Begin typing your search above and press return to search.

జగన్ మెగాబంధం... పవన్ కి ఇరకాటం...?

By:  Tupaki Desk   |   11 Feb 2022 10:30 AM GMT
జగన్ మెగాబంధం... పవన్ కి ఇరకాటం...?
X
మెగాస్టార్ చిరంజీవి పెద్ద మనిషి. ఆయన గురించి ఒక్క విమర్శ కూడా ఎవరూ చేయలేరు. ఒక విధంగా చెప్పాలంటే స్వయంసిద్ధంగా తనను తాను మలచుకున్న మనిషి చిరంజీవి. అలాంటి చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి ఇది మనకు సూట్ అవదు అని వెనక్కు వచ్చేశారు అంటేనే ఆయన గొప్పతనం తెలుస్తుంది. పదవులు అంటే పిచ్చి కాదు, ప్రాణాలు ఇచ్చే సమాజంలో మెగా ఇమేజ్ ఉండి కూడా పాలిటిక్స్ వద్దు అనుకున్న చిరంజీవి నిజంగా గ్రేట్.

అంతేనా. ఆయన ఇతరులను కూడా గౌరవిస్తారు. వారిని ప్రేమిస్తారు. జగన్ తన కంటే చిన్నవారు అయినా కూడా మెగాస్టార్ ఆయనను ఎంతో గౌరవిస్తూ చిత్ర సీమ సమస్యలను ఎన్నో సార్లు ప్రస్థావించారు. ఒక విధంగా చాలా వాటిని ఈ రొజుకు ఆయన‌ సాధించుకుని వచ్చారనే చెప్పాలి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో చిరంజీవి టాలీవుడ్ నే దృష్టిలో పెట్టుకున్నారు తప్ప తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ ని చూడలేదు అని అంటారు.

అవును నిజమే టాలీవుడ్ కష్టాలు వేరు, పవన్ రాజకీయాలు వేరు. చిరంజీవి తనకు తానే చెప్పుకున్నట్లుగా టాలీవుడ్ బిడ్డగా సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అదే టై, లో ఆయన జగన్ని పదే పదే పొగుడుతూ వస్తున్నారు. ఇందులో తప్పు కూడా లేదు. తమ సమస్యలను ముఖ్యమంత్రి సానుకూలంగా పరిష్కరిస్తున్నారు అన్న దాని మీద సంస్కారవంతుడిగా ఆయన రియాక్ట్ అయిన తీరు అది.

కానీ అదే ఇపుడు పవన్ కళ్యాణ్ జనసేనకు ఇబ్బందిగా మారుతోంది అంటున్నారు. జనసేనాని అయితే ఒంటి కాలి మీద జగన్ మీదకు లేస్తారు. రాజకీయాల్లోకి వచ్చి ఎనిమిదేళ్ళు కావస్తున్నా పవన్ ఏ రోజూ జగన్ని నేరుగా కలిసిన సందర్భం లేదు. ఒక దశలో ఈ ముఖ్యమంత్రిని నేను అసలు గుర్తించను అని కూడా పవన్ అన్నారు. ఆయన రాజకీయ పంధా అలాంటిది. ఆయన జగన్ని ఎంతగా ఎదుర్కొంటే అంతలా తన రాజకీయ పునాదులు బలంగా ఏర్పరచుకోగలరు.

అటువంటి వేళ చిరంజీవి జగన్ని పొగడడం అంటే ఒక విధంగా జనసేనకు ఇబ్బందిగా మారింది అంటున్నారు. అలాగని చిరంజీవిని టాలీవుడ్ సమస్యలు ప్రస్థావించవద్దు అని చెప్పలేరు. చిరంజీవి తనకు రాజకీయం వద్దు అనేసుకున్నారు. కానీ తమ్ముడు మాత్రం అటు సినిమాలు ఇటు రాజకీయాలు అంటూ సాగుతున్నారు. చిరంజీవి టాలీవుడ్ సమస్యలు పరిష్కరించడం ద్వారా సినిమా హీరోగా పవన్ కి లాభం చేకూరుతుంది. అదే టైమ్ లో రాజకీయంగా నష్టం వస్తుంది అన్న భావన అయితే జనసైనికులలో ఉంది.

మొత్తానికి చూస్తే తరాల అంతరం అని చెప్పాలా లేక మరోలా చూడాలా అన్నది తెలియదు కానీ చిరంజీవికి పవన్ కి మధ్య ఈ రకమైన వైవిధ్యాలు అయితే కనిపిస్తున్నాయి. మెగాస్టార్ పెద్ద మనిషితనం, ఆయన మంచితనం టాలీవుడ్ కి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అదే టైమ్ లో పవన్ పొలిటికల్ కెరీర్ కి ఇబ్బందిగా మారాయని అంటున్నారు. మొత్తానికి అన్నయ్యగా చిరంజీవి ఆశీర్వాదం పవన్ కి రాజకీయాల్లో దక్కడంలేదని జనసైనికులు ఫీల్ అవుతున్నారు అంటే వారి బాధలో అర్ధం ఉంది కదా.