Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఎఎన్నార్లు ఇలా కూడా చేస్తారా..?

By:  Tupaki Desk   |   26 Jan 2019 6:02 AM GMT
ఎన్టీఆర్ ఎఎన్నార్లు ఇలా కూడా చేస్తారా..?
X
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న సీనియర్ మోస్ట్ హీరోయిన్లలో జమునగారు ఒకరు. బ్లాక్ అండ్ వైట్ జమానాలో దాదాపు పెద్ద స్టార్ హీరోలందరితోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించారు ఆవిడ. ముఖ్యంగా సత్యభామ పాత్రను ఆవిడ పోషించినవిధంగా మరొకరు పోషించలేకపోయరనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ పాత్రకు తగ్గట్టే ఆవిడ స్వభావం కూడా అంతే. ముక్కుసూటి మనిషని ఆవిడ గురించి తెలిసిన వారు చెప్తూ ఉంటారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్.. ఎన్నార్ లపై జమున సంచలన వ్యాఖ్యలు చేశారు.

చాలామంది మగవారు వర్క్ ప్లేస్ లో ఒక మహిళ కనుక ఆత్మవిశ్వాసంతో ఉంటే దానిని ఒప్పుకోలేరని వారికి ఎప్పుడూ మహిళలు తగ్గి ఉండాలని భావిస్తారని అన్నారు. మీకు ఎప్పుడైనా అలాంటి సందర్భాలు ఎదురయ్యయా అని అడిగితే.. తన ఆత్మవిశ్వాసం కారణంగానే తన ఎన్టీఆర్.. ఎఎన్నార్ లు దాదాపు మూడేళ్ళ పాటు తనతో పనిచేయకుండా బాయ్ కాట్ చేశారని అన్నారు. కానీ ఆ సమయంలో దాదాపు వేరే వాళ్ళతో 20 సినిమాలు చేశానని వాటిలో దాదాపు 18 సినిమాలు హిట్ అయ్యాయని తెలిపింది.

అసలు ఆ పెద్ద హీరోలు ఎందుకు అలా చేశారు అంటే "కాలు మీద కాలు వేసుకుంటుంది. పొగరుబోతు మనిషి.. ఎవరినీ లెక్కచేయదు.. మాకు ఒంగి ఒంగి దండాలు పెట్టదు..ట్రబుల్స్ క్రియేట్ చేస్తుంది.. ఇలాంటి ఏవో సిల్లీ ఆరోపణలు. కానీ వాళ్ళు బాయ్ కాట్ చేసిన తర్వాత నాకు అది మరోరకంగా కలిసి వచ్చింది. హీరోయిన్ కు ప్రాధాన్యత ఉన్న స్టోరీలన్నీ నా దగ్గరకే వచ్చాయి. ఒక స్టేజ్ లో డిస్ట్రిబ్యూటర్లు కూడా 'హీరో ఎవరైతే ఏంటి... జమున ఉంటే చాలు ఆవిడే హీరో' అన్నంతగా పరిస్థితి వచ్చింది. ఆ గొడవ మూడేళ్ళు జరిగాక చక్రపాణి గారు.. నాగిరెడ్డి గారు.. కేవీ రెడ్డి గారు కలుగ జేసుకొని.. ది ఫేమస్ 'గుండమ్మ కథ' సినిమా సెట్ చేస్తారు. మా ముగ్గురిని కలిపింది గుండమ్మే!" అంటూ చెప్పుకొచ్చారు జమున.