Begin typing your search above and press return to search.

ఐటి దాడుల్లో సంగీత దర్శకుడు

By:  Tupaki Desk   |   23 Feb 2018 8:12 AM GMT
ఐటి దాడుల్లో సంగీత దర్శకుడు
X
మహమ్మద్ గిబ్రన్. బహుశా సౌత్ లో ముస్లిం వర్గం నుంచి సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వాళ్ళలో రెహమాన్ తర్వాత ఇతగాడి పేరే చెప్పొచ్చు. తెలుగులో కూడా జిల్ - రన్ రాజా రన్ - బాబు బంగారం లాంటి సినిమాలు చేసాడు కాని అందులో ఒకటి తప్ప మిగిలినవి పెద్దగా పేరు తెచ్చినవి కాకపోవడంతో పూర్తిగా కోలీవుడ్ కు అంకితమయ్యాడు. అన్నట్టు ఈ గిబ్రన్ తెలుగు అల్లుడే. ఇతని భార్య ఒక సైంటిస్ట్. విజయవాడ తన స్వస్థలం. సింగపూర్ లో కలుసుకున్న ఈ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. గిబ్రన్ సోదరుడు అమిద్ సినిమా దర్శకుడు. తాజాగా గిబ్రన్ పై ఐటి శాఖ దాడులు చేయటం తమిళనాట సెన్సేషన్ గా మారింది. ఇతనేమి ఊపిరి సలపనంత బిజీ గా ఉండే సంగీత దర్శకుడు కాదు. అలాంటప్పుడు అంత ఆదాయం ఏముందని దాడి చేసారు అనే అనుమానం వెనుక కొత్త కోణం కనిపిస్తోంది.

గిబ్రన్ కమల్ హాసన్ కు అత్యంత ఇష్టుడు. తన సినిమాలు ఉత్తమ విలన్, చీకటి రాజ్యంలకు ఏరికోరి మరీ తనతోనే చేయించుకుని వాటి వేడుకల సమయంలో గిబ్రన్ ను ఆకాశానికెత్తాడు కమల్. అంతగా గతంలో రెహమాన్, ఇళయరాజాలను మాత్రమే కమల్ బహిరంగంగా పోగిడేవాడు. కాని తెరవెనుక మాత్రం కమల్ కు, గిబ్రన్ కు అంతకు మించే సత్సంబంధాలు ఉన్నట్టు టాక్. కమల్ కొత్తగా ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో గిబ్రన్ వెనుక నుండి పూర్తి సహకారం అందించేలా పక్కా ప్లాన్ తో వర్క్ అవుట్ చేస్తున్నట్టు కోలీవుడ్ పత్రికలు పలు కథనాలు ప్రచురించాయి.

ఈ నేపధ్యంలో గిబ్రన్ బ్యాంకు ఎకౌంట్లు, అతను దాఖలు చేసిన ఐటి రిటర్న్స్, టీడీఎస్ వివరాలు అన్ని పోల్చి చూసిన ఐటి అధికారులకు చాలా అనుమానాలు కలిగాయట. అందుకే గిబ్రన్ ని టార్గెట్ చేసి ఏకకాలంలో ఇల్లు, ఆఫీస్ మీద దాడి చేసారు. సరిగ్గా రాజకీయంగా కమల్ యాక్టివ్ గా మారిన సమయంలోనే గిబ్రన్ మీద ఐటి శాఖ దాడి జరగడం చూసి పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అధికారులు అడిగిన వాటికి జవాబులు ఇచ్చేందుకు గిబ్రన్ రెడీ అవుతున్నాడు. కమల్ ఇది వినప్పటికి ఆచి తూచి స్పందించాలనే ఉద్దేశంతో ఇంకా దీని గురించి మాట్లాడలేదు.