Begin typing your search above and press return to search.

కొత్త సినిమాలొచ్చినా జోరు తగ్గని 'జాతిరత్నాలు'

By:  Tupaki Desk   |   20 March 2021 11:30 AM GMT
కొత్త సినిమాలొచ్చినా జోరు తగ్గని జాతిరత్నాలు
X
తెరపై కనిపించవలసింది ఖర్చు కాదు .. కంటెంట్. హీరో చుట్టూ కథ తిరగడం కాదు .. కథతో కలిసే నాయకుడు నడవాలి అనే సత్యాన్ని గతంలో వచ్చిన చాలా సినిమాలు నిరూపించాయి. అదే విషయాన్ని మరోసారి చాటిచెప్పిన చిత్రంగా 'జాతిరత్నాలు' కనిపిస్తోంది. అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ .. ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలుగా ఈ సినిమా రూపొందింది. మార్చి 11వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా విడుదలైంది. ప్రమోషన్స్ ద్వారా బజ్ పెంచుకుంటూ వచ్చిన ఈ సినిమా, తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకుంది.

'శ్రీకారం' వంటి సినిమా బరిలో ఉన్నప్పటికీ ఈ సినిమా వసూళ్ల పరంగా తన దూకుడు చూపించింది. నవీన్ .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ హాస్య రత్నాలుగా ఈ కథను నడిపిస్తే, వాళ్ల మధ్యలో ఫరియా అబ్దుల్లా అందమైన ముత్యంలా మెరిసింది. సహజత్వానికి దగ్గరగా ఉన్న కథ .. హాస్య ప్రధానంగా మలచిన పాత్రలు ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లోను భారీవసూళ్లతో దూసుకుపోతోంది. ఈ మధ్యకాలంలో ఇంత హాయిగా నవ్వుకునేలా చేసిన సినిమా ఇదేననే మాట యూత్ నోట వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో నిన్న మూడు సినిమాలు విడుదలయ్యాయి. గీతా ఆర్ట్స్ 2 వంటి పెద్ద బ్యానర్ నుంచి కార్తికేయ - లావణ్య త్రిపాఠి జంటగా 'చావుకబురు చల్లగా' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక 50 కోట్ల బడ్జెట్ తో నిర్మించానని మంచు విష్ణు చెబుతున్న 'మోసగాళ్లు' కూడా నిన్ననే థియేటర్లలో దిగిపోయింది. ఇక ఆది సాయికుమార్ హీరోగా చేసిన 'శశి' కూడా నిన్ననే ఆడియన్స్ ను పలకరించింది. 'జాతిరత్నాలు' వసూళ్లపై ఈ మూడు సినిమాల ప్రభావం ఎంతోకొంత ఉండొచ్చని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు .. కొత్తగా వచ్చిన సినిమాలు 'జాతిరత్నాలు' దూకుడుకు ఎంతమాత్రం కళ్లెం వేయలేకపోయాయి. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమా, వసూళ్ల పరంగా తన జోరు చూపుతూనే ఉండటం విశేషం.