Begin typing your search above and press return to search.

మీటూ దెబ్బ‌కు ఐటమ్ సాంగ్ మటాష్!

By:  Tupaki Desk   |   15 Oct 2018 7:55 AM GMT
మీటూ దెబ్బ‌కు ఐటమ్ సాంగ్ మటాష్!
X
మీటూ ఇప్పుడు దేశంలో రేపుతున్న సంచ‌ల‌నాలు అన్ని ఇన్ని కావు. సినిమా రంగం మాత్ర‌మే కాదు.. మీడియాతో సహా వివిధ రంగాల్లో మ‌హిళ‌ల‌పై సాగే లైంగిక వేధింపుల‌కు సంబంధించి షాకింగ్ నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇలాంటి వేళ స‌రికొత్త చ‌ర్చ ఒక‌టి తెర మీద‌కు వ‌స్తోంది.

సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్ పేరుతో అశ్లీలంగా న‌ర్తించే ఐటెమ్ సాంగ్స్ విష‌యంలో కొత్త అభ్యంత‌రాలు తెర మీద‌కు వ‌స్తున్నాయి. ఒక మ‌హిళ‌ను శృంగార వ‌స్తువుగా తీర్చి దిద్ద‌ట‌మే కాదు.. ఆమె కోసం ప‌డి చ‌చ్చే మ‌గాళ్ల మంద‌ను తెర నిండుగా చూపించ‌టం.. ప‌నిలో ప‌నిగా అందాల భామ‌ను శృంగార వ‌స్తువుగా చూపించ‌టం.. ఆమె అవ‌యువాల్ని సోయ‌గాల సాధ‌నాలుగా ప్ర‌ద‌ర్శించ‌టం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ఇదే చ‌ర్చ గ‌తంలో ఉన్నా.. తాజాగా మారిన ప‌రిస్థితులు.. ప‌రిణామాల‌కు త‌గ్గ‌ట్లు కొత్త ఆలోచ‌న‌లు మొగ్గ తొడుస్తున్నాయి. మీటూ పుణ్య‌మా అని.. సినీ ప్ర‌ముఖులు సైతం ఐటెమ్ సాంగ్స్ త‌మ సినిమాల్లో ఉండాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న చ‌ర్చ‌ను షురూ చేయ‌ట‌మే కాదు.. కొంద‌రు ప్ర‌ముఖులు త‌మ సినిమాల్లో ఉంచిన ఐటెమ్ సాంగ్స్ ను తీసేసే ప‌ని షురూ చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు విశాల్ భ‌ర‌ద్వాజ్ త‌న ప‌టాకా సినిమాలో మ‌లైకా అరోరా మీద తీసిన హెలో హెలో ఐట‌మ్ సాంగ్ ను సినిమాలో నుంచి తొల‌గించారు. మ‌హిళ‌ల విష‌యంలో సున్నితంగా ఆలోచించ‌టం అవ‌స‌ర‌మ‌న్న మాట‌కు త‌గ్గ‌ట్లే.. బాలీవుడ్ ద‌ర్శ‌కులు ఐట‌మ్ సాంగ్స్ విష‌యంలో సున్నితంగా ఆలోచించ‌టం షురూ చేశారా? అంటే అవున‌నే చెప్ప‌క త‌ప్ప‌దు.

ఐటెమ్ సాంగ్స్ ను సినిమాలో నుంచి తీసేయ‌టం ద్వారా అవాంఛ‌నీయ ప్ర‌భావాలు ప‌డ‌కుండా.. ఆరోగ్య‌క‌ర‌మైన వినోదాన్ని పంచే ప్ర‌య‌త్నం ఒక‌టి మొద‌లైన‌ట‌ల్ఉగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదే ధోర‌ణిని ఇత‌ర వుడ్డులు కూడా అనుస‌రిస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌హిళ‌ల్ని ఆట‌బొమ్మ‌ల్లా.. శృంగార సాధ‌నాలుగా చూపించే ఐటెమ్ సాంగ్స్ లో ఉండే సాహిత్యం ఎంత ముత‌గ్గా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

మాంచి ఫాస్ట్ బీట్ లో ఉన్న ఆ పాట‌ను ఎంజాయ్ చేసే చాలామంది.. అదే పాట‌ను త‌మ పిల్ల‌ల నోటి నుంచి వినే విష‌యంలో మాత్రం తెగ ఫీలైపోతుంటారు. అప్ప‌టివ‌ర‌కూ తాము ఎంజాయ్ చేసిన పాట‌నే త‌మ పిల్ల‌ల నోటి నుంచి రావ‌టాన్ని ఎంత‌మాత్రం స‌హించ‌ని త‌త్త్వం క‌నిపిస్తుంది. ఎందుకిలా అంటే.. ఐటెమ్ సాంగ్స్ లో ఉండే ముత‌క సాహిత్య‌మే. మొత్తంగా మీటూ పుణ్య‌మా అని.. సినిమాల్లో నుంచి ఐటెమ్ సాంగ్స్ ఔట్ అయితే.. థియేట‌ర్ లో అన‌వ‌స‌ర వికారాల‌కు చెల్లుచీటి ఇచ్చిన‌ట్లే.