Begin typing your search above and press return to search.

సుడిగాలి సుధీర్.. అలా చేశాడా?

By:  Tupaki Desk   |   5 Jun 2016 7:00 AM GMT
సుడిగాలి సుధీర్.. అలా చేశాడా?
X
జబర్దస్త్ కామెడీ షో చాలామంది జీవితాల్ని మార్చేసింది. అందులో నటించిన కమెడియన్లు కొన్ని రోజుల్లోనే మాంచి పాపులారిటీతో పాటు బాగా డబ్బు కూడా సంపాదించారు. కార్లు.. ఇళ్లు.. విదేశీ ప్రయాణాలు.. అబ్బో ఒక్కసారిగా వాళ్ల జీవితమే మారిపోయిందిలెండి. ఐతే ఈ షో వల్ల కొందరికి పేరు ప్రఖ్యాతులతో పాటు అహంకారం కూడా తోడై వచ్చిందేమో అనిపిస్తోంది ఈ మధ్య కొన్ని సంఘటనల గురించి వింటుంటే. ఆల్రెడీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ సందర్భంగా షకలక శంకర్ అతి చేస్తే పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా వార్తలొచ్చాయి. తాజాగా మరో జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పబ్లిక్ లో హద్దులు దాటి ప్రవర్తించినట్లుగా ఓ టీవీ ఛానెల్లో ఓ వార్త వచ్చింది.

ఈ టీవీ ఛానెల్ ప్రతినిధి చెబుతున్న దాని ప్రకారం.. హైదరాబాద్ లోని ఫిలిం నగర్ ఏరియాలో ట్రాఫిక్ జాం అవగా.. వెనుక నుంచి ఓ వెహికల్ వచ్చి సుధీర్ కారును ఢీకొందట. దీంతో సుధీర్ కిందికి దిగి ఆ కారు నడుపుతున్న వాళ్లతో గొడవకు దిగి.. ఒకరిపై చేయి చేసుకున్నాడట. వాస్తవానికి వెనుక ఉన్న కార్లోని వ్యక్తులు అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్తున్న హడావుడిలో ఉన్నారట. ఈ సంగతి చెప్పి సుధీర్ ను సముదాయించబోయినా అతను కూల్ అవ్వకుండా వివాదాన్ని మరింత పెద్దది చేశాడట. ఈ మొత్తం దృశ్యాన్ని మీడియా ఛానెల్ ప్రతినిధి చిత్రీకరించబోతుంటే అతడిపైనా సుధీర్ దాడికి దిగాడట. దీంతో ఆ ప్రాంతంలో చాలా ఇబ్బందికర వాతావరణం నెలకొని ట్రాఫిక్ జాం మరింత పెరిగిందట. సోషల్ మీడియాలో కూడా ఈ వివాదం గురించి కొందరు స్పందించారు. ఐతే ఈ ఆరోపణలపై సుధీర్ వెర్షన్ ఏంటో తెలియాల్సి ఉంది.