Begin typing your search above and press return to search.

మెగాస్టార్ తో బన్నీని పోల్చడం కరెక్ట్ కాదు..!

By:  Tupaki Desk   |   4 April 2022 11:46 AM GMT
మెగాస్టార్ తో బన్నీని పోల్చడం కరెక్ట్ కాదు..!
X
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన చిరంజీవి.. స్వయంకృషితో 'మెగాస్టార్' అని పిలుచుకునే స్థాయికి ఎదిగిన వైనం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. ఇండస్ట్రీకి ఎంతమంది హీరోలు వస్తున్నా ఆయన స్థానం మాత్రం అలానే ఉంది. అయితే ఇటీవల కాలంలో అల్లు అర్జున్ ని చిరంజీవితో పోలుస్తూ.. అతనే సరికొత్త మెగాస్టార్ అని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు.

కొందరు అత్యుత్సాహంతో బన్నీ పేరుకు ముందు 'మెగాస్టార్' అని పెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఆ ట్యాగ్ లైన్ కి ఆయన వారసుడు రామ్ చరణ్ తగిన వాడని మెగా ఫ్యాన్స్ అంటుంటే.. అది అల్లు అర్జున్ కే సొంతమని మరో వర్గం కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో నెట్టింట ఇరు వర్గాల మధ్య రచ్చ జరగడం కామన్ అయిపోయింది.

అల్లు కాంపౌండ్ కు చెందిన 'ఆహా' ఓటీటీలో సైతం ఆ మధ్య 'మెగాస్టార్ అల్లు అర్జున్ స్పెషల్ ఎపిసోడ్' అనే టైటిల్ పెట్టడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బన్నీ సోదరుడు అల్లు వెంకటేష్ (బాబీ) ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ తో అల్లు అర్జున్ ని పోల్చడం పై స్పందించారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా అల్లు బాబీ నిర్మించిన 'గని' సినిమా ఈ శుక్రవారం (ఏప్రిల్ 8) ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిరంజీవితో బన్నీచేంజ్ పోల్చడం సరికాదన్నారు.

"నేను ఎప్పటికీ చిరంజీవి - అల్లు అర్జున్ లను పోల్చి చూడను. అలా చూడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఎన్నో కష్టాలు ఎదుర్కొని మెగాస్టార్ స్థాయికి చేరుకుని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు''

''కానీ బన్నీ అలా కాదు. తన వెనుక మా నాన్న - తాతయ్య ఉన్నారు. అంతేకాదు మా ఫ్యామిలీలో ఎంతోమందికి చిరంజీవి గారు స్ఫూర్తి. బన్నీ కూడా ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. మనలో స్ఫూర్తి నింపిన వ్యక్తితో మనల్ని ఎప్పటికీ పోల్చుకోకూడదు'' అని అల్లు బాబీ అన్నారు.

ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించేందుకు.. విజయాలు అందుకునేందుకు బన్నీ ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నాడని ఆయన సోదరుడు తెలిపారు. ''నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తర్వాత ఎంతో పరిణతి చెందాడు. నిజానికి ఆ సినిమాపై అతను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ అది ప్లాప్ అయింది''

''దీంతో సుమారు రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఆ సమయంలో ప్రేక్షకులు తన నుంచి ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు? ఎలాంటి కథలు ఓకే చేయాలి?.. ఇలా తనని తాను పునఃపరిశీలన చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన చిత్రమే 'అల.. వైకుంఠపురములో'' అని బాబీ వివరించారు.