Begin typing your search above and press return to search.

షాక్‌: సైబ‌ర్ క్రైమ్‌ పోలీస్‌ కి ఛార్మి ఫిర్యాదు

By:  Tupaki Desk   |   8 Jun 2019 12:10 PM GMT
షాక్‌: సైబ‌ర్ క్రైమ్‌ పోలీస్‌ కి ఛార్మి ఫిర్యాదు
X
టాలీవుడ్ కి లీకుల బెడ‌ద త‌ప్ప‌డం లేదు. సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఈ త‌ర‌హా కేసులు- ఫిర్యాదులు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెరుగుతుండ‌డం సినీప‌రిశ్ర‌మ‌లో క్రైమ్ రేటు పెరుగుతోంద‌న‌డానికి సింబాలిక్ అని చెప్పొచ్చు. ఇటీవ‌లే ప‌దుల సంఖ్య‌లో వెబ్ సైట్ల‌లో త‌న‌పై సాగించిన దుష్ప్ర‌చారంపై క‌థానాయిక పూన‌మ్ కౌర్ ఫిర్యాదు చేసిన‌ గురించి తెలిసిందే. తాజాగా మ‌రో క‌థానాయిక ఛార్మి సైబ‌ర్ క్రైమ్ పోలీస్ గ‌డ‌ప తొక్క‌డం సంచ‌ల‌న‌మైంది. ఈసారి స్క్రిప్టు లీక్ వివాదం ఇస్మార్ట్ టీమ్ లో క‌ల‌క‌లం రేపింద‌ని తెలుస్తోంది. వివ‌రాల్లోకి వెళితే..

రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `ఇస్మార్ట్ శంక‌ర్` ఆన్ సెట్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. నిధి అగ‌ర్వాల్‌- న‌భా న‌టేష్ ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ దాదాపు పూర్త‌యింది. ఇటీవ‌లే రిలీజ్ చేసిన‌ టీజర్‌కి అద్భుతమైన స్పందన వ‌చ్చింది. అలాగే `దిమాక్ ఖరాబ్` గీతం యువ‌త‌రంలోకి దూసుకెళ్లింది. కొంత గ్యాప్ త‌ర్వాత మణిశర్మ అదిరిపోయే మాస్ బీట్ తో ఆక‌ట్టుకున్నారు. ఇక ఈ చిత్రాన్ని శ్రీమ‌తి లావ‌ణ్య స‌మ‌ర్పణ‌లో పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌- పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌- చార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

స‌రిగ్గా రిలీజ్ ముంగిట ఇస్మార్ట్ శంక‌ర్ స్క్రిప్టు లీక్ వివాదం ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇన్‌ స్టాగ్రామ్‌ లో బజ్‌ బాస్కెట్‌ గ్రూప్‌ లో ఇస్మార్ట్ శంక‌ర్ స్క్రిప్టు లీక్ చేశారంటూ ఛార్మి కౌర్ సైబ‌రాబాద్ పోలీసుల్ని ఆశ్ర‌యించారు. గ్రూప్‌ అడ్మిన్‌ మురళీ కృష్ణ పై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా పోలీస్ కేసు న‌మోదు చేశారు. అయితే ఈ గొడ‌వ‌ను పోలీసుల వ‌ర‌కూ వెళ్ల‌కుండా ప‌రిష్క‌రించుకునేందుకు తొలుత పూరి- ఛార్మి బృందం ప్ర‌య‌త్నించార‌ని తెలుస్తోంది. స్క్రిప్టు లీక్ కి కార‌కుడైన‌ మురళీకృష్ణ తో ప‌లుమార్లు ఇస్మార్ టీమ్ సంప్రదింపులు జరిపింది. అయితే అతడు భారీ మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేశార‌ని... అడిగిన డబ్బు ఇవ్వకపోతే స్క్రిప్ట్‌ మొత్తాన్ని ప‌లు సామాజిక మాధ్యమాల్లో లీక్ చేస్తాన‌ని అత‌డు బెదిరించార‌ట‌. ఆ క్ర‌మంలోనే సహ నిర్మాత ఛార్మి సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.