Begin typing your search above and press return to search.

ఒక డైరెక్టర్ నన్ను అపార్థం చేసుకుని అవమానించాడు: జేడీ చక్రవర్తి

By:  Tupaki Desk   |   1 Dec 2021 1:30 PM GMT
ఒక డైరెక్టర్ నన్ను అపార్థం చేసుకుని అవమానించాడు: జేడీ చక్రవర్తి
X
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన జేడీ చక్రవర్తి, స్టార్ హీరోగా ఎదిగాడు. యూత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన 'చక్రి భ్రమణం' కార్యాక్రమంలో మాట్లాడుతూ, తనకి ఎదురైన ఒక అవమానం గురించి ప్రస్తావించాడు. "క్రాంతికుమార్ గారు ఎన్నో గొప్ప సినిమాలను నిర్మించారు .. 'సీతారామయ్యగారి మనవరాలు' వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాంటి ఆయన 'నేటి సిద్ధార్థ' అనే సినిమాను దర్శక నిర్మాతగా మొదలుపెట్టారు.

అప్పటికి నేను 'శివ' చేస్తుండటం వలన, నన్ను నాగార్జునగారే రికమెండ్ చేశారు. నన్ను ఆయన క్రాంతికుమార్ గారికి పరిచయం చేశారు. అప్పుడు ఆయన "బాబు చెప్పారు గనుక నువ్వు ఓకే .. కాకపోతే నాకు గెడ్డం నచ్చలేదు .. తీసేసి రా" అన్నారు. గెడ్డం తీయడానికి నేను వెళుతుంటే, 'ఎక్కడికి?' అని నాగార్జున గారు అడిగారు. నేను ఆయనకి విషయం చెబితే, గెడ్డం తీయవద్దని ఆయన అన్నారు. అదే విషయాన్ని క్రాంతి కుమార్ గారికి నాగార్జున గారు చెప్పారు. దాంతో క్రాంతికుమార్ గారి మాటను నేను వినకుండా, ఆయనపై నాగార్జున గారికి ఫిర్యాదు చేశానని అనుకున్నారు.

'నేటి సిద్ధార్థ' విడుదలైంది .. కానీ అంతగా ఆడలేదు. ఆ తరువాత ఆయన 'సీతారామయ్యగారి మనవరాలు' సినిమా చేయనున్నారనీ, అందులో ఒక యంగ్ హీరో రోల్ ఉందని తెలిసి, సురేశ్ గెస్టు హౌస్ లో ఉన్న ఆయనను కలవడానికి వెళ్లాను. అప్పటికి 'శివ' సినిమా కూడా విడుదలైంది గనుక నన్ను అందరూ గుర్తుపడుతున్నారు. నేను వచ్చిన విషయం క్రాంతి గారికి చెప్పమని రిసెప్షన్ లో చెప్పి సోఫాలో కూర్చోబోయాను. 'అది నీలాంటివాళ్ల కోసం కాదు .. బయటికి వెళ్లి కూర్చో' అని ఆ వ్యక్తి అన్నాడు. ఆయనతో గొడవ ఎందుకులే అని వచ్చి మెట్లపై కూర్చున్నాను.

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ అక్కడే కూర్చున్నాను. రిసెప్షన్ లో వ్యక్తికి గుర్తుచేయబోతే, 'ఇందాక చెప్పారు గదా' అని విసుక్కుంటున్నాడు. అంతలో వాచ్ మెన్ వచ్చి నన్ను గేటు బయటికి వెళ్లిపొమ్మన్నాడు. ఉదయం నుంచి ఏమీ తినకుండా వెయిట్ చేస్తున్న నన్ను, 3 గంటలకు క్రాంతిగారు పిలిచి, విషయమేమిటని అడిగారు. వచ్చిన పని చెబితే, 'నువ్వు నాకు తెలుసు గదా .. చెబుతానులే' అన్నారు. ఎనిమిది .. తొమ్మిది గంటలు వెయిట్ చేయించి సింపుల్ గా ఆయన ఆ మాట చెప్పారు. ఆయన పడుకుని .. తన కాళ్ల మధ్యలో నుంచి నన్ను చూస్తూ చెప్పిన సమాధానం నాకు అవమానకరంగా అనిపించింది.

ఆ తరువాత 'గులాబీ' .. 'అనగనగా ఒక రోజు' హిట్ అయిన తరువాత, ఒక రోజున క్రాంతికుమార్ గారు కాల్ చేశారు. 'నిన్ను హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలనుకుంటున్నాను .. కథ ఎక్కడ వింటావు" అని అడిగితే, 'నేనే వస్తాను సార్' అని ఆఫీసుకుని వెళ్లాను. కథ ఎంత అద్భుతంగా ఉన్నా చేయకూడదని ముందుగానే అనుకుని వెళ్లాను. వెళ్లగానే తన ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోమని అంటే, ఫరవాలేదని చెప్పేసి నిలబడే కథను విన్నాను. కథ నాకు నచ్చలేదు అని అక్కడే చెప్పేశాను. 'నేను అర్థం చేసుకోగలను' అని ఆయన అన్నారు .. 'థ్యాంక్యూ' అని నేను వచ్చేశాను. అవమానం వలన కలిగిన బాధ అప్పుడు గాని చల్లబడలేదు" అని చెప్పుకొచ్చాడు.