Begin typing your search above and press return to search.

వుయ్ షెల్ ఓవర్ కమ్: ప్రపంచానికి ఇండియా స్ఫూర్తి

By:  Tupaki Desk   |   6 May 2020 4:13 PM GMT
వుయ్ షెల్ ఓవర్ కమ్: ప్రపంచానికి ఇండియా స్ఫూర్తి
X
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద విపత్తు కరోనావైరస్ అని ఇప్పటికే విశ్లేషకులు తేల్చారు. దీంతో కరోనా పేరు వింటే చాలు.. చాలామంది హడలిపోతున్నారు. దేశాలకు దేశాలే లాక్ డౌన్లు ప్రకటించి ప్రజలను ఇంటిపట్టున ఉండమని పిలుపునిచ్చాయంటేనే మనం పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయితే సమస్య వచ్చింది కదా అని ప్రతి క్షణం భయపడుతూ కూర్చుంటే ఆ సమస్యను ఎలా అధిగమించగలం? ఆ సమస్యను సమర్థంగా ఎదుర్కోవాలి. అందుకోసం మనవంతు బాధ్యతను మనం నిర్వర్తించాలి. మన కోసం పోరాడుతున్న వైద్యసిబ్బంది.. పోలీసువారు.. ఇతరులు అందరికీ మనం జేజేలు తెలపాలి. చెయ్యెత్తి మొక్కాలి. మనం తోడుగా ఉన్నామని వారికీ నమ్మకం కలిగించాలి. సహాయం కావాల్సిన వారికి మనకు చేతనైన సహాయం చెయ్యాలి. అధైర్యపడుతున్నవారికి ఈ సమయంలో మనం ధైర్యం చెప్పాలి.

కొందరు కళాకారులు ఇప్పటికే ఈ అంశంపై కొన్ని పాటలు రూపొందించారు. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా కరోనా క్రైసిస్ ఛారిటీ పాటలో కనిపించి ప్రజలను ఉత్తేజపరిచారు. ఇదే కోవలో నేషనల్ అవార్డు విన్నర్ జబ్బా ఈశ్వర్ గారు ఈమధ్యే 'వుయ్ షెల్ ఓవర్ కమ్' అంటూ సాగే ఒక స్ఫూర్తిదాయకమైన వీడియోను రూపొందించారు. ఈ వీడియోను వసుధైక కుటుంబం అనే కాన్సెప్ట్ తో రూపొందించడం విశేషం. భారతీయ సంప్రదాయంలోనే తరతరాలుగా 'వసుధైక కుటుంబం'అనే భావన ఉంది. ప్రపంచం అంతా ఒక కుటుంబం అనే భావనే ఇది. సినిమా పాట రూపంలో చెప్పుకుంటే 'జగమంత కుటుంబం నాది'. ప్రపంచం అంతా కరోనాను ఎదుర్కొనే ఈ సమయంలో భారత్ మిగతా దేశాలకు తోడుగా నిలవడం మనకు గర్వకారణం. ఎన్నో దేశాలకు కరోనా బాధితులను ట్రీట్ మెంట్ లో వినియోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను సరఫరా చెయ్యడం అందులో భాగమే. ఈ అంశాలను వీడియోలో పొందుపరిచి భారతదేశం ప్రపంచానికి అంతటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని చూపించారు.

'స్టే హోమ్ స్టే సేఫ్' అంటే మనం మన ఒక్క కుటుంబాన్ని మాత్రమే రక్షించుకోవడం కాదని.. తద్వారా మన రాష్ట్రాన్ని.. దేశాన్ని.. మొత్తం ప్రపంచాన్ని రక్షించడంమని.. అదే వసుధైవ కుటుంబ భావన అని ఈ వీడియో ద్వారా సందేశం ఇవ్వడం విశేషం. ఇక మే 4 న జరిగిన నామ్(NAM) సదస్సు వర్చువల్ మీటింగ్ లో ప్రధాని నరేంద్ర మోడీ వసుధైక కుటుంబం అనేది భారతీయుల జీన్స్ లో.. డీఎన్ ఎ లో ఉందని.. మేమందరం 'వసుధైవ కుటుంబం' ను నమ్ముతామని స్పష్టం చెయ్యడం.. "హోల్ వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ" అంటూ ఎలుగెత్తి చాటడం మన సంప్రదాయాలను.. భారతీయుల పరిణతిని ప్రపంచానికి మరోసారి తెలియచెప్పడమే. ఇదే కాన్సెప్ట్ ఈ వీడియోలో కూడా ఉండడం కాకతాళీయమే అయినా అభినందనీయం. మనం అందరం కలిసి ఈ సమస్యను అధిగమిస్తామనే సందేశంతో అధైర్యపడుతున్న వారిలో ఆత్మవిశ్వాసం రగిలేలా ధైర్యం పెరిగేలా ఈ వీడియోను ముగించడం విశేషం. ఆలస్యం ఎందుకు.. ఒక సారి పాటను చూసేయండి.