Begin typing your search above and press return to search.

24 ఏళ్ల కెరీర్ లో `జై భీమ్` వెరీ స్పెష‌ల్!

By:  Tupaki Desk   |   29 Oct 2021 10:44 AM GMT
24 ఏళ్ల కెరీర్ లో `జై భీమ్` వెరీ స్పెష‌ల్!
X
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క‌థానాయ‌కుడిగా `జై భీమ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. 1990 లో త‌మిళ‌నాడు లో జ‌రిగిన కొన్ని య‌ధార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని థా.సె జ్ఞాన్ వేల్ తెర‌కెక్కించారు. 2డీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌..జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాపై భారీ అంచ‌నాల్ని క్రియేట్ చేసాయి. ట్రైల‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. దీంతో `జై భీమ్` రెట్టించిన అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ సినిమా గురించి సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

``24 ఏళ్ల కెరీర్ లో ఎన్నో ఎత్తు ప‌ల్లాలు చూసాను. అయినా ఏ రోజు నా అభిమానులు న‌న్ను వ‌ద‌ల్లేదు. 24 ఏళ్ల నుంచి నాతో పాటే అభిమానులు ప్ర‌య‌ణం చేస్తున్నారు. నాపై ఇంత న‌మ్మ‌కం ఉంచినందుకు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు. వారికి కేవ‌లం నా నుంచి మంచి సినిమాలు ఇచ్చి వారిని సంతోషంగా ఉంచ‌డం తప్ప నేను చేసిందేం లేదు. సినిమా అనేది మా ఇద్ద‌రి మ‌ధ్య ఇంత గొప్ప బంధాన్ని ఏర్ప‌రిచింది. నా కెరీర్ లో మోస్ట్ ఛాలెంజింగ్ సినిమాల‌లో ఇది ఒక‌టి. లాయ‌ర్ చంద్ర‌ పాత్ర చాలెంజింగ్ గా ఉంటుంది. నా గ‌త చిత్రాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. క‌మ‌ర్శియ‌ల్ అంశాలు పెద్ద‌గా ఉండ‌వు`` అని తెలిపారు.

``క‌థ‌లో పాత్ర‌ల ఎమోష‌న్స్ మాత్ర‌మే క‌నిపిస్తాయి. ప్ర‌తీ పాత్ర దేనిక‌దే ప్ర‌త్యేకంగా ఉంటుంది. ప్ర‌తీ ఒక్క‌రినీ క‌దిలించే చిత్ర‌మిది. ఇది నాకు చాల‌కాలం పాటు గుర్తిండిపోయే సినిమా. ఈ సినిమా ని ఓ బాధ్య‌త‌గా భావించి చేసాను`` అని సూర్య అన్నారు. ఈ చిత్రం న‌వంబ‌ర్ 2న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ రిలీజ్ అవుతుంది. ఇందులో ప్ర‌కాశ్ రాజ్.. రావు ర‌మేష్..రాజీషా విజ‌య‌న్..మ‌ణికంద‌న్.. లిజో మోల్ జోస్ కీల‌క పాత్ర లు పోషించారు.