Begin typing your search above and press return to search.

సమరసింహారెడ్డి క్లైమాక్స్.. బాలయ్య మర్యాద

By:  Tupaki Desk   |   3 July 2016 11:00 PM IST
సమరసింహారెడ్డి క్లైమాక్స్.. బాలయ్య మర్యాద
X
సమరసింహారెడ్డి.. టాలీవుడ్ కమర్షియల్ సినిమాల చరిత్రలో ఓ మైలురాయి లాంటి సినిమా. ఈ సినిమాలో బాలయ్య హీరోయిజం ఎంత బాగుంటుందో జయప్రకాష్ రెడ్డి విలనిజం కూడా అంతే గొప్పగా ఉంటుంది. విలన్ ఎంత బలంగా ఉంటే హీరో పాత్ర అంత బాగా ఎలివేట్ అవుతుందనడానికి ఈ సినిమా ఒక రుజువు. ‘సమరసింహారెడ్డి’లో విలన్ పాత్రతో జయప్రకాష్ రెడ్డికి వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఇప్పుడాయన వందల సినిమాల్లో నటించి గొప్ప ఆర్టిస్టుగా పేరు తెచ్చారంటే అందుకు ‘సమరసింహారెడ్డి’ పాత్ర ముఖ్య కారణం. ఆ సినిమా అనుభవాల గురించి.. అంత గొప్ప పాత్రకు ఏ అవార్డూ రాకపోవడం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు జయప్రకాష్ రెడ్డి.

‘‘నా కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమా సమరసింహారెడ్డి. అప్పటికే ‘ప్రేమించుకుందాం రా’లో ఫ్యాక్షనిస్టు పాత్ర పోషించిన అనుభవంతో ఈ పాత్రను మరింతగా రక్తికట్టించగలిగా. ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ ను నేనెప్పటికీ మరిచిపోలేను. చివర్లో నన్ను నేను పొడుచుకుని చనిపోయే సన్నివేశం వస్తుంది. అప్పటికి బాలయ్య పని అయిపోయినా.. ఆ సీన్ తీస్తుంటే అక్కడే కూర్చుని చూస్తూ ఉన్నారు. ఆ సీన్లో నేను పొడుచుకుని పడిపోగానే.. ఆయనే వచ్చి నన్ను లేవదీశారు. నా వయసుకు విలువ ఇచ్చి.. ‘గురువుగారు అదరగొట్టేశారు’ అని అభిమానపూర్వకంగా అన్నారు. ఆ ప్రశంసను ఎప్పటికీ గుర్తుంచుకుంటా. ఈ సినిమాకు అవార్డు వస్తుందని ఆశించిన మాట వాస్తవం. ఐతే అవార్డులు పైరవీల వల్ల వస్తాయని నాకు తెలీదు. అందులో ఏవో లెక్కలు ఉంటాయట. ఆ ఏడాది నంది అవార్డులు ప్రకటించినపుడు 60- 70 మంది ఫోన్లు చేసి మీకు అవార్డు రాకపోవడమేంటని అడిగారు. ఇంతమంది ఫోన్లు చేస్తున్నారు.. ఇంతకన్నా అవార్డు ఇంకేముంటుందిలెండి అని సమాధానమిచ్చా. నాకు అన్యాయం జరిగిందన్న చర్చ చూసే ఏమో తర్వాతి ఏడాది కంటితుడుపుగా ‘జయం మనదేరా’కు బెస్ట్‌ విలన్ అవార్డు ఇచ్చారు’’ అని జయప్రకాష్ రెడ్డి అన్నారు.