Begin typing your search above and press return to search.

`నంది`వివాదంతో నాకు సంబంధం లేదు: జ‌గ‌ప‌తి

By:  Tupaki Desk   |   19 Nov 2017 9:29 AM GMT
`నంది`వివాదంతో నాకు సంబంధం లేదు: జ‌గ‌ప‌తి
X
ప్ర‌స్తుతం టాలీవుడ్ ను నంది అవార్డుల వివాదం కుదిపేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ అవార్డుల‌పై సెలబ్రిటీలు, సినీ ప్ర‌ముఖులు ఎవ‌రికి తోచిన అభిప్రాయాన్ని వారు వెలిబుచ్చుతున్నారు. అవార్డులు అందుకున్న కొంత‌మంది ఆచితూచి స్పందిస్తున్నారు. మ‌రికొంద‌రు స్పందించడానికి ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఆ అవార్డుకు అర్హులు అని అంద‌రూ అభిప్రాయ‌ప‌డుతున్న వ్య‌క్తులు మాత్రం ఈ వివాదంపై ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌డంలేదు. మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీకి అవార్డుల‌లో అన్యాయం జ‌రిగింద‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఆ రెండు ఫ్యామిలీల నుంచి ఈ వివాదంపై ఎవ‌రూ స్పందించ‌లేదు. మెగా ఫ్యామిలీకి లేని బాధ మీకెందుకు....అంటూ సినీ న‌టి జీవిత మీడియా సాక్షిగా స్టేట్ మెంట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ ట్ర‌స్టులో జ‌రిగిన ర‌క్త‌దాన శిబిరం సంద‌ర్భంగా నంది వివాదంపై మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు బాల‌య్య స‌మాధాన‌మివ్వ‌కుండా న‌వ్వి వెళ్లిపోయారు.

అదే ర‌క్త‌దాన శిబిరంలో పాల్గొన్న జ‌గ‌ప‌తి బాబుకు కూడాఈ వివాదంపై ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు జ‌గ‌ప‌తి ఆస‌క్తిక‌ర స‌మాధాన‌మిచ్చారు. లెజెండ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జ‌గ‌ప‌తి బాబు...ఆ చిత్రంలో న‌ట‌న‌కు గానూ ఉత్తమ విలన్ గా నంది అవార్డు దక్కించుకున్న సంగ‌తి తెలిసిందే. మీడియాతో మాట్లాడిన జ‌గ‌ప‌తి నంది వివాదంపై స్పందించారు. నంది అవార్డు రావడంతో చాలా హ్యాపీగా ఉంద‌ని అన్నారు. తాను హీరోగా న‌టించిన‌ తొలి చిత్రం ‘సింహ స్వప్నం’ 3 రోజులు ఆడింద‌ని, విలన్‌గా చేసిన ‘లెజెండ్‌’ 3 సంవ‌త్స‌రాలు ఆడింద‌ని అన్నారు. దాంతోపాటు, ప్రభుత్వం, ప్రేక్షకుల నుంచి గుర్తింపు కూడా లభించింద‌న్నారు. నందిపై వివాదం త‌న స‌మ‌స్య కాద‌ని, వాటితో త‌న‌కు సంబంధం లేదని, అది మీడియా ప్రాబ్లమ్ అని జ‌గ‌ప‌తి ఎస్కేప్ అయ్యారు. స‌మ‌యానికి ర‌క్త‌దానం చేసిన వాళ్లు దేవుళ్ల‌తో స‌మాన‌మ‌ని జ‌గ‌ప‌తి బాబు అన్నారు. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ర‌క్త‌దాన శిబిరంలో పాల్గొన్న జ‌గ‌ప‌తి ర‌క్త‌దానం చేశారు. ర‌క్త‌దానం చేయ‌డం వ‌ల్ల ఆప‌దలో ఉన్న వారి ప్రాణాలు కాపాడ‌వ‌చ్చ‌ని అన్నారు. స‌మ‌యానికి ర‌క్తం అంద‌క చాలామంది ప్రాణాలు కోల్పోతున్నార‌ని, ఆరోగ్య‌వంతంగా ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ స్వ‌చ్ఛందంగా ర‌క్త‌దానం చేసేందుకు ముందుకు రావాల‌ని జ‌గ‌ప‌తి పిలుపునిచ్చారు.