Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్' కు మరో ఆప్షన్ అదేనా..?

By:  Tupaki Desk   |   2 Oct 2021 12:30 AM GMT
ఆర్.ఆర్.ఆర్ కు మరో ఆప్షన్ అదేనా..?
X
యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ''ఆర్.ఆర్.ఆర్''. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది తెలుసుకోవాలని వేచి చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని కరోనా కారణంగా మూడోసారి కూడా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది.

పాన్ ఇండియా సినిమా కావడంతో దేశవ్యాప్తంగా థియేటర్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని వాయిదా వేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయి. ఏపీలో 100 ఆక్యుపెన్సీ - టికెట్ రేట్లపై క్లారిటీ రాబోతోంది. ఇక నార్త్ లో కూడా అక్టోబర్ మూడో వారం నుంచి థియేటర్స్ తెరుచుకోనున్నాయి. దీంతో బాలీవుడ్ సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ని లాక్ చేసి పెట్టుకుంటున్నాయి. 2021 క్రిస్మస్ మొదలుకొని 2023 జనవరి వరకు విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు.

ప్రతీ వారం ఓ క్రేజీ మూవీ ఉండటంతో ఇప్పుడు RRR చిత్రానికి మంచి రిలీజ్ డేట్ దొరికే పరిస్థితి లేకుండా పోయింది. పోటీ లేకుండా సోలోగా విడుదల చేసే అవకాశం అస్సలకే లేకుండా పోయింది. అయితే ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి అందుబాటులో ఉన్న ఏకైక స్లాట్ జనవరి మొదటి వారం అని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2022 జనవరి 7-8 తారీఖుల్లో 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతోంది.

కాకపోతే 2022 జనవరి 6న అలియా భట్ - సంజయ్ లీలా బన్సాలీ కాంబోలో రూపొందిన 'గంగుబాయి కథివాడి' చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. RRR మరియు 'గంగుబాయి' చిత్రాలు పెన్ స్టూడియోస్ వారికే చెందినవి అవడం గమనార్హం. దీంతో ఒక రోజు గ్యాప్ తో రెండు పాన్ ఇండియా చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానేది అనుమానమే. అందుకే రాజమౌళి చిత్రాన్ని సంక్రాంతి సీజన్ లో విడుదల చేసే ఆలోచన కూడా చేస్తున్నారని టాక్ వచ్చింది.

సంక్రాంతి పండుగకు 'భీమ్లా నాయక్' 'సర్కారు వారి పాట' చిత్రాలతో పాటుగా 'రాధే శ్యామ్' వంటి పాన్ ఇండియా సినిమా కూడా ఉంది. పవన్ కళ్యాణ్ - ప్రభాస్ చిత్రాలను వాయిదా వేసే ప్రసక్తే లేదని మేకర్స్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ రాజమౌళి కోరితే మహేష్ బాబు తన చిత్రాన్ని పోస్ట్ చేసే ఛాన్స్ ఉందనే మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇదే కనుక జరగకపోతే రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' చిత్రానికి 2022 మార్చి 31వ తేదీ మరో ఆప్షన్ గా పేర్కొంటున్నారు.

మార్చి 25న 'భూల్ భూలైయ్యా 2' - ఏప్రిల్ 1న మాధవన్ 'రాకెట్రీ' చిత్రాలను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాకపోతే వీటిని RRR చిత్రానికి పోటీగా పరిగణించలేం. మరి జనవరి - మార్చి నెలల్లో జక్కన్న అండ్ టీమ్ దేనిని ఎంచుకుంటారో చూడాలి. ఇకపోతే 'ఆర్.ఆర్.ఆర్' సినిమా బిజినెస్ భారీగా జరిగింది. భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద ప్రీ-రిలీజ్ బిజినెస్‌ చేసి రికార్డ్ సృష్టించింది. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా ఫిక్షనల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా.. ఒలివియా మోరిస్ - అలియా భట్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. అజయ్ దేవగన్ - శ్రియా - సముద్రఖని ఇతర కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డి.వి.వి.దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.