‌దైన సంగీతంతో మాస్ట్రో ఇళ‌య‌రాజా శాసించార‌ని చెప్పొచ్చు. వెండితెర‌పై త‌రాలు మారుతున్నా త‌న సంగీతానికున్న క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. కెరీర్ తొలి నాళ్ల‌లో ఇళ‌య‌రాజా సంగీతాన్ని ఎంత‌గా ఇష్ట‌ప‌డేవారో ఇప్ప‌టికీ అంతే ఇష్టాన్ని ప్రద‌ర్శిస్తూ ఆయ‌న చేత త‌మ సినిమాల‌కు బాణీలు క‌ట్టించుకోవాల‌ని ఎదురుచూస్తున్న ద‌ర్శ‌కులు చాలా మందే వున్నారు.

2010 త‌రువాత ఇళ‌యారాజా ప్ర‌భావం కొంత వ‌ర‌కు త‌గ్గినా తిరిగి ఆయ‌నే కావాల‌ని వెంట ప‌డుతున్న ద‌ర్శ‌కులు, హీరోలు చాలా మందే వున్నారు. తాజాగా మ‌ళ్లీ ఆయ‌న వ‌రుసగా క్రేజీ సినిమాలు అంగీక‌రిస్తుండ‌టంతో అంతా మాస్ట్రో ట్రెండ్ మ‌ళ్లీ మొద‌లైన‌ట్టేనా అని అంటున్నారు. తెలుగులో మోహ‌న్ బాబు న‌టించిన 'స‌న్ ఆఫ్ ఇండియా' మూవీకి సంగీతం అందించారు ఇళ‌య‌రాజా. ఈ మూవీ త‌రువాత ఆయ‌న యంగ్ హీరో నాగ‌చైత‌న్య సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

వెంక‌ట్ ప్ర‌భు ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై ఈ మూవీని నిర్మాత శ్రీ‌నివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో రూపొంద‌నున్న ద్వి భాషా చిత్ర‌మిది. ఇందులో నాగ‌చైత‌న్య‌కు జోడీగా బేబ‌మ్మ కృతిశెట్టి హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇదే మూవీకి మాస్ట్రో ఇళ‌య‌రాజాతో క‌లిసి ఆయ‌న త‌న‌యుడు, క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించ‌బోతున్నారు. ఇలా ఇద్ద‌రు తండ్రీ కొడుకులు క‌లిసి సంగీతం అందిస్తున్న సినిమా ఇదే కావ‌డం విశేషం.

గోపీచంద్ న‌టించిన 'ఆక్సిజ‌న్‌' త‌రువాత తెలుగులో మంచి సినిమాకు మాత్ర‌మే సంగీతం అందిస్తాన‌ని గ‌త కొంత కాలంగా తెలుగు సినిమాలకు యువ‌న్ శంక‌ర్ రాజా దూరంగా వుంటూ వ‌స్తున్నారు. తాజాగా తండ్రి ఇళ‌య‌రాజాతో క‌లిసి నాగ‌చైత‌న్య చిత్రానికి సంగీతం ఓకే చెప్ప‌డం విశేషం.

ఈ ప్రాజెక్ట్ కు ముందే శ‌ర్వానంద్ హీరోగా యంగ్ డైరెక్ట‌ర్ కృష్ణ చైత‌న్య తెర‌కెక్కించ‌నున్న మూవీ స్టోరీ త‌న‌ని ఇన్స్‌ప్పైర్ చేసింది కాబ‌ట్టే దాదాపు ఆరేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ తెలుగు సినిమా కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట యువ‌న్‌. ఈ మూవీ త‌రువాతే నాగ‌చైత‌న్య - వెంక‌ట్ ప్ర‌భుల‌ మూవీని ఓకే చేయ‌డం గ‌మ‌నార్హం.