Begin typing your search above and press return to search.

‘భరత్’ వసూళ్లపై అయోమయం

By:  Tupaki Desk   |   26 April 2018 8:00 PM IST
‘భరత్’ వసూళ్లపై అయోమయం
X
మహేష్ బాబు కొత్త సినిమా ‘భరత్ అనే నేను’ వసూళ్ల విషయంలో ట్రేడ్ పండిట్లే అయోమయానికి గురవుతున్నారు. చిత్ర వర్గాల నుంచి వసూళ్ల విషయంలో సరైన సమాచారం అందడం లేదు. మీడియాలో.. బాక్సఫీస్ లెక్కలు వెల్లడించే వెబ్ సైట్లలో కలెక్షన్ల వివరాలు పెడుతున్నారు కానీ.. అవి పక్కా ఏమీ కాదని సమాచారం. చిత్ర బృందం ఉద్దేశపూర్వకంగా వసూళ్ల లెక్కల్ని వెల్లడించట్లేదని సమాచారం. మామూలుగా దిల్ రాజు తాను పంపిణీ చేసే ప్రతి సినిమాకు సంబంధించి రోజు వారీ షేర్స్ వివరాలు మీడియాకు అందేలా చూస్తారు. కానీ ఆయన కూడా ‘భరత్ అనే నేను’ విషయంలో సైలెంటుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కేవలం రెండు రోజులకే ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ సాధించిందంటూ పోస్టర్ మీద ప్రకటించడం మినహాయిస్తే వసూళ్ల గురించి చిత్ర వర్గాల నుంచి ఏ సమాచారం లేదు.

‘భరత్ అనే నేను’కు నిర్మాత డీవీవీ దానయ్యే కానీ.. దీని ప్రొడక్షన్.. రిలీజ్.. డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు దర్శకుడు కొరటాల శివే చూశాడని సమాచారం. ఆయన మధ్యవర్తిత్వం.. హామీల మీదే అమ్మకాలు జరిగినట్లు చెబుతున్నారు. ఈ చిత్రానికి ఆయన పారితోషకం బదులు లాభాల్లో వాటా తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో థియేట్రికల్ రన్ పూర్తయ్యేవరకు వసూళ్ల వివరాలు ప్రకటించకూడదని.. ఈలోపు రకరకాల లెక్కలతో కలెక్షన్ల విషయంలో భిన్న ప్రచారాలు జరగకుండా చూసుకోవాలని కొరటాల జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. అంతా అయ్యాక వసూళ్ల లెక్కలు తేల్చి.. దాన్ని బట్టి కొరటాల పారితోషకాన్ని ఫిక్స్ చేయనున్నారట. అందుకోసమే ఇప్పుడు వసూళ్ల వివరాలు బయటికి రాకుండా చూసుకుంటున్నట్లు సమాచారం.