Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : జనతా గ్యారేజ్

By:  Tupaki Desk   |   1 Sep 2016 6:45 AM GMT
మూవీ రివ్యూ : జనతా గ్యారేజ్
X
చిత్రం: ‘జనతా గ్యారేజ్’

నటీనటులు: ఎన్టీఆర్ - మోహన్ లాల్ - సమంత - నిత్యా మీనన్ - ఉన్ని ముకుందన్ - సాయికుమార్ - సచిన్ ఖేద్కర్ - సురేష్ - సితార - దేవయాని - రెహమాన్ - అజయ్ - బెనర్జీ - బ్రహ్మాజీ - విజయ్ కుమార్ - ఆశిష్ విద్యార్థి తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: తిరునావుక్కరసు
నిర్మాతలు: నవీన్ ఎర్నేని - రవిశంకర్ - మోహన్
రచన - దర్శకత్వం: కొరటాల శివ

జనతా గ్యారేజ్.. శ్రీకారం చుట్టుకున్న తొలి రోజు నుంచి విపరీతమైన ఆసక్తి రేకెత్తించిన సినిమా. కొరటాల శివ-జూనియర్ ఎన్టీఆర్-మోహన్ లాల్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఆ అంచనాల్ని అందుకుందో లేదో చూద్దాం పదండి.

కథ:

ఎదుటోడి కష్టం చూసి కరిగిపోయే సత్యం (మోహన్ లాల్) తాను నడిపే జనతా గ్యారేజ్ ను ఒక గ్రీవెన్స్ సెల్ లాగా మారుస్తాడు. ఎవరైనా వచ్చి అక్కడ తమ కష్టం చెప్పుకుంటే చాలు.. ఆ కష్టం తీర్చడానికి తన అనుచరులతో కలిసి ఎంతదూరమైనా వెళ్తాడు సత్యం. ఐతే ఈ క్రమంలో అతను తన తమ్ముణ్ని.. మరదలిని కోల్పోతాడు. దీంతో అతడి తమ్ముడి కొడుకైన ఆనంద్ (ఎన్టీఆర్)ను చిన్నపుడే అతడి మావయ్య తన వెంట ముంబయికి తీసుకెళ్లిపోతాడు. అక్కడ ఆనంద్ పెరిగి పెద్దవాడై తన చదువు కొనసాగిస్తూ.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సాగిపోతుంటాడు. మరోవైపు సత్యం.. తన గ్యారేజ్ లో తన పని కొనసాగిస్తుంటాడు. తన పెదనాన్న కుటుంబం గురించి అసలేమీ తెలియని ఆనంద్.. ఓ ప్రాజెక్టు కోసమని హైదరాబాద్ వస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా గ్యారేజ్ లో అడుగుపెడతాడు. అక్కడి నుంచి కొన్ని అనూహ్య పరిణామాలు జరుగుతాయి. అవేంటి.. సత్యం-ఆనంద్ లకు ఒకరి గురించి ఒకరికి తెలిసిందా.. ‘జనతా గ్యారేజ్’లో ఆనంద్ ఎలాంటి పాత్ర పోషించాడు.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

మిర్చి.. శ్రీమంతుడు సినిమాల్లో పాత కథల్నే ఆహ్లాదకరమైన కథనాలతో.. ఎమోషనల్ హైస్ తో ఆసక్తికరంగా చెప్పాడు కొరటాల శివ. ఆ రెండు సినిమాల్లోనూ ‘కొలతలు’ సరిగ్గా సరిపోయాయి. ఏది ఎంత ఉండాలో అంత సరిగ్గా కుదిరాయి. ‘జనతా గ్యారేజ్’ విషయంలో మాత్రం లెక్క కొంచెం అటు ఇటు అయింది. ఇందులోనూ కొన్ని ఆసక్తికర సన్నివేశాలున్నాయి. కొరటాల మార్కు మంచి డైలాగులు పడ్డాయి. ప్రధాన పాత్రధారులు గొప్పగా నటించారు. వారి పాత్రల చిత్రణా బాగుంది. ఎమోషనల్ హైస్ ఉన్నాయి. కనువిందు చేసే ఛాయాగ్రహణం.. ఉత్తేజం కలిగించే సంగీతం కూడా కుదిరాయి. కాకపోతే.. పాత కథ.. నిలకడ లేని కథనం కారణంగా ‘జనతా గ్యారేజ్’ అంచనాల్ని అందుకోలేకపోయింది.

ఆరంభ ఒడుదొడుకుల్ని దాటుకుని గాడిన పడ్డాక.. ఓ దశలో పతాక స్థాయిని అందుకున్నట్లు కనిపించే ఈ సినిమా.. ఆ తర్వాత ఉన్నట్లుండి కిందకు పడి.. ఓ మామూలు సినిమాలా ముగుస్తుంది. కొన్ని దినుసులు తక్కువైనా సరే.. సర్దుకుని వంట చక్కగా తయారవుతున్న సమయంలో అందులోకి నీళ్లు పోసి రుచిని తగ్గించినట్లుగా తయారైంది ‘జనతా గ్యారేజ్’ పరిస్థితి. రుచి పోలేదు. అలాగని ఆశించిన రుచీ రాలేదు. మొత్తంగా ఇది ‘ఓకే.. నాట్ బ్యాడ్’ అనుకునే వంటకం అన్నమాట.

కథను చెప్పడంలో కొరటాల శైలి కొంచెం నెమ్మదే. కథను మొదలుపెట్టడానికి.. టేకాఫ్ కు కొంచెం సమయం తీసుకుంటాడు. ఆసక్తికరంగా.. ఆహ్లాదకరంగా సాగే సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంటాయి. ఐతే ‘జనతా గ్యారేజ్’లో కొరటాల మరీ నెమ్మదించాడు. టేకాఫ్ విషయంలో మరీ ఎక్కువ టైం తీసుకున్నాడు. ఈలోపు అంత ఆసక్తికరమైన సన్నివేశాలు పడలేదు. దీంతో ప్రథమార్ధం కొంచెం కష్టంగానే సాగుతుంది. ప్రకృతి ప్రేమికుడిగా ఎన్టీఆర్ పాత్ర భిన్నంగా.. ఆసక్తికరంగానే సాగుతుంది. ‘సర్కార్’ తరహాలో నడిచే మోహన్ లాల్ పాత్ర మామూలుగానే అనిపించినా ఆయన తన నటనతో ఆ పాత్రకు ప్రత్యేకత తీసుకొచ్చారు. ఎన్టీఆర్ కనిపించినపుడల్లా ప్రేక్షకుల్లో ఉత్తేజం వస్తుంది. కానీ మోహన్ లాల్ గొప్పగా నటించినా.. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతో బాగున్నా.. సీఎంతో మీటింగ్ లాంటి ఒకట్రెండు మినహాయిస్తే ఆ పాత్ర పాత్ర చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు రొటీనే.

ప్రథమార్ధంలో ఎన్టీఆర్ స్క్రీన్ టైం తక్కువ. హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ ఏమాత్రం ఆసక్తి రేకెత్తించకపోగా.. మిగతా సన్నివేశాల్లో మాత్రం తారక్ ఎంగేజ్ చేస్తాడు. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే రెండు ఫైట్లూ ఉత్తేజం తీసుకొస్తే.. ఇంటర్వెల్ ముందు తొలిసారి మోహన్ లాల్-ఎన్టీఆర్ కలిసే సన్నివేశం సినిమా ‘గ్యారేజ్’ ట్రాక్ మీదికి వచ్చిన భావన కలిగిస్తుంది. ఆ సన్నివేశంలో ఎన్టీఆర్-మోహన్ లాల్ ఇద్దరి నటన.. కొరటాల మాటలు.. సినిమాపై అప్పటిదాకా ఉన్న ఫీలింగ్ ను మారుస్తాయి. ద్వితీయార్ధం మీద ఆశలు రేకెత్తిస్తాయి. ఇక ద్వితీయార్ధంలో 40 నిమిషాల కథనం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది.

ముఖ్యంగా రాజీవ్ కనకాల పాత్ర చుట్టూ అల్లుకున్న ఎపిసోడ్ సినిమాకు మేజర్ హైలైట్. ‘జనతా గ్యారేజ్’లోనే కాదు.. మొత్తం కొరటాల కెరీర్లోనే దీన్ని బెస్ట్ ఎపిసోడ్ గా చెప్పొచ్చు. దీన్ని కొరటాల ఎంత బాగా రాశాడో.. అంత బాగా తీశాడు కూడా. ఎన్టీఆర్ అద్భుత అభినయంతో ఆ సన్నివేశాలకు ప్రాణం పోశాడు. కొరటాలలోని రచయిత విజృంభించాడు ఇక్కడ. రోమాంఛితమైన ఈ సన్నివేశం తర్వాత టైటిల్ సాంగ్ కూడా చక్కగా కుదిరింది. ఐతే ఈ ఎమోషనల్ హైని ఆ తర్వాత కొనసాగించి ఉంటే ‘జనతా గ్యారేజ్’ వ్యవహారమే వేరుగా ఉండేది. ఐతే సినిమాను ముగించడంలో కొరటాల తడబడ్డాడు. చివరి అరగంటలో ట్రాక్ తప్పాడు.

ఎన్టీఆర్-మోహన్ లాల్ మధ్య బంధమేంటో తెలిసే సన్నివేశంలో కూడా ఎమోషన్ బాగానే పండినా.. ఆ తర్వాత ఒక సగటు కమర్షియల్ సినిమా తరహాలో సినిమాను ముగించే ప్రయత్నం చేయడంతో ‘జనతా గ్యారేజ్’ ఎసెన్సే దెబ్బ తింది. సినిమాలో విలనిజం వీక్.. పైగా రొటీన్. హీరోలకు.. విలన్లకు మధ్య వైరం కన్విన్సింగ్ గా లేదు. గ్యారేజ్ వల్ల ఆ ఒక్క విలనే పదే పదే ఇబ్బంది పడటం.. అటు తిరిగి ఇటు తిరిగి ఆ విలనే వీరికి అడ్డంకిగా మారడం లాజికల్ గా అనిపించదు. సిల్లీగా ఒక బాంబ్ బ్లాసింగ్ ఎపిసోడ్ చుట్టూ ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్ ను సాగదీసి చాలా రొటీన్ గా సినిమాను ముగించాడు కొరటాల. ముగింపులో ఎమోషనల్ కొసమెరుపు బాగానే ఉంది కానీ.. అంతకుముందు వ్యవహారం గ్రాఫ్ పడిపోయేలా చేస్తుంది. ఈ ఎపిసోడ్ సినిమాలో సింక్ అవలేదు. ప్రేక్షకులు ఆశించినదానికి భిన్నంగా ముగుస్తుంది సినిమా. కథ అంతా కూడా ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్లు సాగడం నిరాశ కలిగించే విషయం.

నటీనటులు:

నటుడిగా ఎన్టీఆర్ కు ‘జనతా గ్యారేజ్’ మరో గుర్తుంచుకోదగ్గ చిత్రమే. ఎంతో పరిణతితో నటించాడు ఎన్టీఆర్. రాజీవ్ కనకాల ఎపిసోడ్లో ఎన్టీఆర్ మెచ్యూరిటీ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సన్నివేశాల్లో అతడి నటన.. డైలాగ్ డెలివరీ అమోఘం. మోహన్ లాల్ కాంబినేషన్లో ఇంటర్వెల్ ముందు సన్నివేశంలోనూ గొప్పగా నటించాడు. లాల్ ను కలిసి కిందికి దిగుతూ చెట్టును చూస్తూ అతనిచ్చే ఎక్స్ ప్రెషన్ సూపర్బ్. సాయికుమార్ కాంబినేషన్లో వచ్చే సీన్లోనూ అదే స్థాయిలో ఆకట్టుకున్నాడు. మోహన్ లాల్ గురించి కొత్తగా చెప్పేదేముంది. ఆయన తెరమీద నిండుగా కనిపించాడు. తన స్థాయికి తగ్గ నటనతో ఆకట్టుకున్నాడు. లాల్ తో తొలి సన్నివేశంలోనే కనెక్టయిపోతాం. అలా కనెక్టవడంలోనే ఆయన గొప్పదనం కనిపిస్తుంది. ఐతే లాల్ పాత్ర ఇంకా ప్రత్యేకంగా ఉండాల్సింది.

హీరోయిన్ల విషయంలో ప్రేక్షకులకు తీవ్ర నిరాశ తప్పదు. ఇద్దరు హీరోయిన్ల పాత్రలూ నామమాత్రం. నిత్యా మీనన్ సంగతి వదిలేస్తే.. ఎన్టీఆర్-సమంత మధ్య రొమాన్స్ పండించడానికి.. వినోదం రాబట్టడానికి అవకాశమున్నా కొరటాల ఆ ప్రయత్నమే చేయలేదు. చాలా మొక్కుబడిగా ఆ ట్రాక్ ను మూణ్నాలుగు సన్నివేశాలతో లాగించేశాడు. హీరోయిన్ల పాత్రలకు ఉన్నవే తక్కువ సన్నివేశాలంటే.. అవన్నీ కూడా తేలిపోయాయి. హీరోయిన్ల కంటే ఐటెం పాటతో కాజలే ఎక్కువ ఆకట్టుకుంటుంది. కాజల్ కనిపించే ఐదు నిమిషాలూ కనువిందే. ‘పక్కా లోకల్’ పాటలో చితగ్గొట్టేసింది కాజల్. సాయికుమార్.. సురేష్.. దేవయాని.. అజయ్.. వీళ్లంతా పాత్రలకు తగ్గట్లుగా చక్కగా నటించారు. విలన్ పాత్రల్లో ఉన్ని ముకుందన్.. సచిన్ ఖేద్కర్ పర్వాలేదు. మిగతా వాళ్లంతా ఓకే.

సాంకేతికవర్గం:

కొరటాల శివకు టెక్నీషియన్స్ మంచి సపోర్టిచ్చారు. అందరూ చక్కటి పనితనం చూపించారు. తిరు ఛాయాగ్రహణం టాప్ క్లాస్ అనిపిస్తుంది. సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది. విజువల్స్ కనువిందుగా అనిపిస్తాయి. పాటల చిత్రీకరణ బాగుంది. ముఖ్యంగా రాక్ ఆన్ బ్రో.. పాట చిత్రీకరణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా చక్కగా కుదిరింది. పాటలు బావున్నాయి. సినిమాకు కీలకమైన సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది. ‘జనతా గ్యారేజ్’ థీమ్ మ్యూజిక్.. యాక్షన్ సీక్వెన్స్ వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ దేవిశ్రీ ప్రత్యేకతను తెలియజేస్తాయి. ఆర్ట్ డైరక్టర్ ప్రతిభ కూడా చాలా చోట్ల కనిపిస్తుంది. ప్రథమార్ధంలో ఎడిటింగ్ ఇబ్బంది పెడుతుంది.

నిర్మాణ విలువల్లో రాజీ అన్నదే లేదు. సినిమాను ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించారు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ కొరటాల శివ.. మంచి ప్రయత్నమే చేశాడు కానీ.. దాన్ని పూర్తి చేయలేకపోయాడు. కొన్ని చోట్ల కొత్తదనం చూపిస్తూనే.. కొన్ని చోట్ల రాజీ పడిపోయాడు. ముగింపు విషయంలో అతను రొటీన్ ఆలోచనల్ని పక్కనబెట్టి ఉంటే.. వైవిధ్యంగా ఆలోచించి ఉంటే ‘జనతా గ్యారేజ్’ మరో గుర్తుంచుకోదగ్గ సినిమా అయ్యుండేది. మాటల రచయితగా ఈ సినిమాతో కొరటాల మరో మెట్టు ఎక్కాడు. కొన్ని సన్నివేశాల్ని డీల్ చేసిన తీరును కూడా ప్రశంసించాలి. కానీ సినిమాను ప్రేక్షకులు ఆశించినట్లు ముగించడంలో మాత్రం కొరటాల విఫలమయ్యాడు.

చివరగా: ఇది మిశ్రమానుభూతుల ‘గ్యారేజ్’

రేటింగ్: 2.75 /5

Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre