Begin typing your search above and press return to search.

వామ్మో జగపతీ.. ఏందీ అవతారం?

By:  Tupaki Desk   |   13 Oct 2018 1:30 AM GMT
వామ్మో జగపతీ.. ఏందీ అవతారం?
X
‘లెజెండ్’ తర్వాత జగపతిబాబు కెరీర్ ఎలా మలుపు తీసుకుందో అందరూ చూశారు. ఈ నాలుగైదేళ్లలో జగపతి రేంజే మారిపోయింది. పలు భాషల్లో అద్భుతమైన పాత్రలతో దూసుకెళ్లిపోతున్నారు. ముఖ్యంగా తెలుగులో ‘నాన్నకు ప్రేమతో’.. ‘రంగస్థలం’ లాంటి సినిమాల్లో జగపతి నటన చూసి అంతా ఆశ్చర్యపోయారు. అతడిలో ఇంత మంచి నటుడున్నాడా అనిపించాడు. ఇప్పుడు ‘అరవింద సమేత’లో జగపతి బాబును చూసి మరింతగా షాకవుతున్నారు. ఇందులో జగపతి బాబు గెటప్.. ఆయన బాడీ లాంగ్వేజ్.. నటన.. డైలాగ్ డెలివరీ.. అన్నీ కూడా షాకింగ్ అనే చెప్పాలి. విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్గుగా మారాక జగపతికి ఇదే బెస్ట్ పెర్ఫామెన్స్ అన్నా కూడా అతిశయోక్తి లేదు. మొత్తంగా జగపతిబాబు కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్ లో కూడా ఇది ఒకటిగా నిలుస్తుంది.

‘అరవింద సమేత’ ప్రి రిలీజ్ ఈవెంట్లో సునీల్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో జగపతిని పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేస్తాడని అన్నాడు. సినిమా చూసినపుడు ఆ మాటలో అతి ఏమీ లేదని అనిపిస్తుంది. నిజంగా జనాల్ని భయపెట్టే స్థాయిలో జగపతి బాబు క్యారెక్టర్ ఉంది. ఫ్యాక్షన్ నాయకుడిగా జగపతి బాబు గెటప్పే అదిరిపోయింది. ఇక ఆయన హావభావాలు.. డైలాగ్ డెలివరీ కూడా అత్యుత్తమంగా సాగాయి. ముఖ్యంగా రాయలసీమ యాసను జగపతి సరిగ్గా పట్టుకుని.. డైలాగుల్ని పలికిన విధానం అద్భుతం అనే చెప్పాలి. జగపతి ఇందులో బసిరెడ్డి అనే ఫ్యాక్షనిస్టుగా కనిపించాడు. మెడలో కత్తి దిగి తీవ్ర గాయం కావడంతో ఆ బాధ ఓవైపు మెలిపెడుతుండగా.. కష్టం మీద మాట్లాడుతున్నట్లు కనిపించాలి ఇందులో. ఆ సన్నివేశాల్లో జగపతి అభినయం.. డైలాగులు పలికిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. జగపతి విషయంలో ఇన్నాళ్లూ ఎవరికైనా నెగెటివ్ అభిప్రాయాలున్నా ఈ సన్నివేశాల్లో ఆయన పెర్ఫామెన్స్ చూసి ఒపీనియన్స్ మార్చుకుంటారేమో. ‘అంత:పురం’ తర్వాత జగపతికి దక్కిన ఆ స్థాయి పాత్ర ఇదే అంటున్నారు విశ్లేషకులు.