Begin typing your search above and press return to search.

డీలా పడిన బాక్స్ ఆఫీస్.. జానుకు దెబ్బ తప్పదా?

By:  Tupaki Desk   |   1 Feb 2020 5:29 AM GMT
డీలా పడిన బాక్స్ ఆఫీస్.. జానుకు దెబ్బ తప్పదా?
X
పోయినేడాది దసరా తర్వాత బాక్సాఫీసు లో సందడి పూర్తిగా తగ్గి పోయింది. డిసెంబర్ లో విడుదలైన 'వెంకీమామ'.. 'ప్రతిరోజూ పండగే' సినిమాలు థియేటర్లకు ప్రేక్షకులను రప్పించి కొంత జోష్ తీసుకొచ్చాయి. అయితే సంక్రాంతి సినిమాల మధ్య పోటీ ఎలా ఉన్నప్పటికీ 'సరిలేరు నీకెవ్వరు'.. 'అల వైకుంఠపురములో' సినిమాలు భారీ కలెక్షన్స్ తో టాలీవుడ్ కు నిజమైన సంక్రాంతి పండగ తీసుకొచ్చాయి. సంక్రాంతి సినిమాలు రిలీజై మూడు వారాలు కావడంతో వాటి జోరు కూడా తగ్గింది. దీంతో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి.

సంక్రాంతి సీజన్ తర్వాత రిలీజ్ అయిన సినిమాల్లో మొదట చెప్పుకోదగ్గది 'డిస్కోరాజా'. మాస్ మహారాజా రవితేజ-వీఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రంపై డీసెంట్ బజ్ ఉన్నప్పటికీ ప్రేక్షకులను మెప్పించ లేకపోయింది. ఫస్ట్ వీకెండ్ తర్వాత కలెక్షన్స్ పూర్తిగా దిగజారాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇదిలా ఉంటే నిన్న విడుదలైన శర్వానంద్ కొత్త సినిమా 'అశ్వథ్థామ'.. శివ కందుకూరి డెబ్యూ ఫిలిం 'చూసీ చూడంగానే' చిత్రాలకు పెద్దగా ఓపెనింగ్స్ రాలేదని ట్రేడ్ వర్గాల సమాచారం. రెండు సినిమాలకు మౌత్ టాక్.. రివ్యూస్ ఆశాజనకంగా లేవు. దీంతో సంక్రాంతి సీజన్లో కళకళలాడిన థియేటర్లు.. మళ్లీ వెలవెలబోయే పరిస్థితి కనిపిస్తూ ఉందని అంటున్నారు.

సంక్రాంతి సీజన్ తర్వాత ఇంత త్వరగా బాక్స్ ఆఫీస్ డీలా పడడం త్వరలో విడుదల కానున్న సినిమాలపై ప్రభావం చూపించడం ఖాయమని అంటున్నారు. సహజం గానే ఫిబ్రవరి.. మార్చ్ సీజన్లు డల్ గా ఉంటాయి. పరిక్షల సీజన్ కాబట్టి స్టూడెంట్స్ అందరూ సినిమాల కోసం ఎగబడరు. దీంతో త్వరలో రిలీజ్ కానున్న శర్వానంద్.. సమంతాల 'జాను' కు కష్టాలు తప్పేలా లేవనే అభిప్రాయం వినిపిస్తోంది.

శర్వా సినిమాలకు భారీ ఓపెనింగ్స్ ఎప్పుడూ రావు. ఈ సినిమా సమంతా క్రేజ్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు ఈమధ్య తన సినిమాలకు పెద్దగా పబ్లిసిటీ చెయ్యడం లేదు.. ఈ సినిమా విషయంలో కూడా పబ్లిసిటీ పై పెద్దగా దృష్టి సారించక పోవడంతో బజ్ తక్కువగా ఉంది. దీంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాను లైట్ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా ఒక్కటే కాదు. ఫిబ్రవరి మార్చ్ లో రిలీజ్ కానున్న ఇతర సినిమాలకు ఈ డల్ సీజన్ ఎఫెక్ట్ తప్పక పోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.