Begin typing your search above and press return to search.

'అల్లుడు గారు' సినిమా వదులుకోవడం నా బ్యాడ్ లక్!

By:  Tupaki Desk   |   29 March 2022 11:30 PM GMT
అల్లుడు గారు సినిమా వదులుకోవడం నా బ్యాడ్ లక్!
X
తెలుగు ప్రేక్షకులను ప్రభావితం చేసిన నిన్నటితరం కథానాయికలలో యమున ఒకరు. అందం .. అంతకుమించిన అభినయంతో ఆమె మెప్పించారు. యథార్థ సంఘటన ఆధారంగా చాలాకాలం క్రితం తెరకెక్కిన 'మౌనపోరాటం' సినిమాతో ఆమె తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఆ తరువాత 'జడ్జిమెంట్' .. 'మామగారు' .. 'సూరిగాడు' .. 'ఎర్రమందారం' .. 'పుట్టింటి పట్టుచీర' వంటి సినిమాలు ఆమె కెరియర్లో చెప్పుకోదగినవిగా నిలిచాయి. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన ఆమె, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"నేను చేసిన సినిమాలన్నీ కూడా నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. కెరియర్ చాలా జోరుగా జరుగుతున్న సమయంలో కారు ప్రమాదం జరిగింది. నేను కారులో వెళుతుండగా లారీ గుద్దేసింది. దాంతో కారుకి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అదృష్టం కొద్దీ బ్రతికి బయటపడ్డాను. సినిమాలోమాదిరిగానే నా కళ్లముందే కారు కాలిపోయింది. నా ముఖంపై ఎక్కడైనా కాలిందేమో .. ఇక నటనకి పనికిరానేమోనని చాలా భయపడ్డాను. ఆ తరువాత కారులో ఎక్కడికైనా వెళ్లవలసి వస్తే చాలా టెన్షన్ పడేదానిని. నా జీవితంలో జరిగిన ఆ ప్రమాదాన్ని ఎప్పటికీ మరిచిపోలేను.

ఇక నా జీవితంలో చాలామందిని నమ్మి డబ్బు పోగొట్టుకున్నాను. సరైన అవగాహన లేకుండా చేసిన పనుల వలన ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడ్డాము. వాటి నుంచి బయటపడటానికి కూడా మాకు చాలా సమయం పట్టింది.

నాకు ఎదురైన కొన్ని అనుభవాల కారణంగా ఈ సమాజానికి భయపడకుండా బ్రతకడం అలవాటైపోయింది. ఇక కెరియర్ ఆరంభంలోనే బాలకృష్ణగారితో కలిసి చేసే ఛాన్స్ వచ్చింది. అది ఏ సినిమానో తెలియదుగానీ, అప్పుడు 'జడ్జ్ మెంట్' సినిమా చేస్తున్నాను. అందువల్లనే ఆ సినిమా చేయలేకపోయాను.

ఇక చిరంజీవిగారి 'కొదమసింహం'లో నన్ను తీసుకుకోవాలని అనుకున్నారట. అప్పుడు నేను అందుబాటులో లేకపోవడం వలన కుదరలేదు. ఆ తరువాత ఒక సినిమా షూటింగు సమయంలో కైకాల సంత్యనారాయణ గారు నాకు ఆ విషయం చెప్పారు.

ఇక మోహన్ బాబుగారితో 'అల్లుడు గారు' సినిమా నేను చేయవలసింది. ఆ సినిమా కోసం నన్ను అడిగారు .. కానీ నేను అప్పటికే ఒక సినిమాలో మూగ అమ్మాయి పాత్ర చేయడం వలన, ఈ సినిమా చేయనని చెప్పాను. ఆ పాత్రతో రమ్యకృష్ణ స్టార్ హీరోయిన్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. అందుకే ఏదైనా రాసిపెట్టుండాలి అంటారు" అంటూ చెప్పుకొచ్చారు.