Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ తాప్సీ ఆస్తులపై ఐటీ దాడులు.. టాక్స్ ఎగవేతే కారణమా..??

By:  Tupaki Desk   |   3 March 2021 12:30 PM GMT
స్టార్ హీరోయిన్ తాప్సీ ఆస్తులపై ఐటీ దాడులు.. టాక్స్ ఎగవేతే కారణమా..??
X
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆదాయపన్ను శాఖ (ఐటీ) సోదాలు నిర్వహిస్తోంది. ప్రముఖ దర్శకనిర్మాతలు అనురాగ్ కశ్యప్, వికాస్ బల్, మధు మంతేనలతో హీరోయిన్ తాప్సీ పన్ను ఇల్లు, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ బుధవారం సోదాలు జరిపింది గతంలో అనురాగ్, వికాస్, మధు మంతెన కలిసి ఫాంటమ్ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రొడక్షన్ హౌస్ పై లైంగిక వేధింపులు కారణంగా నిర్మాతలు ఆరోపణలు ఎదుర్కొనడంతో వారు 2018లో ఫాంటమ్ ఫిల్మ్ ప్రొడక్షన్ మూసివేశారు. అయితే మూసివేశారు బాగానే ఉంది కానీ పన్నుల శాఖకు కట్టాల్సిన పన్నులను కట్టలేదనే కారణంగా ఇప్పుడు ఐటీ శాఖ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఫాంటమ్ ప్రొడక్షన్స్ లో హీరోయిన్ తాప్సీ మన్మర్జీయా అనే సినిమాను నిర్మించింది. అందుకే ఇప్పుడు తాప్సీ ఇంట్లో, కార్యాలయాలలో కూడా సోదాలు జరుపుతున్నారట ఐటీ అధికారులు.

వీరితో పాటు శిభాషిష్ సర్కార్ (సీఈఓ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్), అఫ్సర్ జైదీ (సీఈఓ ఎక్సైడ్), విజయ్ సుబ్రమణ్యం (సీఈఓ) లాంటి వారి ఆస్తులతో సహా ముంబైలోని పలుచోట్ల శోధనలు జరుగుతున్నాయి. సెలబ్రిటీలపై ఐటీ సోదాలు జరగడం అనేది మాములు విషయమే. కానీ మూసివేసిన సంస్థ పై జరగడం అనేది జనాలు ఆశ్చర్యపోతున్నారు. కానీ పన్నులు చెల్లించకపోతే ఎప్పుడైనా సోదాలు జరగొచ్చని అంటున్నారు. బుధవారం ఉదయం ప్రారంభమైన ఐటీ దాడులు ఈ ఏజెన్సీలకు సంబంధించిన కార్యాలయాలు, వ్యక్తుల ఇళ్లలో నిర్వహించబడుతున్నాయి. దీనిపై కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా స్పందించడం గమనార్హం. ఆయన మాట్లాడుతూ.. 'తమకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం మాత్రమే ఐటీ ఏజెన్సీలు సోదాలు జరుపుతాయి. ఈ విషయం తర్వాత కోర్టుకు వెళుతుంది" అని మంత్రి చెప్పారు. ఇదివరకు అనురాగ్, తాప్సీ ఇద్దరూ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. సోదాలు జరుపడానికి ఇది కూడా ఓ కారణం అయ్యుంటుంది అని వారు భావిస్తున్నారట.