Begin typing your search above and press return to search.

వైజాగ్ టాలీవుడ్ .. సీఎం జ‌గ‌న్ ప్లాన్ ఇదే

By:  Tupaki Desk   |   29 Dec 2019 5:30 PM GMT
వైజాగ్ టాలీవుడ్ .. సీఎం జ‌గ‌న్ ప్లాన్ ఇదే
X
2019 ఏపీ ఎన్నిక‌లు ఒక మిరాకిల్ అన్న సంగ‌తి తెలిసిందే. ఏపీకి మ‌రోసారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబే అంటూ ప్ర‌చార‌మైంది. అయితే ప‌చ్చ పార్టీ వ‌ర్గాలు తాము అనుకున్న‌ది ఒక్క‌టి అయిన‌దొక్క‌టి.. సీన్ అంతా రివ‌ర్స‌య్యింది. అప్ప‌టికే చంద్ర‌బాబు ఒంటెద్దు పోక‌డ‌కు విసిగిపోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జ‌నం క్లియ‌ర్ క‌ట్ గా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని సీఎంని చేయాల‌ని డిసైడ్ అయిపోయిన సంగ‌తిని ఎవ‌రూ ఊహించ‌లేదు. ఎన్నిక‌ల అనంత‌రం రిజ‌ల్ట్ కి దిమ్మ తిరిగిపోయింది. ఏపీకి యువ ముఖ్య‌మంత్రిగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేసింది మొద‌లు అస‌లు ఆట స్టార్ట‌య్యింది.

అమ‌రావ‌తి నుంచి రాజ‌ధాని వైజాగ్ కి షిప్ట్ అవ్వ‌డం .. ప‌రిపాల‌నా వికేంద్రీక‌ర‌ణ ల‌క్ష్యంగా యువ ముఖ్య‌మంత్రి మూడు ప్రాంతాల‌కు రాజ‌ధానిని పంచ‌డం సంచ‌ల‌న‌మైంది. ఇక ఇదే స‌మ‌యంలో వైజాగ్ టాలీవుడ్ కి ఒక్క‌సారిగా ఊహించ‌ని ఊపు వ‌చ్చేసింది. వైజాగ్ ప‌రిపాల‌నా రాజ‌ధాని అన్న మాట‌తోనే ఉత్త‌రాంధ్ర‌లో ఎర్త్ షేకింగ్ రెస్పాన్స్ క‌నిపిస్తోంది. విశాఖ ఉత్స‌వ్ ఈ సంగ‌తిని ప్రూవ్ చేసింది. అక్క‌డ అశేష జ‌న స‌మూహాలు మాన‌వ‌హారంగా ఏర్ప‌డి జ‌గ‌న్ కి ఆహ్వానం ప‌ల‌క‌డం చూస్తే ఈ ఊపు ఇక వెనుదిరిగే ఛాన్సే లేదని ఖాయ‌మైంది. ఇది ప్ర‌త్య‌ర్థుల‌కు మైండ్ బ్లాక్ అయ్యే ట్రీట్ అనే చెప్పాలి. రాజ‌ధానితో పాటే ఇత‌ర‌త్రా ప‌రిశ్ర‌మ‌లు ఇప్పుడు వైజాగ్ కి క్యూ కట్టాల్సిన స‌న్నివేశం ఉంది. ఐటీ ఇప్ప‌టికే విశాఖ‌లో అభివృద్ధి చెందింది. ఇత‌ర‌త్రా ప‌రిశ్ర‌మ‌లు త‌ర‌లి రావాల్సి ఉంది. ఇప్ప‌టికే వైజాగ్ లో అన్ని బ్రాండెడ్ స్టార్ హోట‌ళ్లు ఉన్నాయి. విమ‌నాశ్ర‌యం అందుబాటులో ఉంది. దీనివ‌ల్ల ప‌ర్యాట‌కం వేగంగా అభివృద్ధి చెందుతోంది. టాలీవుడ్ షూటింగులు 90 శాతం విశాఖ‌- అర‌కు బెల్ట్ లోనే జ‌ర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం కూడా ఈ సౌక‌ర్యాలే. ఇప్పుడు విశాఖ సుంద‌ర న‌గ‌రం ప్ర‌ముఖుల విజిటింగుల‌కు అత్యంత అనుకూలమనే సందేశం వెళ్లింది.

అస‌లింత‌కీ జ‌గ‌న్ మైండ్ లో ఏపీ టాలీవుడ్ ఆలోచ‌న ఉందా? అస‌లు ప్లాన్ ఏదైనా ఉందా? అంటే.. ఇక ఇందులో ఎలాంటి సందేహం లేదు.. బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రంలో మ‌రో టాలీవుడ్ నెల‌కొల్ప‌డం ఖాయ‌మ‌ని వైకాపా ఇన్ సైడ్ సోర్స్ చెబుతోంది. ఇప్ప‌టికే విశాఖలో ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు ప్ర‌తిచోటా ఈ విష‌యాన్ని ప్ర‌స్థావిస్తున్నారు. విశాఖ వాసుల్లో ఉత్సాహం పెంచుతున్నారు. క‌ళ‌ల కాణాచి హైద‌రాబాద్ మాత్ర‌మేనా? ఇక‌పై విశాఖలోనూ క‌ళా క్షేత్రం పాదుకోవ‌డం ఖాయం అని చెబుతున్నారు. ముఖ్యంగా వైజాగ్ టాలీవుడ్ రూప‌క‌ల్ప‌న‌కు నాయ‌కుల్లో ఎంతో ఉత్సాహం క‌నిపిస్తోంది. ఇక విశాఖ రాజ‌ధాని అన‌గానే హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ నుంచి సానుకూల దృక్ప‌థం క‌నిపించింది. విశాఖ‌- అర‌కు ప‌రిస‌రాలు కొత్త టాలీవుడ్ నిర్మాణానికి అనుకూలం అన్న ఆలోచ‌న ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్ మైండ్ లో ఉంద‌ట‌. అందుకే నిన్న‌టి సాయంత్రం విశాఖ ఉత్స‌వ్ కార్య‌క్ర‌మంలో ల‌క్ష‌లాది జ‌నాల ముందు ఏపీ పర్యాటకశాఖ మంత్రి అవంతీ శ్రీనివాస్ స్వ‌యంగా `వైజాగ్ టాలీవుడ్` ప‌ట్టాలెక్కుతున్న‌ట్టేన‌ని ప్ర‌క‌టించారు. బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రంలో టాలీవుడ్ నెలకొల్పేందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సిద్ధంగా ఉన్నార‌ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నానికి తెర తీశారు. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే విశాఖ‌లో సినీప‌రిశ్ర‌మ పేరుతో భారీగా ఉపాధి పెర‌గ‌నుంది. అలాగే టాలీవుడ్ రూపంలో ప్ర‌త్య‌క్షంగానే దాదాపు 3000 కోట్లు పైగా ప‌న్నుల రూపంలో ఆదాయం పెర‌గ‌నుంద‌ని అంచ‌నా. ఇక మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడులా తాత్సారం చేసే మైండ్ సెట్ జ‌గ‌న్ కి లేద‌ని.. వైజాగ్ టాలీవుడ్ ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌త్యేకంగా చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌స్తుతం దీనిపై టాలీవుడ్ సినీపెద్ద‌ల్లోనూ.. మీడియాలోనూ విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతోంది. విశాఖ ఇక‌పై `ఐటీ-ప‌రిశ్ర‌మ‌లు-వ్యాపారం-సినీప‌రిశ్ర‌మ‌` హ‌బ్ గా వేగంగా అభివృద్ధి చెంద‌నుంది. వెన‌క‌బ‌డిన ఉత్త‌రాంధ్ర‌కు ఇక‌పై ఉపాధి ప‌ర‌మైన కొర‌త కూడా తీర‌నుంద‌ని యువ‌త‌రంలో చ‌ర్చ వేడెక్కిస్తోంది.