Begin typing your search above and press return to search.

తాతను కడసారి చూసుకోలేకపోయినందుకు జయకృష్ణ భావోద్వేగం..!

By:  Tupaki Desk   |   18 Nov 2022 2:45 AM GMT
తాతను కడసారి చూసుకోలేకపోయినందుకు జయకృష్ణ భావోద్వేగం..!
X
లెజెండరీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ మరణం కుటుంబ సభ్యులను మరియు ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మంగళవారం తెల్లవరుజామున మృతి చెందిన నటశేఖరుడికి తెలుగు ప్రజానీకం కన్నీటి వీడ్కోలు పలికింది.

మూడో రోజు గురువారం ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో కృష్ణ చిన్న కార్యక్రమం నిర్వహించారు. దీనికి మహేశ్ బాబు - నమ్రత శిరోద్కర్ లతో పాటుగా కృష్ణ కుమార్తెలు అల్లుళ్ళు - మనవలు మనవరాళ్లు సహా కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కృష్ణ చిన్న కర్మ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. ఇందులో కృష్ణ మనవడు జయకృష్ణ అందరి దృష్టిని ఆకర్షించాడు. మహేశ్ బాబు సోదరుడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ తన తాత చిత్ర పటానికి నివాళులు అర్పిస్తూ కనిపించాడు.

తాతయ్య మృతి పట్ల జయకృష్ణ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడని తెలుస్తోంది. అమెరికాలో ఉంటున్న రమేష్ బాబు తనయుడు.. కృష్ణ మరణవార్త తెలుసుకొని హుటాహుటిన అక్కడి నుంచి బయలుదేరి నిన్న అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నాడు. అయితే అప్పటికే కృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి.

తన తాతయ్య ని కడసారి చూసుకోలేకపోయినందుకు జయకృష్ణ చాలా ఎమోషనల్ అయ్యాడని సన్నిహిత వర్గాలు తెలిపాయి. నివాసం వద్ద ఏర్పాటు చేసిన కృష్ణ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తూ, కన్నీటి పర్యంతమయ్యాడని తెలుస్తోంది.

అనంతరం కృష్ణ చిన్న కర్మ కార్యక్రమంలో జయకృష్ణ పాల్గొని, తన తాత ఫోటో వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించాడు. ఇప్పుడు జయకృష్ణ తన బాబాయ్ మహేశ్ బాబుతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

జయకృష్ణ ప్రస్తుతం అమెరికాలో ఉంటూ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం. యాక్టింగ్ కోర్సు పూర్తయిన తర్వాత బాబాయ్ మహేశ్ సపోర్ట్ తో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

జయకృష్ణ తండ్రి రమేష్ బాబు కూడా హీరోగా కొన్ని చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేసి, నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూ వచ్చారు. చివరగా ఆగడు చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.