Begin typing your search above and press return to search.

మెగాస్టార్ `ఆ` సెంటిమెంట్ వెన‌క ఇంత స్టోరీ వుందా?

By:  Tupaki Desk   |   30 April 2022 4:30 PM GMT
మెగాస్టార్ `ఆ` సెంటిమెంట్ వెన‌క ఇంత స్టోరీ వుందా?
X
ఇండ‌స్ట్రీలో సెంటిమెంట్ ల‌కు పెద్ద పీట వేస్తుంటారు. సినిమా కొబ్బ‌రి కాయ ముహూర్తం నుంచి గుమ్మ‌డి కాయ కొట్టే సంద‌ర్భం వ‌ర‌కు ప్ర‌తి విష‌యంలోనూ సెంటిమెంట్ ను ఫాలో అవుతుంటారు. కొంత మంది టైమ్ ని సెంటిమెంట్ గా భావిస్తే పంగ‌డ సీజ‌న్ ల‌ని సెంటిమెంట్ గా భావిస్తుంటారు. కొంత మందికి సినిమా టైటిల్ కూడా సెంటిమెంటే. అందులోనూ టైటిల్ మొద‌లయ్యే తొలి అక్ష‌రం కూడా సెంటిమెంట్ గానే చూస్తుంటారు. బ‌య‌టి వాళ్ల‌కి ఇదొక విచిత్రంగానూ వింత గానూ అనిపించొచ్చు. కానీ సినిమా టైటిల్ తొలి అక్ష‌రం కూడా సెంటిమెంట్ గా మారి భారీ విజ‌యాల్ని సొంతం చేసుకున్న హీరోలు వున్నారు.

యాంగ్రీ యంగ్ మెన్ డా. రాజ‌శేఖ‌ర్ సినిమాలే తీసుకుంటే ఆయ‌న‌కు అ...ఆ అక్ష‌రాలు సెంటిమెంట్ గా వ‌ర్క‌వుట్ అయ్యాయి. ఆహుతి, అంకుశం, ఆగ్ర‌హం, అక్క మొగుడు, అమ్మ కొడుకు, అల్ల‌రి ప్రియుడు, అంగ ర‌క్ష‌కుడు, ఆవేశం, అన్న‌, ఆయుధం.. ఇలా వ‌రుస హిట్ లు, బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లు `అ..ఆ` అనే అక్ష‌రాల‌తో మొద‌లైన‌ టైటిల్ తో రూపొందిన చిత్రాలే కావ‌డం విశేషం. అయితే ఇదే అక్ష‌రాలు మెగాస్టార్ చిరంజీవికి కెరీర్ ప్రారంభం నుంచి క‌లిసి రావ‌డం లేదు.

కెరీర్ ప్రారంభం నుంచి ఆయ‌న‌ని `అ..ఆ` అక్ష‌రాల సెంటిమెంట్ వెంటాడుతూనే వుంది. నిజం చెప్పాలంటే ఆ అనే అక్ష‌రం ఆయ‌న కెరీర్ కు పెద్ద‌గా క‌లిసిరాలేద‌ని చెప్పాలి. చిరు చేసిన 11వ సినిమా `అగ్ని సంస్కారం`. క‌విత‌, సుహాసిని హీరోయిన్ లుగా న‌టించారు. జి.వి. ప్ర‌భాక‌ర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అంత‌గా ఆడ‌లేదు. ఆ త‌రువాత ఇదే ఆ అక్ష‌రంతో చేసిన `ఆర‌ని మంట‌లు` కూడా పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌లేక నిరాశ ప‌రిచింది. ఆ త‌రువాత రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు, జ‌య‌సుధ జంట‌గా న‌టించిన `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో చిన్న పాత్ర చేశారు. ఇది కూడా నిరాశ ప‌రిచింది.

ఇక కోడి రామ‌కృష్ణ డైరెక్ష‌న్ లో ఫ్యామిలీ డ్రామాగా చేసిన `ఆల‌య శిఖ‌రం` కూడా పెద్ద‌గా ఆడ‌లేదు. త‌మిళ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా తో క‌లిసి చేసిన `ఆరాధ‌న‌` అప్ప‌ట్లో ఫ్లాప్ గా నిలిచింది. క‌ళాత‌ప‌స్వీ కె. విశ్వ‌నాథ్ డైరెక్ష‌న్ లో చేసిన `ఆప‌ద్భాంధ‌వుడు` కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తాకొట్టింది. ఏడిద నాగేశ్వ‌ర‌రావు పూర్ణోద‌యా మూవీ క్రియేష‌న్స్ పై ఎన్నో మ‌ర‌పురాని చిత్రాల‌ని అందించారు. అలాంటి నిర్మాత‌కు ఈ సినిమా చేదు జ్ఞాప‌కంగా నిలిచింది. ప‌లు అవార్డుల్ని తెచ్చిపెట్టిందే కానీ హిట్ ని మాత్రం అందించ‌లేక‌పోయింది.

ఆ సెంటిమెంట్ ప్ర‌కారం చిరు చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌నే మిగిల్చాయి. ఈ క్ర‌మంలో వ‌చ్చిన `ఆచార్య‌` ఎలా వుంటుందో ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందా? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూశారు. కానీ చిర‌కున్న `ఆ` అక్ష‌రం సెంటిమెంట్ `ఆచార్య‌` విష‌యంలోనూ మ‌ళ్లీ రిపీట్ అయింది. అభిమానుల్ని నిరుత్సాహ ప‌రిచింది. అయితే అ అనే అక్ష‌రంతో చిరు చేసిన సినిమాలు కొంత వ‌ర‌కు విజ‌యాల్ని సాధించ‌డం విశేషం.

అత్తకు య‌ముడు అమ్మాయికి మొగుడు, అభిలాష‌,అడ‌విదొంగ‌, అల్లుడా మాజాకా, అన్న‌య్య‌, అంజి, అంద‌రివాడు.. ఇలా చాలా వ‌ర‌కు `అ` అక్ష‌రంతో మొద‌లైన చిత్రాలు విజ‌యాల్ని సాధించాయి. కానీ `ఆ` మాత్రం ఆయ‌కు చేతు అనుభ‌వాన్ని అందించ‌డం గ‌మ‌నార్హం.