Begin typing your search above and press return to search.

టాలీవుడ్ హీరోస్ కు ఐటీ రైడ్స్ త‌ప్ప‌వా?

By:  Tupaki Desk   |   14 Dec 2022 2:30 PM GMT
టాలీవుడ్ హీరోస్ కు ఐటీ రైడ్స్ త‌ప్ప‌వా?
X
టాలీవుడ్ హీరోస్ కు ఐటీ రైడ్స్ త‌ప్ప‌వా?. అంటే సోష‌ల్ మీడియాలో మాత్రం అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. కార‌ణం గ‌త కొంత కాలంగా దేశ వ్యాప్తంగా అధికారంలో వున్న బీజేపీ ప్ర‌భుత్వం త‌మ‌కు ల‌నుకూలంగా లేని వారిని టార్గెట్ చేస్తూ వారిని దారికి తెచ్చుకునే క్ర‌మంలో వారిపై ఐటీ దాడులకు పాల్ప‌డుతోంద‌ని, ఇందు కోసం ఐటీ శాఖ‌ని ప్ర‌ధాన ఆయుధంగా మార్చుకుంటూ ప్ర‌త్య‌ర్థుల‌పై ఐటీ దాడుల‌కు పూనుకుంటోంద‌నే కామెంట్ లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.

ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు రాష్ట్రాల్లో కీల‌క నేత‌ల‌ని టార్గెట్ చేస్తూ వారి ఆర్థిక మూల‌ల‌ని దెబ్బ‌తీసి మాన‌సిక స్థైర్యాన్ని దెబ్బ‌తీయ‌డ‌మే కాకుండా వారిని ఐటీ రైడ్స్ బూచీని చూపించి త‌మకు అనుకూలంగా మార్చుకుంటూ వ‌స్తున్నారు. ఏపీ, తెలంగాణ విష‌యానికి వ‌స్తే ఈ విష‌యం స్ప‌ష్ట‌మైన సంద‌ర్భాలున్నాయి. ఏపీకి చెందిన ప‌లువురు టీడీపీ, వైసీపీ నేత‌ల‌ని ఐటీ రైడ్స్ పేరుతో బీజేపీ వ‌ర్గాలు త‌మ పార్టీ వైపుకు తిప్పుకున్నారంటూ ప్ర‌తిప‌క్ష పార్టీలు బీజేపీపై దుమ్మెత్తిపోశాయి కూడా.

ఇదిలా వుంటే ఇటీవ‌ల ఐటీ శాఖ క‌న్ను టాలీవుడ్ పై ప‌డ‌టంతో ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. మ‌రీ ప్ర‌ధానంగా నిర్మాత‌ల‌ని టార్గెట్ చేస్తూ ఐటీ రైడ్స్ నిర్వ‌హించ‌డం తెలిసిందే. ఇంత వ‌ర‌కు ఇండ‌స్ట్రీ త‌రుపున ఏ స్టార్ హీరో, స్టార్ డైరెక్ట‌ర్, స్టార్ ప్రొడ్యూస‌ర్ నేరుగా బీజేపీకి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించ‌లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ పెద‌నాన్న కృష్ణంరాజు బీజేపీ పార్టీలో ప‌ద‌వులని చేప‌ట్టినా ఇంత వ‌ర‌కు ప్ర‌భాస్ కూడా తాను బీజేపీకి స‌పోర్ట్ అంటూ ప్ర‌క‌టించ‌లేదు.

ఇక ఇటీవ‌ల అమిత్ షాని క‌లిసి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా తాను బీజేపీకి పూర్తి మ‌ద్ద‌తుని ప్ర‌క‌టించ‌ని విష‌యం తెలిసిందే. 'RRR' కార‌ణంగా అమిత్ షా ఎన్టీఆర్ ని ప్ర‌త్యేకంగా క‌లిశార‌ని, దీని వెన‌క పార్టీకి సంబంధించిన అంశాలు ఏమీ లేవ‌ని చెబుతున్నా.. మ‌రి రామ్ చ‌ర‌ణ్ ఎందుకు క‌ల‌వ‌లేదు.. కేవ‌లం సినిమా కోస‌మే ఎన్టీఆర్ ని అమిత్ షా క‌లిసి అభినందిస్తే.. అలాంట‌ప్పుడు దాని సృష్టిక‌ర్త‌ రాజ‌మౌళిని కూడా క‌ల‌వాల్సింది క‌దా? అనే అనుమానాలు కూడా వ్య‌క్త మ‌య్యాయి.

2024 ఎన్నిక‌ల నేప‌థ్యంలోనే బీజేపీ టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ఎటు వైపు అనే ఆరాలో భాగంగానే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో కొంత మందిని ప్ర‌త్యేకంగా కలుస్తోంద‌నే వాద‌నలు వినిపిస్తున్నాయి. అయినా ఇంత వ‌ర‌కు ఏ హీరో కానీ, డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ కానీ బీజేపీకి తాము మ‌ద్ద‌తుగా నిలుస్తామ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి వ‌స్తామ‌ని కానీ ప్ర‌క‌టించ‌లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా నిర్మాత‌ల‌పై ఐటీ రైడ్స్ జ‌రిగిన‌ట్టుగానే రానున్న రోజుల్లో హీరోలపై ఐటీ దాడులు త‌ప్ప‌వా? అనే అనుమానాలు టాలీవుడ్ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్టుగా సోష‌ల్ మీడియాలో జోరుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.