Begin typing your search above and press return to search.

ఇంటర్వ్యూ ఇవ్వని పవన్.. ఒకసారి టైమిస్తే..?

By:  Tupaki Desk   |   11 April 2016 5:01 AM GMT
ఇంటర్వ్యూ ఇవ్వని పవన్.. ఒకసారి టైమిస్తే..?
X
పవన్ కల్యాణ్ పేరులో ఏదో మేజిక్ ఉంది. ఆయనకు సంబంధించిన విషయం ఏదైనా సరే చదివేందుకు చాలామంది ఆసక్తి ప్రదర్శిస్తారు. ఆయన్ను అమితంగా ఆరాధించే వారు మాత్రమే కాదు.. ఏ మాత్రం నచ్చని వారు సైతం ఆయనకు సంబంధించిన విషయాల్ని తెలుసుకునేందుకు టైమ్ వెచ్చిస్తారు. అది పవన్ ప్రత్యేకతగా చెప్పాలి. మీడియాకు దూరంగా ఉండటం.. తరచూ ఇంటర్వ్యూలు ఇవ్వటం లాంటివి ఏ మాత్రం ఇష్టపడని పవన్ కల్యాణ్.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నేపథ్యంలో.. ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వక తప్పలేదు.

గంప గుత్త ఇంటర్వ్యూలకు భిన్నంగా.. కొన్ని లిమిటెడ్ మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి.. వారితో మాట్లాడారు. సాధారణంగా సెలబ్రిటీలు.. పెద్ద పెద్ద హీరోలు తాము ఇంటర్వ్యూ లు ఇచ్చే ముందు.. ప్రశ్నలు ఏమేం ఉండాలన్న విషయాన్ని మొత్తంగా కాకున్నా.. ‘‘తప్పనిసరిగా’’ అడగాల్సిన ప్రశ్నల్ని చేర్చటం కొంతకాలంగా నడుస్తున్నదే.

అడగాల్సిన ప్రశ్నలే కాదు.. అడగకూడని ప్రశ్నల గురించి ముందే చెప్పేయటం.. ఇంటర్వ్యూ మొత్తం ఏ యాంగిల్ లో ఉండాలన్న విషయాన్ని ముందు చెప్పేసి.. సదరు మీడియా ప్రతినిధులు ఒప్పుకున్నాక మాత్రమే ‘‘ప్రత్యేక’’ ఇంటర్వ్యూలు ఇవ్వటం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. కానీ.. పవన్ తీరు అందుకు భిన్నం. నిన్నటికి నిన్న కొన్ని మీడియా సంస్థలకు మాత్రమే ప్రత్యేక ఇంటర్వ్యూ లు ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఒక్కో మీడియా సంస్థకు మినిమం గంట పాటు సమయం ఇవ్వటం ఒక విశేషం అయితే.. ఇంటర్వ్యూ చేసే ముందు.. ఏమేం ప్రశ్నలు అడగాలి? ఎలాంటి ప్రశ్నలు అడగకూడదు? లాంటి పరిమితులు విధించకుండా ఓపెన్ గా వదిలేయటం గమనార్హం.

ఈ కారణం చేతనే.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ప్రమోషన్ కోసమే ప్రత్యేక ఇంటర్వ్యూలు ప్లాన్ చేసినా.. సినిమాకు సంబంధించిన అంశాలు దాదాపు లేకపోవటం.. మిగిలిన విషయాలే ఎక్కువగా ఉండటం కనిపిస్తుంది. పవన్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత కొంతమంది మీడియా మిత్రులు మాట్లాడుతూ.. ‘‘పవన్ ఇంటర్వ్యూలు ఇవ్వడు. ఇస్తే.. మాత్రం ప్రశ్నలు వేసేందుకు ఇచ్చిన స్వేచ్ఛ బాగుంది. అంత పెద్ద స్టార్ అయి ఉండి.. అంత ఓపెన్ గా.. నిజాయితీగా ఉండటం పవన్ కు మాత్రమే చెల్లుతుంది’’ అని చెప్పటం గమనార్హం.