Begin typing your search above and press return to search.

MAA ఎన్నిక‌ల సిత్రం.. ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్లో జీవిత

By:  Tupaki Desk   |   3 Sep 2021 1:30 PM GMT
MAA ఎన్నిక‌ల సిత్రం.. ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్లో జీవిత
X
MAA ఎన్నిక‌లు అంత‌కంత‌కు హీట్ పెంచుతున్నాయి. అక్టోబ‌ర్ 10న ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం ప్ర‌క‌ట‌న జారీ చేసిన అనంత‌రం ఎవ‌రికి వారు త‌మ వ‌ర్గాన్ని సిద్ధం చేసుకుని ప్ర‌చారం హోరెత్తిస్తున్నారు. ఎవ‌రికి వారు గెలుపు ధీమాను క‌న‌బ‌రుస్తున్నారు. ఈసారి ప్ర‌ధాన‌ పోటీ ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ వ‌ర్సెస్ మంచు విష్ణు ప్యానెల్ మ‌ధ్య‌నే సాగ‌నుంద‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలొచ్చాయి.

మెగాస్టార్ అండ‌దండ‌ల‌తో ప్ర‌కాష్ రాజ్ ఇత‌రుల కంటే దూకుడుగా ప్ర‌చారంలో దూసుకుపోతుండ‌గా.. కృష్ణ‌-కృష్ణంరాజు- బాల‌కృష్ణ అండ‌దండ‌ల‌తో ఈసారి మంచు విష్ణు అధ్య‌క్షుడిగా పోటీప‌డుతున్నారు. గెలుపు ఎవ‌రిని వ‌రిస్తుంది? అన్న‌ది అటుంచితే మంచు విష్ణుకు ఈసారి మ‌హిళామ‌ణుల అండ‌దండ‌లు పుష్క‌లంగా ల‌భిస్తాయ‌ని భావించారు. కానీ ఇంత‌లోనే ఊహించ‌ని ప‌రిణామం.

మ‌హిళ‌కు అధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వాల‌ని అలా చేస్తే తాను మ‌ద్ధ‌తుగా నిలుస్తాన‌ని ప్ర‌క‌టించిన‌ విష్ణుని కాద‌ని జీవిత రాజ‌శేఖ‌ర్ ఇప్పుడు ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ లోకి జంప్ చేయ‌డం స‌ర్వ‌త్రా హాట్ టాపిక్ గా మారింది. గ‌త సీజ‌న్ కి MAA అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగిన‌ నరేష్ మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మొదట అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావించిన జీవిత రాజశేఖర్ నరేష్ ప్యానెల్ నుండి కార్యదర్శిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇంత‌లోనే జీవిత త‌న ఆలోచ‌న‌ను మార్చుకుని ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి సెక్రటరీగా పోటీ చేయనున్నారు. శుక్రవారం మీడియా స‌మావేశంలో ప్రకాష్ రాజ్ మీడియాకు ఈ విష‌యాన్ని వెల్లడించ‌నున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

అయితే ఇంత‌లోనే గేమ్ ఎలా మారింది? అన్న‌దానికి అస‌లు కార‌ణం తెర‌వెనుక మెగాస్టార్ చిరంజీవి హస్తం ఉందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి- మెగా బ్ర‌దర్ నాగ‌బాబు ఈసారి ప్రకాష్ రాజ్ కు తమ‌ మద్దతును అందిస్తున్నారు. జీవితతో చిరు చర్చలు జరిపి ప్రకాష్ రాజ్ పక్షాన ఉండేలా ఒప్పించారని క‌థ‌నాలొస్తున్నాయి. ఇది నిజంగా ఊహించ‌ని ప‌రిణామం. ఈసారి అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో జీవిత రాజ‌శేఖ‌ర్ స‌హా హేమ కూడా ఉంటార‌ని ప్ర‌చార‌మైంది. ఇప్పుడు జీవిత‌ను త‌మ‌వైపు తిప్పేసుకున్న ప్ర‌కాష్ రాజ్ త‌దుప‌రి హేమ‌కు కూడా ఓ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టి త‌మ‌వైపు తిప్పేయాల‌ని చూస్తున్న‌ట్టు క‌థ‌నాలొస్తున్న సంగ‌తి తెలిసిందే.

మ‌రోవైపు వీకే న‌రేష్ త‌న‌వ‌ర్గం ఓట్లు ఎటూ చీల‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. న‌రేష్ నుంచి చివ‌రి నిమిషంలో విష్ణుకు స‌పోర్ట్ ఉంటుందా? అంటే చెప్ప‌లేని పరిస్థితి ఉందిట. కానీ మూవీ ఆర్టిస్టుల సంఘానికి త‌న సొంత డ‌బ్బుతో భ‌వంతిని నిర్మిస్తాన‌ని విష్ణు నిజాయితీగా ప్ర‌క‌టించారు. ఎన్ని కోట్లు అయినా తానే భ‌రిస్తాన‌ని ఎవ‌రూ పైసా కూడా ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని గ‌ట్స్ చూపించారు. అంతేకాదు మా భ‌వంతి నిర్మాణం కోసం మూడు స్థ‌లాల్ని కూడా చూశాన‌ని విష్ణు ఇంత‌కుముందు ప్ర‌క‌టించారు. ఇది మా స‌భ్యుల‌ను విశేషంగా ఆక‌ర్షించింది. అందువ‌ల్ల విష్ణు వైపు బ‌ల‌మైన వ‌ర్గం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మంచు విష్ణుకి సినీపెద్ద‌ల్లో స‌హ‌జ‌న‌టి జ‌య సుధ నుంచి పూర్తిగా అండ‌దండ‌లు ఉంటాయ‌ని ప్రచార‌మ‌వుతోంది. చివ‌రిగా జీవిత ఉన్న‌ట్టుండి ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ లోకి జంప్ చేయ‌డం విచిత్ర‌మేనంటూ చ‌ర్చ వేడెక్కిస్తోంది. దీనిని బ‌ట్టి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా రాజ‌శేఖ‌ర్ ఏ ప్యాన‌ల్ నుంచి పోటీ చేస్తారు? అన్న‌ది కూడా ఆస‌క్తిక‌రంగా మారింది.

గోడ‌మీద పిల్లులు రెడీగా ఉన్నాయి. అవి ఎటు దూకుతాయో ఎవ‌రికీ తెలీదు అన్న చందంగా ఎన్నిక‌ల ముందు ఇంకా మునుముందు ఎన్నెన్ని విచిత్సాలు చోటు చేసుకుంటాయో చూడాలి. అన్న‌ట్టు సీవీఎల్ న‌ర‌సింహారావు తెలంగాణ వాదంతో బ‌రిలో దిగుతున్నారు. ఆయ‌న‌కు ఏ మేర‌కు ఓట్లు ప‌డతాయి? అన్న‌ది కాల‌మే డిసైడ్ చేస్తుంది.