Begin typing your search above and press return to search.

RRR: అత్యంత ఖరీదైన పాట కోసం జక్కన్న స్పెషల్ ప్లాన్స్..!

By:  Tupaki Desk   |   15 July 2021 3:30 AM GMT
RRR: అత్యంత ఖరీదైన పాట కోసం జక్కన్న స్పెషల్ ప్లాన్స్..!
X
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతూ దర్శకధీరుడు అనిపించుకున్నారు ఎస్.ఎస్.రాజమౌళి. 'మగధీర' 'యమదొంగ' 'ఈగ' 'బాహుబలి 1' 'బాహుబలి 2' వంటి విజువల్ వండర్స్ క్రియేట్ చేసిన రాజమౌళి.. సౌత్ ఇండస్ట్రీ సత్తా ఏంటో దేశ వ్యాప్తంగా చాటిచెప్పారు. సినిమా సినిమాకి తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్న జక్కన్న.. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఔట్ పుట్ వచ్చేలా జాగ్రత్త పడుతుంటారు. ప్రతీ సన్నివేశం పర్ఫెక్ట్ గా రావాలని ట్రై చేసే రాజమౌళి.. పాటలను కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రూపొందిస్తుంటారు. ఈ నేపథ్యంలో వాటి కోసం భారీ బడ్జెట్ ని కేటాయిస్తుంటారు.

ప్రస్తుతం రాజమౌళి ప్రతిష్టాత్మక 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి ఇద్దరు పెద్ద హీరోలను ఒకే స్క్రీన్ పై చూపించనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు పాటలు మినహా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. తాజా సమాచారం ప్రకారం ఇందులో ఒకటి తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ తో షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలోని ఈ స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అద్భుతమైన ట్యూన్ సమకూర్చినట్లు తెలుస్తోంది. ఇది సినిమాలో లాస్ట్ సాంగ్ గా ఉండబోతోంది. ఈ పాట చిత్రీకరణను జక్కన్న యూరప్ లో ప్లాన్ చేసారట. దీని కోసం చిత్ర బృందం ఈ నెలాఖరున లేదా వచ్చే నెల ఫస్ట్ వీక్ లో యూరప్ వెళ్లనున్నారట. ప్రస్తుతం మేకర్స్ దీని కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో పాటుగా హీరోయిన్లు అలియా భట్ - ఒలివియా మోరిస్ లు కూడా పాల్గొంటారని సమాచారం. ఇందులో విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. ట్రిపుల్ ఆర్ చిత్రానికి హైలైట్ గా నిలిచే ఈ పాట నిడివి కూడా రెగ్యులర్ సాంగ్స్ కంటే ఎక్కువేనట. మరి ఈ పాట వెండితెరపై ఎలా ఉండబోతుందో చూడాలి.

కాగా, చరిత్రలో ఎన్నడూ కలవని విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్‌ ల జీవితాల స్ఫూర్తితో ఫిక్షనల్ పీరియాడికల్ మూవీగా ''ఆర్ ఆర్ ఆర్'' రూపొందుతోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దీనికి కథ అందించారు. రామరాజు పాత్రలో రామ్ చరణ్.. భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ - శ్రియ - సముద్రఖని - హాలీవుడ్ నటులు అలిసన్ డూడీ - రే స్టీవెన్‌ సన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెంథిల్‌ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇకపోతే 'ఆర్ ఆర్ ఆర్' అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినీ అభిమానుల కోసం చిత్ర బృందం రేపు (జులై 15) ఓ గ్లిమ్స్ విడుదల చేస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ఎలా జరిగిందో తెలియజేస్తూ ''రోర్ ఆఫ్ RRR'' పేరుతో మేకింగ్ వీడియో రిలీజ్ చేయబోతున్నారు. మరికొన్ని గంటల్లో బయటకు రానున్న ఈ వీడియో ఎలా ఉంటుందా అని అందరిలో ఉత్సుకత మొదలైంది. ఎందుకంటే జక్కన్న దీన్ని ఒక మేకింగ్ వీడియో మాదిరిగా కాకుండా ట్రైలర్ రేంజ్ లో కట్ చేసారని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ - టీజర్స్ విశేష స్పందన తెచ్చుకువడంతో 'రోర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్' పై కూడా అంచనాలున్నాయి. RRR చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.