Begin typing your search above and press return to search.

వరుణ్ అన్నది ప్రభాస్ గురించేనా..?

By:  Tupaki Desk   |   28 Nov 2022 8:58 AM GMT
వరుణ్ అన్నది ప్రభాస్ గురించేనా..?
X
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇండస్ట్రీలో దాదాపుగా పెళ్లీడుకొచ్చిన హీరోలంతా పెళ్లి చేసుకొని ఓ ఇంటివారయ్యారు. డార్లింగ్ ఎప్పుడు వివాహ బంధంలో అడుగుపెడతారని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రభాస్ మరియు కృతి సనన్ జంటగా 'ఆదిపురుష్' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని.. షూటింగ్ లేకున్నా ప్రభాస్ ముంబై వెళ్లి కృతిని కలుస్తున్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఆ మధ్య 'ఆదిపురుష్' టీజర్ లాంచ్ లో వీరిద్దరూ చాలా క్లోజ్ గా కనిపించడంతో ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని పుకార్లు పుట్టుకొచ్చాయి.

అయితే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తాజాగా కృతి సనన్ డేటింగ్ గురించి మాట్లాడిన మాటలు.. పరోక్షంగా ప్రభాస్ గురించేనా? అనే సందేహాలు వ్యక్తమయ్యేలా చేసాయి. 'తోడేలు' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ - కృతి ఓ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. "కృతి మనసులో ఒక హీరో ఉన్నాడు. అతను ఇప్పుడు ముంబైలో లేడు. కానీ దీపికా పడుకునేతో షూటింగ్ లో ఉన్నాడు" అని అన్నాడు.

వరుణ్ ధావన్ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ప్రభాస్ - కృతి సనన్ డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడానికి కారణమయ్యాయి. దీపిక పదుకొణె ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి 'ప్రాజెక్ట్ K' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీపిక నటిస్తున్న మిగతా సినిమాల హీరోలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. అందులోనూ వరుణ్ అలా చెప్తున్న సమయంలో కృతి సిగ్గు పడుతూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

దీనికి తోడు ఇటీవల కృతి సనన్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఎవరిని పెళ్లి చేసుకుంటారు? అని కొందరు హీరోలను ఆప్షన్స్ గా ఇస్తే.. అమ్మడు ప్రభాస్ పేరు చెప్పింది. ఇప్పుడు వరుణ్ ధావన్ కూడా ప్రభాస్ గురించే అన్నాడేమో అనే సందేహాలు రేకెత్తించాడు. ఇలా వీటన్నింటినీ లింక్ చేసుకుంటున్న నెటిజన్లు.. ప్రభాస్ - కృతి మధ్య రిలేషన్ షిప్ నిజమేనన్న భావనని నిజం చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ సైతం ఇదే నిజమన్నట్లు పోస్టులు పెడుతున్నారు.

వాస్తవానికి స్టార్ హీరోయిన్ అనుష్కతో ప్రభాస్ 'బిల్లా' 'మిర్చి' వంటి సినిమాలు చేసినపుడు.. వీరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని రూమర్స్ వచ్చాయి. 'బాహుబలి' సినిమా కోసం మూడోసారి కలవడంతో ఆ వార్తలు మరీ ఎక్కువయ్యాయి. అయితే తామిద్దరం మంచి స్నేహితులమే అని పుకార్లను కొట్టిపారేశారు. అయినప్పటికీ వాటికి బ్రేక్ పడకపోవడంతో.. పట్టించుకోవడం మానేశారు.

ఇప్పుడు ప్రభాస్ - కృతి ప్రేమలో ఉన్నారంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే వరుణ్ ధావన్ వ్యాఖ్యానించారు. మరి త్వరలోనే వీరిద్దరూ తమ వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలపై స్పందించి, క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇకపోతే రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న 'ఆది పురుష్' సినిమాలో రాముడిగా ప్రభాస్.. సీతగా కృతి నటిసున్నారు. వచ్చే ఏడాది జూన్ లో ఈ పౌరాణిక చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.