Begin typing your search above and press return to search.

బాండ్‌ సినిమాకు తప్పని కరోనా దెబ్బ

By:  Tupaki Desk   |   5 March 2020 10:30 AM GMT
బాండ్‌ సినిమాకు తప్పని కరోనా దెబ్బ
X
ప్రపంచం వ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా.. విన్నా కూడా కరోనా వార్తలు కనిపిస్తున్నాయి కరోనా వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలో ప్రారంభం అయిన ఈ వైరస్‌ ప్రస్తుతం 80 దేశాలకు పైగా పాకింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరిగి పోతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తం కూడా కరోనా బారి నుండి బయట పడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రచారం చేస్తున్నారు.

కరోనా వల్ల సినిమా పరిశ్రమపై కూడా దెబ్బ పడుతోంది. ఇప్పటికే పలు సినిమా షూటింగ్స్‌ కూడా వాయిదా పడ్డాయి. ఇక సినిమాల విడుదల విషయంలో కూడా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఎక్కడ చూసినా కరోనా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సినిమా థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా అనే అనుమానంతో సినిమాను వాయిదా వేస్తున్నారు. తాజాగా హాలీవుడ్‌ జేమ్స్‌ బాండ్‌ మూవీ నో టైమ్‌ టు డై అనే చిత్రం కూడా విడుదల వాయిదా వేశారు.

ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్‌ 3న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. ఈ నెల నుండే ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్లను ఏర్పాటు చేయాలని భావించారు. కాని ప్రీమియర్లను మరియు సినిమా విడుదలను క్యాన్సిల్‌ చేశారు. ఏకంగా ఏడు నెలలు వాయిదా వేసి వచ్చే నవంబర్‌ లో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇలా ఇంకా ఎన్ని సినిమాలు వాయిదా పడనున్నాయో చూడాలి.