Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ అంత మాట అంటాడని ఊహించలేదు: జగపతిబాబు

By:  Tupaki Desk   |   17 Jan 2022 3:06 AM GMT
ఎన్టీఆర్ అంత మాట అంటాడని ఊహించలేదు: జగపతిబాబు
X
టాలీవుడ్ లో బలమైన సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కథానాయకులలో జగపతిబాబు ఒకరు. వీబీ రాజేంద్రప్రసాద్ తనయుడిగా ఇండస్ట్రీలో ఆయనకి ఎంతో గౌరవం ఉంది. జగపతి పిక్చర్స్ బ్యానర్ కి ఎంతో ప్రతిష్ఠ ఉంది. ఆ బ్యానర్ నుంచి ఎన్నో సూపర్ హిట్లు వచ్చాయి. అలాంటి ఒక నేపథ్యం నుంచి వచ్చిన జగపతి బాబు .. ఎప్పుడూ కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నట్టుగా కనిపించరు. తన స్టార్ డమ్ ను చూపించడానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. "నిన్న అయిపోయింది .. ఈ రోజు సంగతేంటి?" అనేదే ఆయన ప్రశ్న.

అందువలన హీరోగా అవకాశాలు తగ్గడం వలన .. విలన్ గా ఆయన టర్న్ తీసుకున్నప్పటికీ ఎవరూ ఎలాంటి కామెంట్లు చేయలేకపోయారు. 'లెజెండ్' సినిమాతో టాలీవుడ్ అంతా కూడా ఒక పవర్ ఫుల్ విలన్ తమకి దొరికాడనే అనుకున్నారు. జగపతిబాబు కళ్లు .. అయన వాయిస్ విలనిజానికి ఎక్కువగా సెట్ కావడంతో, ఆయన పూర్తిగా బిజీ అయ్యారు. హీరోగా కంటే విలన్ గా ఆయనకి వస్తున్న క్రేజ్ ఎక్కువ .. పారోతోషికం కూడా ఎక్కువే. ఇప్పుడు జగపతిబాబు ఎదురుగా నిలబడి యాక్ట్ చేయాలంటే యంగ్ స్టార్ హీరోలు మరింత కసరత్తు చేస్తున్నారు.

మహేశ్ .. చరణ్ .. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు తమ సినిమాల్లో జగపతిబాబు ఉండాలని కోరుకుంటారు. తమ ఎదురుగా ఆయన ఉంటే ఆ సీన్ ఎక్కడికో వెళుతుందని భావిస్తారు. అలాంటి జగపతిబాబు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. " నాకు ఎన్టీఆర్ యాటిట్యూడ్ అంటే ఇష్టం. 'అరవింద సమేత' సినిమాలో ఆయన పాత్ర కంటే నేను చేసిన 'బసిరెడ్డి' పాత్ర పవర్ఫుల్. ఆ పాత్రను ఆ స్థాయిలో చూపించడానికి ఎన్టీఆర్ ఒప్పుకోవడం విశేషం. ఆ సినిమా ఫంక్షన్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ, 'అరవింద సమేత' సినిమా పేరు వినగానే ముందుగా 'బసిరెడ్డి' గుర్తుకు వస్తాడు .. ఆ తరువాత నేను గుర్తుకు వస్తాను" అని చెప్పడం ఆయన గొప్పతనం.

ఇక ఈ సినిమా షూటింగు చేస్తున్నప్పుడు కూడా ప్రతి రోజూ ఎన్టీఆర్ నాకు కాల్ చేసి, నా పాత్రను గురించి ప్రస్తావించేవాడు. 'బసిరెడ్డి' పాత్ర హైలైట్ అంటూ నన్ను ప్రేమతోనే తిట్టేవాడు. ఇక మీతో పోటీ పడి యాక్ట్ చేయడం నా వల్ల కాదు. మీరు తారక్ తోనే ఆడుకుంటున్నారు. ఒక నాలుగైదేళ్లు మీ ముఖం నాకు చూపించకండి అనేవాడు. నేను కూడా సరే అంటూ నవ్వేసేవాడిని" అంటూ చెప్పుకొచ్చారు. మరి మళ్లీ ఈ ఇద్దరినీ తెరపై ఎప్పుడు చూస్తామా అనే ఆసక్తితో అభిమానులు ఉన్నారు. కొరటాల సినిమాతో ఆ ముచ్చట తీరుతుందేమో చూడాలి.