Begin typing your search above and press return to search.

'సింపతీ కోసమే జీవిత మాట్లాడుతోంది.. ఆమె ఒక మహానటి'

By:  Tupaki Desk   |   20 May 2022 11:30 AM GMT
సింపతీ కోసమే జీవిత మాట్లాడుతోంది.. ఆమె ఒక మహానటి
X
'PSV గరుడ వేగ' సినిమాకు సంబంధించిన లావాదేవీల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. జీవిత - రాజశేఖర్ దంపతులు తమ నుంచి అప్పు తీసుకుని ఎగవేతకు పాల్పడినట్టు జ్యోస్టార్ ఎంటర్టైన్మెంట్స్ కు చెందిన కోటేశ్వర రాజు - హేమ ఆరోపిస్తున్నారు. తాజాగా నిర్మాతలు మీడియా సమావేశంలో జీవిత రాజశేఖర్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

గురువారం ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ లో జీవితా రాజశేఖర్ ఆరోపణలపై స్పందిస్తూ.. ఆమె ఒక సైలెంట్ కిల్లర్ అని.. ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తున్నారని కోటేశ్వర రాజు - హేమ సంచలన కామెంట్స్ చేశారు. ''జీవిత రాజశేఖర్‌ ఒక మహానటి. ఆమె మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. ప్రజలను అబద్ధాలతో పెద్ద మనుషుల పేర్లతో మోసం చేస్తున్నారు'' అని మండిపడ్డారు.

''మొదట్లో అసలు మేము ఎవరో కూడా తెలీదన్నారు. కానీ నిన్న మా గురించి లిమిట్స్‌ క్రాస్‌ చేసి మాట్లాడారు. మేము పరువు ప్రతిష్టలు గల కుటుంబం నుంచి వచ్చాము. మా ఆయన కోటేశ్వరరాజు యూఎస్ లో అవార్డు గ్రహీత. నేను యూకేలో హైలీ పెయిడ్ ప్రొఫెసర్ గా చేసాను. జీవితా రాజశేఖర్ కోర్టు కేసులో నుంచి బయపడినట్లు మాట్లాడుతున్నారు'' అని హేమ వ్యాఖ్యానించారు

''జీవిత రాజశేఖర్‌ నోరు అదుపులో పెట్టుకో. సెలబ్రిటీలకు ఒక లైఫ్‌.. సామాన్యులకు ఒక లైఫ్‌ ఉంటుందా? సెలబ్రిటీ పేరుతో మోసాలు చేస్తోంది. జీవిత రాజశేఖర్‌ నోటికి వచ్చినట్లు మాట్లాడుతోంది. గరుడవేగ సినిమాకు సంబంధించిన డబ్బును ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలేదు. ఆధారాలతో సహా అన్నీ మేము కోర్టులో సమర్పించాము. కోర్టులో మేము విజయం సాధిస్తాం'' అని కోటేశ్వరరాజు - హేమ పేర్కొన్నారు.

జీవితా రాజశేఖర్ తమ వద్ద అప్పు తీసుకుందా లేదా చెప్పాలని.. అప్పు కోసం ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టారా లేదా చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తాము ఆధారాలతో మాట్లాడుతున్నామని.. జీవితా రాజశేఖర్ నాలుకలో నరం లేకుండా మాట్లాడుతోందన్ఈ వ్యాఖ్యానించారు. 'గరుడవేగ' విడుదలైన వెంటనే ఆమె డబ్బులు చెల్లించలేకపోయారని.. దీంతో రాజశేఖర్ తండ్రి సమక్షంలో ఆస్తి పత్రాలు తాకట్టుపెట్టుకుని అగ్రిమెంట్ చేసుకున్నామని తెలిపారు.

జీవితా రాజశేఖర్ 420 వేషాల గురించే తాము మాట్లాడుతున్నామని.. కానీ వారు ప్రొడ్యూసర్లందరినీ అవమానించే రీతిలో మాట్లాడుతున్నారని కోటేశ్వరరాజు అన్నారు. సింపతీ కోసం జీవితా ఏదేదో చెబుతోందని.. తమ బాధని చెప్పుకోడానికి మీడియా ముందుకు వస్తే పబ్లిసిటీ కోసం వచ్చామని జీవితా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితా సినిమాల్లో నటిస్తే బాగుంటుంది.. నిజ జీవితంలో కాదంటూ గరుడవేగ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా, ఫిలిం ఛాంబర్ లో జరిగిన ప్రెస్ మీట్ లో జీవిత రాజశేఖర్ 'గరుడవేగ' వివాదం గురించి మాట్లాడారు. అది ప్రస్తుతం కోర్టులో ఉందని.. కోర్టులో తేలకముందే కొందరు ఏదేదో చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. అనవసరంగా తమ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. తప్పొప్పులు తెలుసుకోకుండా అసత్యాన్ని ప్రచారం చేయవద్దని సూచించింది. తాము నిజంగానే తప్పు చేశామని కోర్టులో తేలితే ఏ శిక్ష విధించినా తాము అంగీకరిస్తామని జీవిత రాజశేఖర్ పేర్కొన్నారు.