Begin typing your search above and press return to search.

గబ్బర్ సింగ్ ను ఢీకొడుతున్న శ్రీమంతుడు

By:  Tupaki Desk   |   14 Dec 2015 11:43 AM GMT


గబ్బర్ సింగ్ ఏంటి.. శ్రీమంతుడిని ఢీకొట్టడమేంటి అని ఆశ్చర్యం కలుగుతోందా? ఐతే ఒకసారి ‘జత కలిసే’ థియేట్రికల్ ట్రైలర్ చూడండి. అందులో శ్రీమంతుడూ కనిపిస్తాడు. గబ్బర్ సింగ్ కూడా దర్శనమిస్తాడు. గబ్బర్ సింగ్ పాత్రలో షకలక శంకర్ సందడి చేస్తే.. శ్రీమంతుడి క్యారెక్టర్ లో సప్తగిరి హంగామా చేశాడు. ఇద్దరి మేనరిజమ్స్ కూడా అదిరిపోయాయనే చెప్పాలి. ముఖ్యంగా సప్తగిరి సైకిల్ తొక్కుకుంటూ విలన్లతో కలిసి వచ్చే సన్నివేశం ట్రైలరుకే హైలైట్.

ఆ తర్వాత శ్రీమంతుడు, గబ్బర్ సింగ్ మధ్య శత్రుత్వం కూడ చూపిస్తున్నారు. మూడు రోజుల కిందటే విడుదలైన ‘బెంగాల్ టైగర్’లోని చిటికెల మేనరిజంను ఇందులో షకలక శంకర్ ఇమిటేట్ చేయడం విశేషం. తెలుగులో ఈ మధ్య పేరడీ కామెడీలు బాగా పేలుతున్న నేపథ్యంలో ‘జత కలిసే’ టీం కూడా ఆ టైపు కామెడీకి పెద్ద పీట వేసినట్లు కనిపిస్తోంది.

జత కలిసే ఓ రోడ్ జర్నీ నేపథ్యంలో సాగే సినిమా ‘జత కలిసే’. రాకేశ్ శశి అనే కొత్త దర్శకుడు రూపొందించిన ‘జత కలిసే’లో ‘రాజు గారి గది’ఫేమ్ అశ్విన్ బాబు హీరోగా నటించగా.. తేజస్వి కథానాయికగా చేసింది. నరేష్ నిర్మించిన ఈ సినిమాను సాయి కొర్రపాటి తన ‘వారాహి చలనచిత్రం’ బేనర్ పై సొంతంగా విడుదల చేస్తున్నాడు. డిసెంబరు 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.