Begin typing your search above and press return to search.

ఇలాంటి డైరెక్టర్స్ కోసం ప్రాణాలు ఇచ్చేయవచ్చు: జగపతిబాబు

By:  Tupaki Desk   |   22 Jan 2022 4:07 AM GMT
ఇలాంటి డైరెక్టర్స్ కోసం ప్రాణాలు ఇచ్చేయవచ్చు: జగపతిబాబు
X
జగపతిబాబు హీరోగానే కాదు .. విలన్ గా కూడా తానేమిటన్నటి నిరూపించుకున్న నటుడు. బలమైన సినిమా నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ, ఆయన చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటారు. తాను ఒక స్టార్ ను అనే ఆలోచనను ఆయన పూర్తిగా పక్కన పెట్టేసి .. తాను ఒక ఆర్టిస్టును అనే ఆలోచనతోనే ముందుకు వెళుతుంటారు. తాను అనుకున్న విషయమేదైనా మనసులో దాచుకోవడం ఆయనకి అలవాటు లేదు. చాలా నిర్మొహమాటంగా చెప్పేస్తూ ఉంటారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ గురించి ప్రస్తావించారు.

"బోయపాటి ఇది వరకూ చాలా ఎక్కువగా బూతులు మాట్లాడేవారు .. ఇప్పుడు మానేశారు. ఆల్కహాల్ మానడం .. సిగరెట్లు మానడం ఎంత కష్టమో, బూతులు మాట్లాడటం కూడా అంతే కష్టం. అలాంటిది ఆయన బూతులు మాట్లాడట మనేది పూర్తిగా మానేసి బంగారమైపోయాడు. ఆయన ఆ అలవాటును మార్చుకోవడం వలన తాను హ్యాపీగా ఉన్నాడు .. మేము హ్యాపీగా ఉన్నాము. ఇక రాజమౌళి గారి గురించి అందరికీ తెలిసిందే. ఆయన పాత్రలను డిజైన్ చేసే తీరు .. విలన్ ను పవర్ఫుల్ గా చూపించే విధానం బాగుంటాయి.

ఒకసారి ఆయన కలిసినప్పుడు విలన్ గా నన్ను తన సినిమాల్లో పెట్టుకోలేకపోతున్నందుకు అసంతృప్తిని వ్యక్తం చేశారు. "విలన్ గా నన్నుపెట్టుకోవాలనే రూలేం లేదు కదా .. మీరు ఆ విషయాన్ని గురించి అంతగా ఆలోచించకండి" అని అన్నాను. కొరటాల శివ విషయానికి వస్తే ఇంతవరకూ ఆయనకి ఫెయిల్యూర్ అనేదే లేదు. ఎందుకంటే ముందుగానే ఆయన ఒక 15 .. 20 కథలను రెడీ చేసుకున్నారు. ఆయన ఆలోచనా విధానం చాలా బావుంటుంది. అలాంటివాళ్లకి మంచే జరుగుతుంది.

పూరి జగన్నాథ్ అంటే నాకు చాలా ఇష్టం .. ఆయన ఐడియాలజీ నాకు చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఎంత పెద్ద సీన్స్ అయినా చాలా సింపుల్ గా లేపేస్తాడు. ఇప్పటికీ కాల్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేస్తాడు .. లేదంటే ఆ తరువాత చేస్తాడు. 99 పెర్సెంట్ డైరెక్టర్స్ అలా చేయరు .. కానీ పూరి అలా కాదు. సినిమా చేసినా .. చేయకపోయినా మనిషి బంగారమే. సుకుమార్ అల్టిమేట్ డైరెక్టర్. ఇలాంటి డైరెక్టర్స్ కి ప్రాణాలు ఇచ్చేయమంటే ఆరిస్టులం ఇచ్చేయవచ్చు. ఆయన ఏది అడిగినా ఏదో ఒక బలమైన కారణం ఉంటుందనే విషయం మాకు కచ్చితంగా తెలిసిపోతుంది. ఒక మనిషిగా నాకు ఆయనంటే చాలా ఇష్టం" అని చెప్పుకొచ్చారు.