Begin typing your search above and press return to search.
ప్రియాంకా చోప్రాకు ఐటీ శాఖ షాక్!
By: Tupaki Desk | 25 Jan 2018 11:35 AM GMTబాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎదిగి గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఎంతోమంది హీరోయిన్లకు ఆదర్శం. దీంతోపాటు యునెస్కో బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ప్రియాంక వ్యవహరిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రముఖ అమెరికన్ టీవీ షో క్వాంటికో సిరీస్ తో పాటు మరో రెండు హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోన్న ప్రియాంక అంతర్జాతీయంగా పేర ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అయితే, తాజాగా ఈ నటి ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు అందుకొని వార్తల్లో నిలిచింది. ఓ లగ్జరీ కారు - విలాసవంతమైన వాచ్ లకు ప్రియాంక పన్ను ఎగవేసిందని ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు. అయితే, అవి తనకు బహుమతులుగా వచ్చాయని, అందువల్ల పన్ను మినహాయింపు వర్తిస్తుందని ట్రైబ్యునల్ ను ఆశ్రయించిన ప్రియాంకకు తాజాగా చుక్కెదురైంది. ఆ వస్తువులకు పన్ను చెల్లించాల్సిందేనని ప్రియాంకను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది.
2006-07 నుంచి 2011 మధ్య కాలానికి ఆదాయపు పన్ను చెల్లించాల్సిందిగా ఐటీ శాఖ అధికారులు ప్రియాంకకు నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత 2016లో ప్రియాంక చోప్రా నివాసం - ఆఫీసుపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ లగ్జరీ కారు - విలాసవంతమైన వాచ్ లకు ప్రియాంక పన్ను చెల్లించలేదని అధికారులు గుర్తించారు. రూ 40 లక్షల విలువైన ఎల్వీఎంహెచ్-ట్యాగ్ వాచ్ ను, రూ 27 లక్షల విలువైన టొయోటా ప్రియస్ కారును తనకు ఓ కంపెనీ బహూకరించిందని వెల్లడించింది. తాను వాటిని పారితోషికం కింద స్వీకరించలేదని వివరణ ఇచ్చింది. అయితే, ఆ సంస్థ తరపున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆ బహుమతులు ఇచ్చే విధంగా ప్రియాంక ముందస్తు ఒప్పందం కుదుర్చుకుందని ఐటీ అధికారులు ఆరోపించారు. వాటికి వెంటనే పన్ను చెల్లించాలని కోరారు. ఈ అంశంపై ప్రియాంక అప్పీలేట్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించింది. తాజాగా, ప్రియాంక వాదనలను ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. వృత్తిరీత్యా అందుకున్న బహుమతులపై పన్ను చెల్లించాల్సిందేనని ప్రియాంకను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అంతేకాకుండా చట్టప్రకారం.....డబ్బు - స్థిరాస్తులు - షేర్లు - బంగారం వంటి వాటిని బహుమతులుగా పొందినపుడు పన్ను సడలింపు ఉంటుందని - కార్లు - ల్యాప్ ట్యాప్ లు వంటి కదిలే వస్తువులపై పన్ను చెల్లించాల్సిందేనని `ట్యాక్స్ మన్`డైరెక్టర్ భార్గవ తెలిపారు.