Begin typing your search above and press return to search.

రూ.200 కోట్ల మోసం కేసులో స్టార్ హీరోయిన్ కు బెయిల్..!

By:  Tupaki Desk   |   15 Nov 2022 1:30 PM GMT
రూ.200 కోట్ల మోసం కేసులో స్టార్ హీరోయిన్ కు బెయిల్..!
X
రూ.200 కోట్ల స్కామ్ లో జైలు పాలైన వ్యాపారవేత్త సుఖేష్ చంద్రశేఖరన్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఊరట లభించింది. ఢిల్లీలోని పాటియాలా కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

నవంబర్ 10న జాక్వెలిన్ బెయిల్ పై కోర్టులో విచారణ జరిపిన తర్వాత నిర్ణయం రిజర్వ్ చేయబడింది. ఈరోజు మంగళవారం రూ.2 లక్షల పూచీకత్తు మీద ఆమెకి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికే ఈ కేసుపై ఛార్జిషీట్ దాఖలైన నేపథ్యంలో కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని న్యాయస్థానం పేర్కొంది. అయితే అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఫెర్నాండేజ్ ను ఆదేశించింది.

కాగా, సుకేష్ చంద్రశేఖర్ పలువురిని మోసం చేసి అక్రమంగా డబ్బు సంపాదించాడు. రూ.200 కోట్ల మేర మనీ లాండరింగ్  పాల్పడ్డాడనే ఆరోపణలపై అతన్ని అరెస్ట్ చేసి ఈడీ - సీబీఐ విచారణ జరిపాయి. ఈ క్రమంలో అతనితో డేటింగ్ చేస్తుందని పేర్కొనబడిన శ్రీలంకన్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు తెరపైకి వచ్చింది.

సుఖేష్ తో జాకీ సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు రావడంతో వ్యవహారం అంతా బయటకు వచ్చింది. సుకేష్ కు ముద్దులు పెడుతూ జాక్వెలిన్ తీసుకున్న సెల్ఫీలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈడీ పలుమార్లు ఆమెను విచారించింది.

జాక్వెలిన్ మరియు ఆమె కుటుంబీకుల కోసం సుఖేష్ చంద్రశేఖర్ భారీ మొత్తాన్ని ఖర్చు చేశాడని.. కొన్ని ఖరీదైన బహుమతులు ఇచ్చాడని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన ఛార్జిషీట్‌ లో పేర్కొంది. మోసగించిన డబ్బుకు ఆమె కూడా లబ్ధిదారుగా తెలిపింది.

కాన్ మ్యాన్ సుఖేష్ తో సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పాత్ర కూడా ఉందని భావించిన ఈడీ అధికారులు.. ఆమెను విచారించారు. దీంతో ఈ కేసులో జాకీ మధ్యంతర బెయిల్ తీసుకుంది. అనంతరం ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసింది.

జాక్వెలిన్ బెయిల్ ని ఈడి వ్యతిరేకించింది. దర్యాప్తు నుండి తప్పించుకోవడానికి ఆమె దేశం విడిచి పారిపోయే అవకాశం వుందని ఆరోపించింది. సుకేశ్ కు జాక్వెలిన్ అత్యంత సన్నిహితురాలని.. ఆమె వద్ద ఈ కేసుకు సంబంధించి చాలా రహస్యాలున్నాయని పేర్కొంది.

అయితే ఆమె విచారణకు సహకరించడం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. బెయిల్ కొనసాగిస్తే ఆమె దేశం విడిచి పారిపోయే ప్రమాదముందని.. గతేడాది డిసెంబర్ లో కూడా దేశం విడిచి పారిపోవడానికి ఆమె ప్రయత్నించిందని వెల్లడించింది. అలాగే జాక్వెలిన్ బెయిల్ పై బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని కోర్టుకు తెలిపింది.

దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ, పాటియాలా కోర్టు.. ఇంత ప్రమాదమున్నప్పుడు ఆమెను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఈడీని ప్రశ్నించింది. వేర్వేరు నిందితుల పట్ల వేర్వేరు విధానాలను ఎందుకు అవలంబిస్తున్నారని నిలదీసింది. అనంతరం జాక్వెలిన్ బెయిల్ పిటిషన్ పై తీర్పును వాయిదా వేసింది. ఈ క్రమంలో తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.