Begin typing your search above and press return to search.

అల్లుడి గురించి జగపతి ఏమంటున్నాడు?

By:  Tupaki Desk   |   2 Aug 2015 5:30 PM GMT
అల్లుడి గురించి జగపతి ఏమంటున్నాడు?
X
తెలుగు సినీ పరిశ్రమలోని పెద్ద కుటుంబాల్లో జగపతి బాబు ఫ్యామిలీ ఒకటి. డబ్బు, పలుకుబడి అన్నీ ఉన్న జగపతి.. కావాలంటే తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద ఫ్యామిలీస్ నుంచి అల్లుణ్ని తెచ్చుకుని ఉండొచ్చు. కానీ ఆయన మాత్రం తన పెద్దమ్మాయిని ఓ అమెరికా అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు. ఆ పెళ్లి టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఇక్కడెవరూ లేరా.. అమెరికా వాణ్ని తెచ్చుకున్నాడు అంటూ సెటైర్లు కూడా వేశారు కొంతమంది. మరి ఏరికోరి ఈ అమెరికా అల్లుణ్నే ఎందుకు తెచ్చుకున్నాడు జగపతి. కారణమేంటో జగపతి మాటల్లోనే విందాం పదండి.

‘‘నిజానికి మా అమ్మాయికి ముందు ఇక్కడే సంబంధాలు చూశాం. అయితే ఎవరినైనా సంబంధం గురించి అడగడం ఆలస్యం.. మీకు చాలా డబ్బుంది కదా, అల్లుడికి ఎంతిస్తారు అని అడగడం చూసి చిత్రంగా అనిపించింది. దీంతో మా అమ్మాయినే పిలిచి.. ‘నేను ఎన్ని కోట్లు ఇచ్చి పెళ్లి చేసినా మంచి మొగుడని వాడికి ట్యాగ్ వేసివ్వరు, ఎందుగ్గానీ నువ్వే చూసుకో’ అని చెప్పేశా. తర్వాత మా అమ్మాయి ఆ అమెరికా అబ్బాయిని చూపించి నచ్చాడంది. అతను తన తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటున్నాడు. మా అమ్మాయి యుఎస్ లో చదువుతున్నపుడు చాలా సాయం చేశాడు. అతని వ్యక్తిత్వం నాకు నచ్చింది. చాలామంది మనోడికివ్వకుండా అమెరికా వాడికిస్తున్నావేంటి అన్నారు. నాకు కులాలు, ప్రాంతాలు, జాతుల పట్టింపు లేదు. మా అల్లుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్. పెళ్లయ్యాక నెలన్నర ఇక్కడే ఉన్నాడు. మన సంస్కృతి సంప్రదాయాలు, వంటకాలు తనకు చాలా బాగా నచ్చాయి. మా ఆవిడనైతే అమెరికా వచ్చి రోజూ దోసెలు వేసి పెట్టమని అడిగాడు’’ అంటూ అల్లుడి సంగతులు చెప్పాడు జగపతి.