Begin typing your search above and press return to search.

చిప్ కాన్సెప్ట్ స్ఫూర్తి అక్క‌డి నుంచే!

By:  Tupaki Desk   |   19 July 2019 5:30 PM GMT
చిప్ కాన్సెప్ట్ స్ఫూర్తి అక్క‌డి నుంచే!
X
ఇస్మార్ట్ శంక‌ర్ కాపీ క్యాట్ వివాదం గురించి తెలిసిందే. అయితే హాలీవుడ్ సినిమాలు చూసి స్ఫూర్తి పొందాన‌ని ద‌ర్శ‌కుడు పూరి ఇంట‌ర్వ్యూల్లో చెప్పారు. ట్రైల‌ర్ చూశాక‌.. `మెమ‌రీ చిప్` కాన్సెప్టుపై కాపీ అన్న‌ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి క‌దా? అని ప్ర‌శ్నిస్తే .. ఎన్నో హాలీవుడ్ చిత్రాలు చూసి స్ఫూర్తి పొంది తీస్తుంటామ‌ని అన్నారు. అయితే ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంలో `చిప్ .. డ‌బుల్ సిమ్` కాన్సెప్ట్ ప‌క్కాగా హాలీవుడ్ మూవీ `ది క్రిమిన‌ల్` నుంచి లేపిన‌దేన‌న్న ముచ్చ‌ట మ‌రోసారి సాగుతోంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా మూడేళ్ల క్రితం హాలీవుడ్ లో రిలీజైన `ది క్రిమినల్`(2016)తో పోలుస్తున్నారు. ఇస్మార్ట్ శంక‌ర్ లైన్ థ్రెడ్ అచ్చంగా ఆ సినిమానే.

ఒక‌రి మెద‌డుకి చిప్ ని అమ‌ర్చి దాని ద్వారా వేరొక‌రి జ్ఞాప‌కాల్ని అత‌డిలోకి పంపించ‌డం అన్న పాయింట్ తోనే అమెరిక‌న్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ది క్రిమిన‌ల్` తెర‌కెక్కింది. అక్క‌డ చ‌నిపోయిన‌ సీఐఏ ఏజెంట్ జ్ఞాప‌కాల్ని హీరో బుర్ర‌లోకి ఎక్కిస్తారు. ఇక్క‌డ కాంట్రాక్ట్ కిల్ల‌ర్ అయిన శంక‌ర్ బుర్ర‌లోకి చిప్ ని పంపించి వేరొక‌రి జ్ఞాప‌కాల్ని ఎక్కించారు. శంక‌ర్ ఇద్ద‌రిలా ప్ర‌వ‌ర్తించ‌డం అందుకే. ఆ రెండు పాత్ర‌ల తీరుతెన్నులు ఒకేలా ఉంటాయి. అయితే ఇక్క‌డ శంక‌ర్ కి కొన్ని ఎక్స్ ట్రా ఊర‌మాస్ క్వాలిటీస్ ఉన్నాయి. రామ్ పాత్ర‌కు పూరి శైలిని జోడించి పూర్తి స్థాయి క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో ఇస్మార్ట్ శంక‌ర్ ని తీర్చిదిద్దారు. ఇక ఈ సినిమా క‌థ‌నంలో గ్రిప్ త‌గ్గినా రామ్ ఎన‌ర్జిటిక్ పెర్ఫామెన్స్ .. పూరి మార్క్ క్యారెక్ట‌రైజేష‌న్ కొంత‌వ‌ర‌కూ ప్ర‌మాదం నుంచి త‌ప్పించాయి.

ఇస్మార్ట్ శంక‌ర్ పై స‌మీక్ష‌కుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చాయి. ఇది జ‌స్ట్ యావ‌రేజ్‌ మూవీ. బీ-సీ కేంద్రాల్లో ఆడే సినిమా అంటూ రివ్యూలు వ‌చ్చాయి. అయితే తొలి రోజు.. తొలి వీకెండ్ ఓపెనింగుల‌ ప‌రంగా ఇస్మార్ట్ శంక‌ర్ కి బాగా క‌లిసొస్తోంది. మొద‌టి రోజు 8 కోట్లు వ‌సూలు చేసింది. సోమ‌వారం నుంచి బాక్సాఫీస్ వ‌ద్ద స‌న్నివేశం ఎలా ఉండ‌నుంది? అన్న‌ది వేచి చూడాలి.