Begin typing your search above and press return to search.

కమ్మ కులం గొప్పేంటన్న జగపతిబాబు

By:  Tupaki Desk   |   26 March 2016 9:40 AM GMT
కమ్మ కులం గొప్పేంటన్న జగపతిబాబు
X
సినిమా పరిశ్రమ అంటేనే హిపోక్రటిక్ పీపుల్ కి కేరాఫ్ అ్రడస్. ఇక్కడ మనసుకు ముసుగేసుకోకుండా మాట్లాడేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో జగపతి బాబు పేరు ముందు చెప్పుకోవాలి. తనకేమనిపిస్తే అది మాట్లాడతాడు ఈ సీనియర్ హీరో. కులాల ప్రస్తావన వస్తే చాలు.. ఆయనకు ఆవేశం ఆగదు. ఈ విషయంలో చాలాసార్లు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడాడు జగపతి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కులం పేరెత్తి మరీ... ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

‘‘నాకు కుల - ప్రాంత భేదాలు లేవు. ఉంటే ‘జై బోలో తెలంగాణ’ సినిమా చేసేవాణ్ణి కాదు. కులాలు లేని సమాజాన్ని కోరుకుంటాను. పేర్ల వెనుక కులం పేరు తగిలించుకోవడం నాకు తెలిసి ప్రపంచంలో మనదేశంలో తప్ప మరే దేశంలోనూ ఉన్నట్లు నేను గమనించలేదు. ఒక కులాన్ని బీసీలో చేర్చాలనీ.. ఇంకో కులాన్ని ఎస్సీ లేదా ఎస్టీలో చేర్చాలనే డిమాండ్లు రాజకీయపరమైనవిగా నేను భావిస్తాను. నేను కమ్మవాడిగా పుట్టాను కాబట్టి ఈ మాటలు చెప్పడం లేదు. ఏ కులంలో పుట్టినా ఇవే మాటలంటాను. కమ్మవాడిగా పుట్టినంత మాత్రాన నా గొప్పేమిటంటాను. మిగతా అందరిలాగే కమ్మవాళ్లూ పుట్టారు. అలాంటప్పుడు వాళ్ల గొప్ప - ప్రత్యేకత ఏముంటాయి?’’ అని ప్రశ్నించిన జగపతి కొన్నేళ్ల కిందట విజయవాడలోని సిద్ధార్థ కాలేజీ ఫంక్షన్ కు వెళ్లినపుడు తనకు ఎదురైన విచిత్ర అనుభవం గురించి వివరించారు.

‘‘ఆ కాలేజీ ఫంక్షన్లో తాను కమ్మ కులం గురించిమాట్లాడతానిన ప్రిన్సిపాల్‌ తో అంటే ఆయన వద్దని వారించారు. ‘మీరు ఒక్కరే. ఆడిటోరియంలో రెండు వేల మంది విద్యార్థులున్నారు. వాళ్లలో కమ్మవాళ్లదే డామినేషన్. మీరు దీనిపై ఏమైనా మాట్లాడితే వాళ్లు మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు’ అని హెచ్చరించారు. కానీ నేను ఆయన మాటల్ని పట్టించుకోలేదు. ఏం మాట్లాడాలనుకున్నానో అదే మాట్లాడాను. కమ్మవాళ్ల గొప్పేంటని ప్రశ్నించాను. ‘మీ ప్రిన్సిపాల్‌ ఇలా అన్నారయ్యా’ అని కూడా చెప్పాను. ‘ఇప్పుడు మీరేం చేస్తారు? నన్ను చంపుతారా? అయితే రండి. చంపండి’ అన్నాను. వెంటనే ఆడిటోరియం చప్పట్లతో మారుమోగిపోయింది. కులాన్ని వ్యతిరేకిస్తే వాళ్లు ఏం చేస్తారో అని మనం భయపడుతున్నాం. కానీ.. నిజానికి చాలామంది అలా లేరు. నన్ను కమ్మ సంఘం వాళ్లు వన భోజనాలకు పిలుస్తుంటారు. కానీ అలాంటి కుల భోజనాలకు, కుల సమావేశాలకు నేను వెళ్లను. ఇలాంటివన్నీ ఏంటి? మనమెక్కడ ఉన్నాం? ఇవి పోయినప్పుడే మన సమాజం బాగుపడుతుందనేది నా నమ్మకం’’ అని జగపతి చెప్పాడు.