Begin typing your search above and press return to search.

ట్రైలర్: హై యాక్టేన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా 'జై భజరంగి'

By:  Tupaki Desk   |   21 Oct 2021 9:56 AM GMT
ట్రైలర్: హై యాక్టేన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా జై భజరంగి
X
కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''జై భజరంగి 2''. 2013 లో కన్నడలో ఘన విజయం సాధించిన 'భజరంగి' చిత్రానికి ఇది సీక్వెల్. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ''జై భజరంగి'' పేరుతో తీసుకొస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాని కన్నడ, తెలుగు భాషలలో అక్టోబర్ 29న ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన 'జై భజరంగి' టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. హై టెక్నికల్ వాల్యూస్ తో భారీ బడ్జెట్ తో ఒక ఫాంటసీ థ్రిల్లర్ గా ఈ సినిమాని రూపొందించినట్లు అర్థం అవుతోంది. కొన్ని విజువల్స్ హాలీవుడ్ సినిమాలను గుర్తు చేస్తున్నాయి. టెక్నికల్ గా సౌత్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిన 'బాహుబలి' 'కెజియఫ్' లకు ఏ మాత్రం తగ్గకుండా హాలీవుడ్ టెక్నిషన్స్ సహకారంతో విఎఫ్ఎక్స్ వర్క్స్ చేయించారు.

ఎనిమిదేళ్ల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ లో హీరో శివన్న అదే ఎనర్జీతో ఇంటెన్స్ గా కనిపించాడు. అంతేకాదు ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ బాడీతో అభిమానులను అలరించనున్నారు. 'జై భజరంగి' ట్రైలర్ లో సినిమా గురించి ఎక్కువ రివీల్ చేయకుండా.. ప్రతి పాత్రను చూపించే ప్రయత్నం చేశారు. అలానే సినిమా మీద అంచనాలు పెరిగేలా కట్ చేశారు. ఇందులో శివరాజ్ కుమార్ సరసన భావన మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె పాత్ర కూడా కథలో చాలా కీలకమని ట్రైలర్ లో తెలుస్తుంది.

ఈ చిత్రంలో సౌరవ్ లోకేష్ భయంకరమైన విలన్ గా కనిపిస్తుండగా.. శృతి - శివరాజ్ కె ఆర్ పెటే ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. 'జై భజరంగి' చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ హర్ష దర్శకత్వం వహించారు. అర్జున్‌ జన్య సంగీతం సమకూర్చారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను వీడియో రైట్స్ దక్కించుకుని విడుదల చేసే శ్రీ బాలాజీ వీడియో సంస్థ.. ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. నిరంజన్ పన్సారి దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'కిల్లింగ్ వీరప్పన్' 'గౌతమీ పుత్ర శాతకర్ణి' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివరాజ్ కుమార్.. 'జై భజరంగి' సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.