Begin typing your search above and press return to search.

'తారక్ - త్రివిక్ర‌మ్' ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణం ఇదేనా..?

By:  Tupaki Desk   |   24 April 2021 1:30 PM GMT
తారక్ - త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణం ఇదేనా..?
X
'ఆర్.ఆర్.ఆర్' తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేయబోయే సినిమాని ప్రకటించేశారు. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా '#NTR30' తెరకెక్కనుందని వెల్లడించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ - యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే వాస్తవానికి ఎన్టీఆర్ తన 30వ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ - ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్ పై ఈ ప్రాజెక్ట్ రూపొందుతుందని అనౌన్సెమెంట్ ఇచ్చారు. 'అరవింద సమేత' తర్వాత వీరి కాంబోలో రానున్న చిత్రానికి 'అయిన‌ను పోయి రావ‌లె హ‌స్తిన‌కు' అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే రెండేళ్ల తర్వాత అనూహ్యంగా ఈ మధ్యనే ఆ సినిమా క్యాన్సిల్ అయిందని ప్రకటన వచ్చింది.

ఈ నేపథ్యంలో కొరటాల శివ లైన్ లోకి రావడమే కాకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశాడు. త్రివిక్రమ్ సినిమా లేనందుకు ఫ్యాన్స్ నిరాశ చెందినప్పటికీ.. కొరటాల తో సినిమా చేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇదే సమయంలో 'తారక్ - త్రివిక్ర‌మ్' ప్రాజెక్ట్ ఆగిపోవ‌డానికి గల కారణాలేంటని అందరూ ఆలోచిస్తున్నారు. అయితే ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడానికి మెయిన్ రీజ‌న్ స్టోరీ రెడీ కాకపోవడమే అని తెలుస్తోంది. ఎన్టీఆర్ కు ఓ స్టోరీ లైన్ చెప్పి ఒప్పించిన త్రివిక్రమ్.. దాన్ని అనుకున్న విధంగా క‌థ‌గా మ‌ల‌చ‌లేదని అంటున్నారు. అలానే త్రివిక్రమ్ 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' తెలుగు రీమేక్ స్క్రిప్ట్ పై దృష్టి పెట్టడం వల్ల ఈ ప్రాజెక్ట్ ని ఆపేశార‌ని టాక్ నడుస్తోంది. దీనికి నిజమైన కారణమేంటో తెలియనప్పటికీ ప్రొడ్యూసర్స్ ట్విట్టర్ లో ఎన్టీఆర్ ని అన్ ఫాలో చేయడాని బట్టి చూస్తే ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.