Begin typing your search above and press return to search.

జయ జానకి నాయక.. అబ్బే అలాంటిదేం లేదు

By:  Tupaki Desk   |   7 Aug 2017 2:09 PM GMT
జయ జానకి నాయక.. అబ్బే అలాంటిదేం లేదు
X
అందరికీ ఇండిపెండెన్స్ డే వీకెండే కావాలి. ఆ అవకాశాన్ని వదులుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఇలాంటి పోటీ మంచిది కాదు అంటూనే సురేష్ బాబు సైతం తన ప్రొడక్షన్లో తెరకెక్కిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాను ఆగస్టు 11కే షెడ్యూల్ చేశారు. దీంతో పాటు ‘జయ జానకి నాయక’.. ‘లై’ సినిమాలు కూడా అదే రోజు రిలీజ్ అంటూ పట్టుబట్టుకుని కూర్చున్నాయి. ఐతే ఇందులో ‘జయ జానకి నాయక’ టీం ఆలోచన కొంచెం మారిందని.. ఒక రోజు ముందే.. అంటే ఆగస్టు 10నే తమ సినిమాను విడుదల చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటోందని వార్తలు వినిపిస్తున్నాయి రెండు రోజులుగా. నిన్నటిదాకా ఆ సమాచారం పక్కా అంటే పక్కా అన్నారు. మరోవైపు 25వ తేదీకి వాయిదా అనే గుసగుసలు కూడా వినిపించాయి.

కానీ ఈ రోజు కథ మారిపోయింది. ‘జయ జానకి నాయక’ 10వ తేదీకి ప్రిపోన్ కావట్లేదు. 25వ తేదీకి వాయిదా కూడా పడట్లేదు. యధావిధిగా 11వ తేదీనే విడుదల కానుంది. ఈ చిత్ర నిర్మాత ఈ విషయాన్ని ఈ రోజు ధ్రువీకరించాడు. 11న రిలీజ్ అంటూ పోస్టర్లు కూడా రిలీజ్ చేసేశాడు. దీంతో 11వ తేదీ త్రిముఖ పోరు ఖరారైనట్లే. ఐతే మూడూ క్రేజ్ ఉన్న సినిమాలే కావడంతో వీటికి సరిపడా థియేటర్లను సమకూరుతాయా అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తున్న విషయం. ఏ సినిమాకూ కూడా ఇప్పటిదాకా కావాల్సినంత స్థాయిలో థియేటర్లు కన్ఫమ్ కాలేదని అంటున్నారు. మరి రాబోయే రెండు మూడు రోజుల్లో థియేటర్ల విషయమై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.