Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ‘జై లవకుశ’

By:  Tupaki Desk   |   21 Sep 2017 8:47 AM GMT
మూవీ రివ్యూ : ‘జై లవకుశ’
X
చిత్రం : ‘జై లవకుశ’

నటీనటులు: ఎన్టీఆర్ - రాశి ఖన్నా - నివేదా థామస్ - సాయికుమార్ - పవిత్ర లోకేష్ - పోసాని కృష్ణమురళి - ప్రవీణ్ - ప్రదీప్ రావత్ - బ్రహ్మాజీ - సత్య తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు
స్క్రీన్ ప్లే: కోన వెంకట్-చక్రవర్తి
నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్
కథ - మాటలు - దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర (బాబీ)

టెంపర్.. నాన్నకు ప్రేమతో.. జనతా గ్యారేజ్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టి ఊపుమీదున్న జూనియర్ ఎన్టీఆర్... ఈ ఊపులో చకచకా కానిచ్చేసిన సినిమా ‘జై లవకుశ’. ‘పవర్’.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాల దర్శకుడు బాబీ రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తిని రేకెత్తించింది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయడం.. పైగా అందులో ఒకటి నెగెటివ్ రోల్ కావడం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘జై లవకుశ’ ఆ అంచనాల్ని ఏమేరకు అందుకుందో చూద్దాం పదండి.

కథ:

జై.. లవ.. కుశ.. ముగ్గురు సోదరులు. అందులో జైకి నత్తి ఉంటుంది. ఆ లోపాన్ని చూపించి ఎగతాళి చేస్తూ తమ్ముళ్లిద్దరూ అన్నపై వివక్ష చూపిస్తారు. వీళ్ల మావయ్య జైని మరింతగా అవమానాల పాలు చేస్తుంటాడు. దీంతో ముందు తమ్ముళ్లిద్దరిపై ఎంతో ప్రేమ చూపించిన జై.. ఆ తర్వాత వాళ్లపై కోపం పెంచుకుంటాడు. వాళ్లను నాశనం చేయాలని చూస్తాడు. ఈ క్రమంలో ఈ ముగ్గురు అన్నదమ్ములూ విడిపోయి వేర్వేరు చోట్ల పెరుగుతారు. లవ బాగా చదువుకుని బ్యాంక్ మేనేజర్ అయితే.. కుశ దొంగతా మారతాడు. ఓ సందర్భంలో వీళ్లిద్దరూ అనుకోకుండా కలుస్తారు. సమస్యల్లో ఉన్న వీళ్లిద్దరూ వాటిని చక్కదిద్దుకునే ప్రయత్నాల్లో ఉండగా.. లవ ప్రేయసి.. కుశకు సంబంధించిన డబ్బు కనిపించకుండా పోతాయి. దాని వెనుక సూత్రధారి జై అని తెలుస్తుంది. ఇంతకీ జై ఏమయ్యాడు.. ఎక్కడ ఎలా పెరిగాడు.. లవ ప్రేయసిని.. కుశ డబ్బును అతనెందుకు తీసుకెళ్లాడు.. చివరికి ఈ అన్నదమ్ముల కథ ఎక్కడి దాకా వెళ్లింది అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘జై లవకుశ’లో గొప్ప కథేమీ లేదు. ఇది చాలా పాత కథ. ఈ కథ 80ల్లో సినిమాల్ని తలపిస్తుందంటే నమ్మండి. కథనమైనా కొత్తగా.. బిగితో ఉందా అంటే అదీ లేదు. ఇలాంటి కథను ఓ మామూలు నటుడితో తీస్తే ‘జై లవకుశ’ను భరించడం కష్టమే అయ్యేదేమో. కానీ ‘జై లవకుశ’ విషయంలో దర్శకుడు బాబీ చేసిన అత్యంత తెలివైన పనేంటంటే.. తన కథకు ఎన్టీఆర్ ను కథానాయకుడిగా ఎంచుకోవడం. ఒక మంచి నటుడి చేతిలో పడితే.. ఓ మామూలు కథ కూడా మరో స్థాయికి వెళ్తుందనడానికి ‘జై లవకుశ’ రుజువుగా నిలుస్తుంది. కథాకథనాల సంగతెలా ఉన్నా.. ఎన్టీఆర్ ను హీరోగా ఎంచుకోవడంతో.. కొన్ని ప్రత్యేకమైన లక్షణాలతో జై పాత్రను డిజైన్ అతడి చేతికి అప్పగించడంతోనే బాబీ తన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేసేశాడు.

ఇక ఎన్టీఆర్ నటనా కౌశలం గురించి చెప్పేదేముంది? ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా జై పాత్రను పండించాడు. మొత్తంగా మూడు పాత్రల్లోనూ వైవిధ్యం చూపిస్తూ.. మూడింటినీ పండిస్తూ.. తెరను ఆక్రమించేశాడు. ‘జై లవకుశ’ సినిమా చూస్తున్నంతసేసూ.. చూసి బయటికి వచ్చాక కూడా ఎన్టీఆర్ మాత్రమే కనిపిస్తాడు. అతడి పెర్ఫామెన్స్ మాత్రమే కళ్ల ముందు కదలాడుతుంది. సినిమాలో లెక్కలేనన్ని లోపాలున్నా.. వాటన్నింటినీ మరిపించే నట కౌశలంతో ఒక మాయ చేశాడు తారక్. సినిమాగా ‘జై లవకుశ’ మామూలుగా అనిపించినా.. ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ పరంగా చూస్తే ఇది ప్రత్యేకమైన సినిమానే. అతడి కోసమే ఈ సినిమా చూడొచ్చంటే అది ఎంతమాత్రం పెద్ద మాట కాదు.

అందరూ అనుకున్నట్లే జై పాత్రే ‘జై లవకుశ’కు ప్రాణం. ఈ కథలో కదలిక వచ్చేది.. ప్రేక్షకులు సీరియస్ గా కథలో ఇన్వాల్వ్ అయ్యేది జై పాత్ర ప్రవేశంతోనే. అప్పటిదాకా ఇది టైంపాస్ వ్యవహారం లాగా అనిపిస్తుంది. లవ.. కుశ పాత్రల్ని ప్రథమార్ధంలో ఫిల్లింగ్ కోసం పెట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ పాత్రలు రెండూ మామూలుగా అనిపిస్తాయి. ఐతే ప్రథమార్ధంలో ఈ పాత్రలో వినోదం పండించడంలో.. టైంపాస్ చేయించడంలో బాబీ ఓకే అనిపించాడు. లవ పాత్ర చుట్టూ నడిచే రొమాంటిక్ ట్రాక్ కూడా పర్వాలేదనిపిస్తుంది. ఐతే ఎంత టైంపాస్ వ్యవహారమైనప్పటికీ.. వీటితో ముడిపడ్డ వేరే పాత్రల్ని ఎక్కడికక్కడ బ్రేక్ చేసేయడం.. ఒక ప్రయోజనమంటూ లేకుండా.. లాజిక్ లేకుండా సన్నివేశాలు సాగిపోవడం నిరాశ పరుస్తుంది. ఐతే జై పాత్రను చూపించకుండానే.. ఆ పాత్ర విషయంలో మొదట్లోనే ఒక క్యూరియాసిటీ తీసుకురావడంతో ప్రేక్షకులు మిగతా విషయాలపై మరీ ఎక్కువ లోతుగా ఆలోచించే పరిస్థితి ఉండదు. ఏదో అలా టైంపాస్ అయిపోవడంతో ఇక జై పాత్ర కోసమే అందరూ ఎదురు చూస్తారు. ఈ ఆసక్తికి తగ్గట్లు జై పాత్రను అదిరిపోయే సన్నివేశంతో పరిచయం చేస్తాడు బాబీ. జై ప్రవేశంతో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుందంతే.

జై పాత్రను మొదలుపెట్టిన స్థాయిలో ఆ తర్వాత ఆ క్యారెక్టర్ని నడిపించకపోయినప్పటికీ ఆ పాత్ర కనిపించినపుడల్లా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఆసక్తిని నిలబెడుతుంది. ఒకేసారి మూడు పాత్రల్లో కనిపిస్తూ.. వాటిలో వైవిధ్యం చూపిస్తూ.. ఎన్టీఆర్ ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తాడు. ఐతే ఎన్టీఆర్ ఎంతగా మెప్పిస్తున్నా.. కథాకథనాల్లో ఏ విశేషం లేకపోవడం.. బలమైన సీన్లు పడకపోవడంతో ఓ దశలో ‘జై లవకుశ’ ట్రాక్ తప్పుతున్న భావన కలిగిస్తుంది. ఐతే చివరి అరగంటలో అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో వచ్చే ఎమోషనల్ సీన్లు మెప్పిస్తాయి. డ్రామా నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కొంచెం డ్రమటిగ్గా అనిపించినప్పటికీ మెప్పిస్తాయి. ప్రి క్లైమాక్స్ లో వచ్చే మలుపు సినిమాలో చెప్పుకోదగ్గ అతి పెద్ద మెరుపు. దర్శకుడు బాబీ తన ముద్రను చూపించింది ఇక్కడే. క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది.

నిజానికి ‘జై లవకుశ’లో జై పాత్ర కూడా అంత గొప్పగా ఏమీ అనిపించదు. ఆ పాత్రలోనూ లోపాలున్నాయి. చిన్నతనంలో తెలియక తప్పు చేసిన తన తమ్ముళ్లపై అన్న పగ పెంచుకోవడం.. చివరికి వాళ్లను చంపడానికి కూడా సిద్ధమైపోవడం.. అన్నేళ్ల పగతో ఉన్నవాడు ఒక చిన్న నాటకంలో కొన్ని డైలాగులతో మారిపోవడం అన్నది లాజికల్ గా అనిపించదు. ఇలాంటి లోపాలు చాలానే ఉన్నాయి ఈ కథలో. ఓవరాల్ గా చూస్తే ‘జై లవకుశ’ కథాకథనాల పరంగా ప్రత్యేకమైన ముద్ర ఏమీ వేయదు. కానీ ఎన్టీఆర్ అభినయానికి తోడు.. ఇందులో ప్రేక్షకుల్న దృష్టిని ఆకర్షించే.. వాళ్ల ఆసక్తిని నిలిపి ఉంచే.. బోర్ కొట్టించకుండా టైంపాస్ చేయించే కమర్షియల్ అంశాలకు లోటు లేదు. మాస్ ప్రేక్షకుల్ని మురిపించే ప్యాకేజీలాగా ఉంటుంది ‘జై లవకుశ’.

నటీనటులు:

వన్ మ్యాన్ షో అనే మాటకు ‘జై లవకుశ’ అసలైన నిదర్శనంగా నిలుస్తుంది. సినిమా అంతటా ఎన్టీఆరే కనిపిస్తాడు. స్క్రీన్ టైంలో దాదాపు 90 శాతం ఎన్టీఆరే కనిపిస్తాడు. ప్రతి సన్నివేశంలోనూ తన నటనతో అలరిస్తాడు. జై పాత్రను చేయడం ఒకెత్తయితే.. మూడు పాత్రల్లో వైవిధ్యం చూపిస్తూ.. ప్రతి సన్నివేశంలోనూ ఆ తేడాను చూపిస్తూ ఎక్కడా లోపాల్లేకుండా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడమన్నది అంత సులువైన విషయం కాదు. అక్కడ ఉన్న మూడు పాత్రలూ ఎన్టీఆరే చేశాడు.. అతనే వేర్వేరుగా నటించాడనే విషయం గుర్తుంచుకుని దాని గురించి ఆలోచిస్తే అతనెంత కష్టపడ్డాడో అర్థమవుతుంది. ఆయా పాత్రల్లో పర్ఫెక్షన్ మిస్సయి ఉండొచ్చేమో కానీ.. ఈ సినిమాను ఎంత వేగంగా పూర్తి చేశారన్న సంగతి గుర్తుంచుకుంటే అది పెద్ద విషయం లాగా అనిపించదు. నటన విషయంలోనే కాక డ్యాన్సుల విషయంలోనూ ఎన్టీఆర్ అభిమానుల్ని అలరిస్తాడు.

సినిమాలో మిగతా నటీనటులంతా మామూలుగా కనిపిస్తారు. ఎన్టీఆర్ తర్వాత ఎక్కువ ఆకట్టుకునేది సాయికుమార్. తన అనుభవాన్ని రంగరించి.. పాత్రకు తగ్గట్లగా చాలా బాగా నటించాడు సాయికుమార్. హీరోయిన్లు రాశి ఖన్నా.. నివేదా థామస్ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లెలా ఉంటారో అలాగే కనిపించారు. రాశి గ్లామర్ పరంగా స్కోర్ చేసింది. మంచి నటి అయిన నివేదా పాత్ర చాలా మామూలుగా ఉండటం నిరాశ కలిగిస్తుంది. పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో కొంతవరకు నవ్వించాడు. ప్రవీణ్ పర్వాలేదు. విలన్ రోనిత్ రాయ్ ప్రత్యేకత ఏమీ లేదు. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం:

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఓకే. రావణా.. తేలిపోయా పాటలు బావున్నాయి. సాంగ్స్ విషయంలో నిరాశ పరిచినప్పటికీ నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు దేవి. జై పాత్ర ప్రవేశించిన దగ్గర్నుంచి నేపథ్య సంగీతం మరో స్థాయిలో ఉంటుంది. ఐతే సినిమా అంతా చూశాక పాటలు ఇంకా మెరుగ్గా ఉండాల్సిందని.. ఏదో మిస్సయిందని అనిపిస్తుంది. ఛోటా కె.నాయుడు కెమెరా పనితనం బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర్నుంచి ఆయన ప్రత్యేకత కనిపిస్తుంది. కోన వెంకట్-చక్రవర్తి కలిసి అందించిన స్క్రీన్ ప్లే.. కోన గత సినిమాల స్టయిల్లోనే సాగింది. దర్శకుడు బాబీ మామూలు కథతో ఎన్టీఆర్ మీదే భారం మోపేశాడు. కథాకథనాల విషయంలో అతను ఇంకొంచెం కసరత్తు చేసి ఉంటే.. ‘జై లవకుశ’ స్థాయే వేరుగా ఉండేది. ఐతే కథాకథనాల్లో బిగితో నడిపించడంలో బాబీ విఫలమైనప్పటికీ.. ‘జై లవకుశ’ను ఒక ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీ లాగా నడిపించడంతో విజయవంతమయ్యాడు. కమర్షియల్ అంశాలతో కథల్ని నడిపించగలనని బాబీ రుజువు చేసుకున్నాడు.

చివరగా: జై లవకుశ.. ఎన్టీఆర్ అభినయానికి ‘జై’

రేటింగ్- 2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre