Begin typing your search above and press return to search.

నం.1 రికార్డ్ పై `అవ‌తార్` డైరెక్ట‌ర్ స్పంద‌న‌

By:  Tupaki Desk   |   23 July 2019 10:27 AM GMT
నం.1 రికార్డ్ పై `అవ‌తార్` డైరెక్ట‌ర్ స్పంద‌న‌
X
100 కోట్లు.. 500 కోట్లు.. 1000 కోట్లు అంటూ భార‌త‌దేశంలో రికార్డుల గురించి మాట్లాడుకుంటున్నాం. బాహుబ‌లి 2.. దంగ‌ల్ చిత్రాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అద్భుత వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నాలు సృష్టించాయి. సుమారు 2000 కోట్ల వ‌సూళ్లు సాధించ‌గ‌ల‌మ‌ని భార‌తీయ ఫిలింమేక‌ర్స్ ప్రూవ్ చేశారు.

అదే హాలీవుడ్ కి వెళితే అక్క‌డ నంబ‌ర్ వ‌న్ రికార్డు ఏది? అంటే అందుకు `అవ‌తార్` చిత్రాన్ని బెంచ్ మార్క్ గా చూపించారు ఇంత‌కాలం. ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద సుమారు. రూ.20 వేల కోట్లు వ‌సూలు చేసింది. 2.7897 బిలియ‌న్ డాల‌ర్ల‌తో సంచ‌ల‌నం సృష్టించింది. ఆ రికార్డును కొట్టేందుకు దాదాపు ప‌దేళ్లు ఎదురు చూడాల్సొచ్చింది. `అవ‌తార్` చిత్రం 2009లో రిలీజై అప్ప‌టివ‌ర‌కూ ఉన్న రికార్డుల్ని బ్రేక్ చేస్తే ఆ రికార్డును అధిగ‌మించేందుకు 2019 వ‌ర‌కూ వేచి చూడాల్సొచ్చింది. ఇటీవ‌లే రిలీజైన `అవెంజ‌ర్స్- ఎండ్ గేమ్` ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఈ సంద‌ర్భంగా అవెంజ‌ర్స్ చిత్రాన్ని నిర్మించిన మార్వ‌ల్ సంస్థ ఈ రికార్డును బ్రేక్ చేసిన సంద‌ర్భంగా ఓ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది. దీనిలో అవెంజ‌ర్స్ పాత్ర‌ధారి `ఐర‌న్ మ్యాన్` పై పండోరా గ్ర‌హం ఐవా (దేవ‌త‌లు) లు వ‌చ్చి వాలిన ఆ ఫోటో ఎంతో ఎమోష‌న‌ల్ గా అభిమానుల‌కు క‌నెక్ట‌య్యింది.

తాజాగా త‌న సినిమా రికార్డును బ్రేక్ చేసినందుకు `అవెంజ‌ర్స్ -ఎండ్ గేమ్` ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు జేమ్స్ కామెరూన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఎండ్ గేమ్ చిత్రానికి రస్సో బ్ర‌ద‌ర్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అవ‌తార్ లైఫ్ టైమ్ రికార్డుల్ని బ్రేక్ చేయ‌డానికి ఎండ్ గేమ్ చిత్రానికి చాలా ఎక్కువ స‌మ‌య‌మే ప‌ట్టింది. ఇక ఈ రికార్డును బ్రేక్ చేసేందుకు 2021లో `అవ‌తార్- 2` చిత్రాన్ని కామెరూన్ సిద్ధం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.