Begin typing your search above and press return to search.

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కి 'టార్చ్ బేరర్' అవుతాడా...?

By:  Tupaki Desk   |   20 May 2020 2:30 PM GMT
జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కి టార్చ్ బేరర్ అవుతాడా...?
X
నందమూరి నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే నేడు. యాక్టింగ్ డ్యాన్స్ డైలాగ్ డెలీవరీ వీటన్నటినీ కలబోసిన నటుడు తారక రాముడు. అంతేకాకుండా వీటన్నింటకి మించి తన గొప్ప మనసుతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న హీరో. ఈ లక్షణాలే ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. ఈ రోజు ఆయన బర్త్ డే సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలతో సోషల్‌ మీడియా దద్దరిల్లిపోయింది. గతేడాది తండ్రి మరణం కారణంగా బర్త్ డే వేడుకలకు దూరమైన తారక్.. ఈ ఏడాది ప్రస్తుత పరిస్థితుల వలన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడం లేదంటూ ప్రకటించాడు. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేస్తున్నారు. యంగ్‌ టైగర్‌ ఎక్కడున్నా బాగుండాలంటూ కేక్ కట్టింగ్స్ చేసి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇక టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ తారక్ తో గల అనుబంధాన్ని పంచుకుంటున్నారు. అంతేకాకుండా టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు నాయకులు కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా విషెష్ చెప్పారు.

ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. తన తాత నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కోసం 2009 ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా వ్యవహరించారు తారక్. కానీ అప్పుడు టీడీపీ అధికారంలోకి రాలేదు. ఆ తర్వాత ఎందుకో టీడీపీ అధిష్టానం తారక్ ని దూరం పెడుతూ వచ్చింది. దానికి తగ్గట్టే ఎన్టీఆర్ కూడా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వైస్సార్సీపీ తో టచ్ లో ఉంటున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ నా కట్టె కాలే వరకు నేను మా తాత స్థాపించిన పార్టీ లోనే ఉంటాను అని క్లారిటీ ఇచ్చాడు. కానీ గత ఎన్నికలలో కూడా టీడీపీ తరపున ఎలాంటి ప్రచారంలో కూడా తారక్ పాల్గొనలేదు. ఆ ఎన్నికల్లో ప్రజలు టీడీపీని కేవలం 23 అసెంబ్లీ స్థానాలు మరియు 3 లోక్ సభ స్థానాలకు మాత్రమే పరిమితం చేసారు. అంతేకాకుండా తెలంగాణాలో కూడా పూర్తిగా దెబ్బతినింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టాలంటూ అభిమానుల నుండి ఎన్టీఆర్ కి విన్నపాలు వచ్చాయి. కానీ తారక్ దీనిపై ఎప్పుడూ స్పందించలేదు.

అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ దారుణమైన స్థితిలో ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఆశాకిరణంగా మారి తెలుగుదేశం పార్టీకి ఊపిరి పోస్తాడు అనే ఆలోచనలో నందమూరి అభిమానులు ఉన్నారు. ఈ విషయాన్ని వారు బహిరంగంగానే చెప్తున్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో టీడీపీ పగ్గాలు చేపడతారా అని ఎన్టీఆర్ ని అడిగితే 'నా జీవితంలో అప్పుడే రాని పేజీ గురించి ఇప్పుడే ఆలోచించను. ఎప్పుడూ నేను ఆ పార్టీ కార్యకర్తనే... బతికినంత కాలం తెలుగుదేశం పార్టీ ఉప్పు తినే బతకాలి. భవిష్యత్తు అంటారా.. అది ఎవరూ ఏమీ చెప్పలేం. దాని గురించి ఇప్పుడే మాట్లాడి ప్రయోజనం లేదు. ఒకవేళ నుదుటిపై రాసుంటే జరుగుతుందంతే.. సీఎం అవ్వాలంటే అంత ఈజీ కాదు' అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ పేజీ వచ్చిందని.. ఎన్టీఆర్ టీడీపీకి 'టార్చ్ బేరర్' గా మారుతాడని నందమూరి అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ నందమూరి వారసుడు పూర్తిగా సినిమాల మీద ఫోకస్ చేసి వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ టీడీపీకి టార్చ్ బేరర్ లా మారుతాడా..? లేక కేవలం నందమూరి ఫ్యామిలీకి మాత్రమే టార్చ్ బేరర్ అవుతాడా అనేది చూడాలి.