Begin typing your search above and press return to search.

చిరంజీవిని మెగాస్టార్ అనే కంటే..ఓ గొప్ప వ్య‌క్తిగా అభివ‌ర్ణించాలి!

By:  Tupaki Desk   |   3 May 2020 1:30 PM GMT
చిరంజీవిని మెగాస్టార్ అనే కంటే..ఓ గొప్ప వ్య‌క్తిగా అభివ‌ర్ణించాలి!
X
కరోనా వల్ల దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతోంది. నిత్య అవసరాలు.. మెడిసిన్ లకు సంబంధించిన పరిశ్రమలు తప్పించి మిగతా అన్ని పరిశ్రమలపై కరోనా ప్రభావం పడింది. క‌రోనా కార‌ణంగా దెబ్బ తిన ప‌రిశ్ర‌మ‌ల్లో సినీ ప‌రిశ్ర‌మ ఒక‌టి. ముఖ్యంగా సినీ కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. వేలాది మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి నానా అవస్థలు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు అదే స‌మ‌యంలో మెగాస్టార్ చిరంజీవి అధ్య‌క్ష‌త‌న కరోనా క్రైసిస్ ఛారిటీ 'మ‌న‌కోసం' ఏర్పాటు చేశారు. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌ - సురేష్ బాబు - సి.కళ్యాణ్ - ఎన్‌.శంక‌ర్‌ - మెహ‌ర్ ర‌మేశ్ వంటి ప‌లువురు కీల‌క స‌భ్యులుగా వ్య‌వ‌హ‌రించారు. దాదాపు రూ.8కోట్ల రూపాయ‌ల విరాళాన్ని సేక‌రించి సినీ కార్మికులకు నాణ్య‌మైన నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను - మందులు - ఇతర సామాగ్రిని సినీ కార్మికుల‌కు అందిస్తున్నారు. ఈ విష‌యంపై మెగాస్టార్ చిరంజీవికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ హీరో కమ్ డైరెక్టర్ జేడీ చ‌క్ర‌వ‌ర్తి ఓ లేఖ రాశారు. ఈ లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు జేడీ.

''ప్రియమైన చిరంజీవిగారు.. నేను మీ అభిమానినే కానీ అనుచరుడిని కాను. మీమ్మల్ని ఒక కంప్లీట్ యాక్ట‌ర్‌ గా ఇష్ట‌ప‌డేవాడిని.. అంత‌కు మించి కాదు. నా త‌రం నటులంద‌రూ మీతో చ‌క్క‌గా క‌లిసిపోయేవారు... నేనెప్పుడూ అలా చేయ‌లేదు, చేయాల‌నుకోలేదు. ఇది నేను మీకు రాస్తున్న ఓపెన్ లెటర్. కరోనా అడుగుపెట్టడం దురదృష్టం. దాని వల్ల ప్ర‌పంచ‌మంతా ఆగిపోయింది. సినిమా ప‌రిశ్ర‌మ కూడా ఎప్పుడూ లేనంతగా నష్టపోయింది. ప్ర‌స్తుతం సినిమా ఇంత‌కు ముందెన్న‌డూ లేనంత ఇబ్బందుల‌ను ఎదుర్కొంటుంది. ప్ర‌స్తుతం ఉన్న ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను మీతో పాటు నేను కూడా ఫేస్ చేస్తున్నాను. కానీ మీరు ఈ క్లిష్ట పరిస్థితుల్లో చేతలతో ముందుకు వచ్చారు. ఇది ఇన్ క్రెడిబుల్. మిమ్మల్ని అభిమానులే కాదు.. అందరూ ఎందుకు అంతగా ఇష్టపడతారో - నమ్ముతారో మీరు ఇప్పుడు చేస్తున్న పనే నిదర్శనం. ఇప్పుడు మీరు చేస్తున్న ప‌నికి మిమ్మ‌ల్ని ఒక మెగాస్టార్ అని చెప్ప‌లేం.. అంతకంటే ఒక గొప్ప వ్య‌క్తిగా అభివ‌ర్ణించాలి. సినీ రంగంలోని ప‌లు శాఖ‌ల‌కు చెందిన కార్మికులు నాకు ఫోన్ చేసిన‌ప్పుడు వారి కుటుంబ స‌భ్యుల‌కు ఆక‌లి స‌మ‌స్య‌లు ఉండ‌వ‌ని - చిరంజీవిగారు కావాల్సినంత నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను అంద‌జేశార‌ని తెలిపారు. మీరు ఇండ‌స్ట్రీ రుణం తీర్చుకుంటున్నారని అంటున్నారు కానీ కార్మికుల ప‌ట్ల అది మీకున్న గౌర‌వంగా భావిస్తున్నాను. ఎప్ప‌టికీ మీ అభిమానిని - అనుచ‌రుడిని'' అని త‌న లేఖ‌లో పేర్కొన్నారు జేడీ చ‌క్ర‌వ‌ర్తి.