Begin typing your search above and press return to search.

చరణ్ నా గుండెకాయ

By:  Tupaki Desk   |   30 Dec 2021 8:45 AM GMT
చరణ్ నా గుండెకాయ
X
ఎన్టీఆర్ - చరణ్ ఇద్దరూ కూడా మొదటి నుంచి మంచి స్నేహితులు. ఒకరి సినిమా ఓపెనింగ్స్ కి ఒకరు .. ఒకరి సినిమా ఫంక్షన్స్ కి ఒకరు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే 'ఆర్ ఆర్ ఆర్' కోసం సుదీర్ఘ కాలంగా కలిసి పనిచేయవలసి రావడంతో, ఇద్దరి మధ్య అనుబంధం మరింత పెరిగింది. దానికి తోడు ఈ సినిమాలో వారు పోషించిన పాత్రలు కూడా వారి స్నేహాన్ని మరింత బలపరిచాయి. అందువలన ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎక్కడికి వెళ్లినా, సినిమాతో పాటు తమ స్నేహాన్ని గురించి కూడా ప్రస్తావించడం ఈవెంట్స్ కి ఒక నిండుదనాన్ని తీసుకొస్తోంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముందుగా ముంబైలో నిర్వహించారు .. ఆ తరువాత చెన్నైలో ఘనంగా జరిపారు. రామ్ .. చరణ్ పేరులో తమ ఇద్దరి పేర్లు కలిసున్నట్టుగానే, తాము కూడా ఎప్పటికి కలుసుంటామని ఎన్టీఆర్ అంటే, తాను చనిపోయేంతవరకూ తమ సోదర బంధం కొనసాగుతుందని చెన్నై వేదికపై చరణ్ ఎమోషనల్ అయ్యాడు. ఈ ఇద్దరి మాటలు కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక నిన్న రాత్రి 'త్రివేండ్రం'లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను చరణ్ తమ స్నేహాన్ని గురించి ప్రస్తావించాడు.

ఎన్టీఆర్ తనలో ఒక భాగమని చెప్పడంతో అక్కడికి వచ్చిన వాళ్లంతా తమ ఆనందోత్సవాలను వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ తో కలిసి పనిచేసే అవకాశం లభించడం తన అదృష్టమనీ, ఆయనతో కలిసి పనిచేసే ప్రతి నిమిషాన్ని తాను ఎంజాయ్ చేశానని అన్నాడు. ఆ తరువాత ఎన్టీఆర్ మాట్లాడుతూ .. చరిత్రలో చరణ్ తో ముడిపడిన ఒక పేజీని ఇచ్చిన రాజమౌళికి తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పాడు. చరణ్ కూడా తనలో ఒక భాగమనీ .. ఏ భాగమని అడిగితే ఎడమ భాగమని చెబుతాననీ .. ఎందుకంటే గుండె ఎడమవైపే కదా ఉంటుందని అన్నాడు.

ఎన్టీఆర్ ఆ మాట అనగానే చరణ్ గబా గబా ఆయన దగ్గరికి వచ్చి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. చరణ్ తో కలిసి 200 రోజుల పాటు పనిచేసే అవకాశాన్ని ఇచ్చిన ఆ దేవుడికి తాను థ్యాంక్స్ చెబుతున్నానని ఎన్టీఆర్ అన్నాడు. ఇక రాజమౌళి గారికి తాను ఇప్పుడు థ్యాంక్స్ చెప్పననీ, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తరువాత అప్పుడు చెబుతానని అన్నాడు. మలయాళ నేల మమ్ముట్టి .. మోహన్ లాల్ .. దుల్కర్ .. ఫహాడ్ ఫాజిల్ .. దుల్కర్ .. తోవినో థామస్ వంటి ఎంతోమంది వెర్సటైల్ ఆర్టిస్టులను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చిందనీ, ఆ నేలపై నిలబడి మాట్లాడుతున్నందుకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు.