Begin typing your search above and press return to search.

కలకలం: సోనూసూద్ ఆస్తులపై ఐటీ దాడులు

By:  Tupaki Desk   |   15 Sep 2021 2:30 PM GMT
కలకలం: సోనూసూద్ ఆస్తులపై ఐటీ దాడులు
X
ప్రముఖ నటుడు, కరోనా లాక్ డౌన్ వేళ అందరినీ ఆదుకొని రియల్ హీరోగా మారిన సోనూసూద్ ఆస్తులు, నివాసాలపై ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ముంబైలోని సోనూసూద్ నివాసంలో ఆదాయపు పన్ను విభాగం సోదాలు చేసింది. అలాగే ముంబైలోని మరికొన్ని చోట్ల, లఖ్ నవ్ లోని కంపెనీలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి.

ఆదాయ వివరాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఇది బీజేపీ చేస్తున్న దాడి అని సోనూసూద్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. కావాలనే బీజేపీ ఈ దాడులు చేయిస్తోందని ఆరోపిస్తున్నారు.

ఇటీవల కేజ్రీవాల్ సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘దేశ్ కే మెంటార్స్’ అనే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్ నియమితులైన సంగతి తెలిసిందే. దానికింద పాఠశాల విద్యార్థులకు మార్గనిర్ధేశం చేయనున్నారు. ఈ నియామకం జరిగిన కొద్దిరోజులకే సోదాలు జరగడం చర్చనీయాంశమైంది.

మెంటార్ గా నియమకమైన సోనూసూద్ ను రాజకీయాల్లో చేరడంపై ప్రశ్నించగా.. మంచి పనిచేయడానికి రాజకీయాల్లో చేరాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. అయితే తాజాగా ఆయన నివాసాలపై దాడులు జరగడంతో ఖచ్చితంగా ఇది రాజకీయ కక్ష సాధింపు అని ఆయన వ్యతిరేకులు గళం విప్పుతున్నారు.

కోవిడ్ వేళ దేశంలోనే ఎంతో మంది ఆపన్నులకు అండగా నిలిచి సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్నాడు. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులను ఇళ్లకు చేర్చేందుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. దాంతో ఇప్పటికీ ఎంతోమంది సాయం కోసం సోనూసూద్ ను ఆశ్రయిస్తూనే ఉన్నారు. వారికి సాయం చేస్తూ రియల్ హీరోగా పేరు పొందుతున్నాడు.