Begin typing your search above and press return to search.

స‌రోగ‌సీ కేసు: నయన్ దంపతులకు ఇబ్బందులు తప్పవా..?

By:  Tupaki Desk   |   19 Oct 2022 8:30 AM GMT
స‌రోగ‌సీ కేసు: నయన్ దంపతులకు ఇబ్బందులు తప్పవా..?
X
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార - డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దంపతులు స‌రోగ‌సీ విధానంలో తల్లిదండ్రులు అవ్వడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చామ‌ని సెలబ్రిటీ కపుల్ సోషల్ మీడియాలో ప్రకటించిన తర్వాత అనేక ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ వ్య‌వ‌హారం రోజు రోజుకీ మ‌లుపులు తిరుగుతోంది.

నయనతార దంపతులు సరోగసి పద్ధతిలో పిల్లలకు జన్మ నివ్వడం అనేది చట్ట బద్ధంగా జరిగిందా లేదా? అది నిబంధనలకు అనుగుణంగానే జరిగిందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వారికి తమిళనాడు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఒక త్రిసభ్య కమిటీని నియమించింది.

ఈ కమిటీ విగ్నేష్ - నయన్ దంపతులు సరోగసి ద్వారా తల్లిదండ్రులు కావడంపై విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. స‌రోగ‌సీ విధానంలో పిల్లల్ని క‌నాలంటే దంపతులకు వివాహమై క‌నీసం ఐదేళ్లు గడిచి పోవాలనే నిబంధ‌న ఉంది. అంతేకాదు ఏడాది ముందే ఈ విష‌యంలో ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి తీసుకోవాలి.

విగ్నేష్ - నయన్ దంపతులు పెళ్ల‌యిన నాలుగు నెల‌ల‌కే పిల్ల‌లకు జన్మనిచ్చారు కాబట్టి.. ఆ రెండు స‌రోగ‌సీ నిబంధనలు పాటించ‌లేదని అర్థమవుతుంది. దాంతో సెలబ్రిటీ కపుల్ పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే అప్పుడే వీరిద్దరూ ఓ ట్విస్టు ఇచ్చారు.

ఆరేళ్ల క్రిత‌మే తాము పెళ్లి చేసుకున్నామని.. గతేడాది స‌రోగ‌సీ కోసం త‌మ పేర్లను న‌మోదు చేయించుకొన్నామ‌ని నయనతార దంప‌తులు విచారణలో చెప్పినట్లుగా తెలుస్తోంది. దీని ప్రకారం గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న ఈ జంట అప్పుడే వివాహం చేసుకున్నారు.

అయితే పెళ్ళికి సంబంధించిన ఆధారాల‌ను వారు కమిటీకి సమ్పరించలేదట. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్ర‌భుత్వం ఈ వ్యవహారం పై మ‌రింత లోతుగా విచార‌ణ జరపడానికి రెడీ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే నయన్ దంపతులకు నోటీసులు కూడా అందించారని అంటున్నారు.

కమిటీ సభ్యులు నేరుగా న‌య‌న తార ఇంటికే వెళ్లి ఈ విషయం మీద విచార‌ణ చేపట్టనున్నారని.. విచార‌ణ‌కు అందుబాటులో ఉండాల‌ని సూచించారని నివేదికలు పేర్కొన్నాయి. ఎంక్వైరీలో నయన్ దంపతులు తమ పెళ్ళికి సంబంధించిన ఆధారాలు మరియు సరోగసి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

ఒకవేళ ఆధారాలు లేని ప‌క్షంలో స‌రోగ‌సీ నిబంధనలను ఉల్లంఘించినట్లుగా త్రిస‌భ్య క‌మిటీ భావించే ప్ర‌మాదం ఉంది. తాము తల్లిదండ్రులు అవడం చ‌ట్టపరంగా జరగలేదని తేలితే.. విగ్నేష్ - నయన్ దంపతులు మరియు స‌రోగ‌సీకి స‌హ‌క‌రించిన వారిపై చర్యలు తీసుకునే అవ‌కాశం ఉంది. మరి ఈ వ్యవహారంలో ఏమి జరుగుతుందో చూడాలి.

కాగా, భారతదేశంలో నూతన సరోగసీ నియంత్రణ చట్టం-2022 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. వైద్యపరంగా అనివార్య కారణాల వల్ల తప్ప సరోగసీ విధానం ద్వారా పిల్లలని కనడం నిషేధించబడింది. వాణిజ్య పరమైన అద్దె గర్భం - పిండాలను విక్రయించడం - సరోగసీలో బిడ్డను కన్నాక వదిలిపెట్టడం - అక్రమ రవాణా వంటి వాటిపై కేంద్రం నిషేధం విధించింది. వీటిని ఉల్లంఘిస్తే గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష మరియు రూ.10. లక్షల జరిమానా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.