Begin typing your search above and press return to search.

అక్షయ్ యాడ్ ఎందుకు వివాదమైంది? అందులో ఏముంది?

By:  Tupaki Desk   |   13 Sep 2022 10:30 AM GMT
అక్షయ్ యాడ్ ఎందుకు వివాదమైంది? అందులో ఏముంది?
X
బాలీవుడ్ హీరోల్లో కాస్తంత భిన్నమైన ఇమేజ్ ఉన్న స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఆయన చేసే సినిమాలు మిగిలిన బాలీవుడ్ స్టార్ సినిమాల్లో మాదిరి 'ఇమేజ్' చట్రంలో చిక్కుకుపోకుండా ఉంటాయి. దీనికి తోడు.. ఏడాదికి నాలుగైదు సినిమాలకు పైనే చేసుకుంటూ పోవటం అక్షయ్ కు అలవాటు. అంతేకాదు.. సమాజానికి చేటు చేసే వాటి గురించి జాగ్రత్తగా వ్యవహరిస్తూ.. విమర్శకులకు అవకాశం ఇవ్వరు. అలాంటి ఆయన తాజాగా చేసిన ఒక యాడ్ వివాదంగా మారింది.

తాజాగా సదరు ప్రకటనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన సోషల్ మీడియా ఖాతా నుంచి పోస్టు చేయటంతో అది కాస్తా వైరల్ గా మారింది. నిమిషం నిడివి ఉన్న ఈ ప్రకటన వరకట్నాన్ని ప్రోత్సహించేలా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఈ వీడియో సారాంశం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. రెండు ఎయిర్ బ్యాగులున్న కారు కంటే కూడా ఆరు ఎయిర్ బ్యాగులున్న వాహనం సురక్షితమని సందేశాన్ని ఇస్తున్నారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో.. ప్రజల్ని చైతన్య పరిచేందుకు వీలుగా ఈ ప్రకటనను రూపొందించారు. అది కాస్తా ఇప్పుడు వివాదస్పదంగా మారింది. ఈ వీడియోలో పెళ్లైన తర్వాత అత్తారింటికి పెళ్లి కుమార్తెను పంపుతున్న సమయంలో రెండు ఎయిర్ బ్యాగులున్న కారులో ఎక్కిన కుమార్తె.. అల్లుడు విచారంగా కనిపిస్తారు.

పోలీసు ఆఫీసర్ గా నటించిన అక్షయ్ కుమార్.. సేఫ్ జర్నీ కోసం ఆరు ఎయిర్ బ్యాగులున్న కారును సమకూర్చాల్సిందిగా చెప్పగా.. పిల్ల తండ్రి అందుకు అంగీకరిస్తారు. ఆరు ఎయిర్ బ్యాగులున్న కారును ఎక్కిన తర్వాత దంపతులిద్దరి ముఖాల్లో సంతోషం వెల్లువెరిస్తుంది.

ఈ యాడ్ మీద పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు వాహనాల కంటే కూడా రోడ్డు భద్రత విషయంలో దొర్లుతున్న తప్పులు.. లోపాలుగా అభివర్ణిస్తున్నారు. రోడ్లలోని లోపాలతో ప్రమాదాలు జరుగుతుంటే.. వాటిని వదిలేసి ఖరీదైన కార్లలో ప్రయాణించాలన్న సందేశాన్ని ఇవ్వమని ఎలా చెబుతారు? అని ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా? అది కూడా పాయింటే. ఖరీదైన కారును ప్రమోట్ చేసే కన్నా.. భద్రతతో కూడిన కారులో ప్రయాణించటం మంచి ఆలోచనే.

కాకుంటే.. పెళ్లి కుమార్తె తండ్రి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వధువు తండ్రి ఇచ్చే బహుమతిగా చూపించే కన్నా.. ఉద్యోగంలో మంచిగా సెటిల్ అయిన సందర్భంగా కొనుగోలు చేసే కారు ఎంపిక విషయంలో ఎలాంటి ప్రాధాన్యతలు ఇవ్వాలన్న సందేశాన్ని ఇచ్చేలా సిద్ధం చేసి ఉంటే మరింత బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.